ఎన్పీఏలపై నేను దృష్టిపెట్టలేదు
కాస్త పట్టించుకుని ఉండాల్సింది: దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించేటపుడు బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్‌బీఐ గవర్నరుగా తాను తగిన దృష్టి పెట్టలేదని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. ఈ విషయాన్ని తాను మరికొంత పట్టించుకుని ఉండాల్సిందని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడానికి అప్పట్లో తగిన దృష్టి సారించకపోవడం కూడా కారణం కావచ్చని ఆయన చెప్పారు.
మొండిబకాయిల సమస్య కట్టడికి ఇంతకుముందే ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ చేసిన ప్రకటన నేపథ్యంలో సుబ్బారావు తాజా వాఖ్యలు చేశారు. ప్రపంచం తిరిగి లేమన్ తరహా సంక్షోభాన్ని చూస్తుందా? అన్న ప్రశ్నకు సుబ్బారావు సమాధానమిస్తూ... అంత తీవ్రస్థాయి కాకున్నా మరొక ఆర్థిక సంక్షోభం ఉంటుందన్నది తన అభిప్రాయమని తెలిపారు.