బ్యాంకుల మొండి బకాయిలు9.24 లక్షల కోట్లు | banks NPAs 9.24 trillion | Sakshi
Sakshi News home page

బ్యాంకుల మొండి బకాయిలు9.24 లక్షల కోట్లు

Published Mon, Oct 10 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

బ్యాంకుల మొండి బకాయిలు9.24 లక్షల కోట్లు

బ్యాంకుల మొండి బకాయిలు9.24 లక్షల కోట్లు

ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో 15% పెరుగుదల
వీటికి కేటాయింపులతో బ్యాంకులకు భారం
అదనపు మూలధన నిధులు కూడా అవసరం
బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ ప్రక్షాళన మరింత జాప్యం

ముంబై: దేశీయ బ్యాంకులకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కు మొండిబకాయి(ఎన్‌పీఏ)ల సమస్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ ప్రక్షాళనకు చాలా సమయం పట్టేట్టు ఉంది. పైగా అంచనా వేసిన దాని కంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుందని రాయిటర్స్ వార్తా సంస్థ పరిశోధన నివేదికలో వెల్లడైంది. కానీ, మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నట్టు బలహీనంగా ఉన్న రుణాలు, పెట్టుబడుల పునరుద్ధరణకు బ్యాంకుల ఎన్‌పీఏలను తగ్గించడం అనేది కీలకం. బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనకు ఆర్‌బీఐ నిర్దేశించిన గడువు 2017 మార్చి. అప్పటికి బ్యాంకులు తమ ఖాతాల పరంగా వసూలు కాని అన్ని రకాల మొండిబకాయిల గణాంకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఇలా ప్రకటిస్తే బ్యాంకులకు ఆ మేరకు అదనపు నిధులు అవసరం అవుతాయి. 

 ఆరు నెలల్లో 15 శాతం పెరుగుదల
రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల ఆర్‌బీఐ నుంచి సమాచార హక్కు చట్టం కింద ఒత్తిడిలో ఉన్న బ్యాంకుల రుణాల వివరాలను సేకరించింది. దీని ప్రకారం చూస్తే... గతేడాది డిసెంబర్ నాటికి ఎన్‌పీఏలు 121 బిలియన్ డాలర్లు ఉండగా.. జూన్ నాటికి 138.5 బిలియన్ డాలర్ల(రూ.9.24 లక్షల కోట్లకుపైగా)కు పెరిగిపోయినట్టు అంచనా. సుమారు 15% పెరుగుదల ఇది. వీటిలో 122 బిలియన్ డాలర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు మోస్తున్నవే.

ప్రైవేటు బ్యాంకుల వాటా 14 బిలియన్ డాలర్లు ఉండగా, విదేశీ బ్యాంకుల ఖాతాల్లోని ఎన్‌పీఏలు 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తులు అంటే 90 రోజులకుపైగా ఎలాంటి చెల్లింపులు లేని నిరర్థక ఆస్తులు, పునరుద్ధరించిన ఆస్తులు. ఖాతాల ప్రక్షాళనకు ఆర్‌బీఐ ఆదేశించాక ఎన్‌పీఏలు పెరుగుతున్నాయేకానీ, ఒత్తిడిలో ఉన్న రుణాల సంఖ్య పెరగడం లేదని, లోగడ పునరుద్ధరించిన ఆస్తులు నిరర్థక ఆస్తుల చిట్టాలోకి వచ్చి చేరుతున్నట్టు బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి.

 పీఎస్‌బీలకే శిరో భారం...
బ్యాంకుల మొండి బకాయిల్లో 88 శాతం పీఎస్‌బీలవే కావడం గమనార్హం.  మరోవైపు బాసెల్-3 అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2019 మార్చి నాటికి 27 బిలియన్ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు) మేర మూలధన నిధులు అదనంగా కావాల్సి ఉంది. ఎన్‌పీఏల సమస్య నేపథ్యంలో బ్యాలన్స్ షీటు విలువను పెంచుకునేందుకూ బ్యాంకులకు మరిన్ని నిధులు అవసరం అవుతాయి. ప్రభుత్వం నుంచి నిధుల సాయంతోపాటు స్టాక్స్ లేదా బాండ్ల విక్రయం ద్వారా నిధులు సేకరించే సామర్థ్యం పీఎస్‌బీలకు ఉన్నప్పటికీ... తక్కువ లాభాలు, బలహీన వేల్యూషన్ల కారణంగా అవరోధాలు ఎదురవుతాయన్నది విశ్లేషణ.

ముందున్నవి సవాళ్లు...
జూన్ నాటికి బ్యాంకులు 29 బిలియన్ డాలర్ల మేర రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించలేదని, ఈ రుణాలు తీసుకున్న వారు 60 రోజులకు పైగా వడ్డీ, అసలు చెల్లించని వారు కావడంతో వీటిని సైతం నిరర్థక ఆస్తులుగా ప్రకటించాల్సిన పరిస్థితి పొంచి ఉందని తెలుస్తోంది. డెట్-ఈక్విటీ స్వాప్ రేషియో పథకాన్ని ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ దీన్ని ఉపయోగించుకున్నది ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులే. అయితే, ప్రభుత్వం నిబంధనలను సులభతరం చేయడంతో భారత్‌లోని ఒత్తిడిలో ఉన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు విదేశీ ఇన్వెస్టర్లు ప్రకటించడం కొంతలో కొంత ఊరటగా భావించవచ్చు. మొండిబకాయిల విషయంలో దృఢంగానే వ్యవహరిస్తామని, అదే సమయంలో వాస్తవికంగా ఉంటామని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది 35% పెరుగుతాయి..
‘నిరర్థక ఆస్తులు కచ్చితంగా పెరుగుతున్నాయనేదే మా అభిప్రాయం. 2019 మార్చి నాటికి దేశీయ బ్యాంకులకు తక్కువలో తక్కువ 90 బిలియన్ డాలర్ల మూలధనం నిధుల అవసరం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు 35-40% వరకు పెరుగుతాయి’ అని ఫిచ్ రేటింగ్స్ డెరైక్టర్ సశ్వత్ గుహ అన్నారు. ఇక, బ్యాంకుల ప్రక్షాళణపై దృష్టి సారించడం వల్ల రుణాల వృద్ధి  2 దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఇది ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులకు విఘాతం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.1%కే పరిమితం కావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వచ్చే దశాబ్దంలో 25 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామన్న ప్రధాని మోదీ హామీకి, మరిన్ని ఉద్యోగాల కల్పనకు వృద్ధి రేటు కనీసం 8% ఉండాలన్నది వారి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement