D Subbarao
-
నోట్ల రద్దు.. సృజనాత్మక విధ్వంసం!
1991 సంస్కరణల తరువాత అంతటి పాలసీ నిర్ణయం ఇదే • నల్లధనాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేశారు • విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకు ఖర్చులు తగ్గాయి • అందుకే సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకున్నాయి • ఐడీఆర్‌బీటీ అంతర్జాతీయ సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని... సృజనాత్మక విధ్వంసంగా రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు అభివర్ణించారు. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత పాలసీ పరంగా ప్రభుత్వం ఆవిష్కరించిన సృజనాత్మక విధ్వంసం ఇదేనని ఆయన చెప్పారు. ‘‘నా ఉద్దేశం ప్రకారం ఇదో సృజనాత్మక విధ్వంసం. కాకపోతే ప్రత్యేకమైన సృజనాత్మక విధ్వంసం. ఎందుకంటే నల్లధనం అనేది ఒక విధ్వంసక సృష్టి. దాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేయటానికి తీసుకున్న నిర్ణయం కనక దీన్ని అలా అభివర్ణిస్తున్నా’’ అని వివరించారాయన. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో సృజనాత్మక విధ్వంసమనేది అత్యంత అవసరమని, ఇదే ఆర్థికప్రగతికి బాటలు వేస్తుందని చెప్పారాయన. దేశంలో చెలామణిలో ఉన్న నగదులో 86 శాతంగా ఉన్న రూ.1000, 500 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్’ (ఐసీడీసీఎన్) అంశంపై గురువారమిక్కడ జరిగిన 18వ అంతర్జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ మీద శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘స్మార్ట్ఫోన్లు వచ్చాక సాధారణ ఫోన్లతో పాటూ కెమెరాలు, సీడీలు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ వంటివి కనుమరుగయ్యాయి. అదెలాగైతే జరిగిందో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా పాత విధానాలకు స్వస్తి పలికేలా చేస్తుంది. సరికొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతుంది’’ అని వివరించారు. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులకు దారి తీస్తుందన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు దేశ ఆర్ధిక వ్యవస్థ గతిని మార్చేస్తాయని, సంప్రదాయ బ్యాంకింగ్ రంగంలో వీటి సేవలు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. నియంత్రణల భారాన్ని తగ్గించడంతో పాటూ 7–8% వరకూ ఉండే సంప్రదాయ బ్యాంకుల రుణాల ఖర్చును ఈ కంపెనీలు 2 %కి తగ్గిస్తాయన్నారు. ఆర్ధిక సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకి డిపాజిట్లు..: బ్యాంకింగ్, ఆర్ధిక సేవల రంగాల్లో విధ్వంసక ఆవిష్కరణలొస్తున్నాయంటూ.. ‘‘వీటిని కేవలం చెల్లింపుల వ్యవస్థకే పరిమితం చేయకూడదు. పొదుపు, రుణాలు, మైక్రో ఇన్సూరెన్స్‌లోనూ వినియోగించాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకోవటానికి కారణం ఈ ఆవిష్కరణల వల్ల ఖర్చులు తగ్గాయి. మరోవంక ఈ విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకుల సామర్థ్యం, సేవలు మెరుగవుతాయి. వాటిపై నమ్మకం పెరుగుతుంది’’ అని దువ్వూరి వివరించారు. బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక అభివృద్ధి కోసం ఐఆర్డీబీటీ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయటం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల అనలటిక్స్, మొబైల్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పేమెంట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి, ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఆర్.కె.శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుపై అనుభవం లేకనే ఇక్కట్లు
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విజయవాడ (వన్ టౌన్): నోట్ల రద్దు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగకపోవటం వల్ల అటు ప్రభుత్వ పెద్దలకు గానీ, ఆర్బీఐ అధికారులకు గానీ దాని అనుభావాలు తెలియలేదని, దీని వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ఆర్బీఐ పని కేవలం నగదును ముద్రించి జారీ చేయటం మాత్రమే కాదన్నారు. దేశంలో బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరించటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, వడ్డీ రేట్లను సమీక్షించటం, ధరల పెరుగుదలను అరికట్టడం వంటి అనేక రకాల బాధ్యతలను ఆర్బీఐ నిర్వహిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది చాలా దేశాల్లో జరిగే ప్రక్రియేనని చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ముందుగా ప్రకటిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. కానీ నోట్ల రద్దు ఎందుకు చేశారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పెద్దలు పలు రకాల ప్రకటనలు చేయటంతో తాను అయోమయానికి గురయ్యానని చెప్పారు. నోట్ల రద్దు ఫలితాలు మాత్రం ఇప్పటికిప్పుడు రావని, వాటికి రెండు మూడేళ్ల సమయం పడుతుందన్నారు. రానున్న కాలంలో పన్ను మీద ఆదాయం కనీసం రూ.50 వేల కోట్ల మేర రాకుంటే మాత్రం ఈ నిర్ణయం వృథా ప్రయత్నమేనని అభిప్రాయపడ్డారు. కాగా, నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలకు వ్యక్తమవుతున్న సందేహాలకు ఆర్బీఐ గవర్నర్ వంటి వ్యక్తులు సమాధానాలిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
ఎన్పీఏలపై నేను దృష్టిపెట్టలేదు
కాస్త పట్టించుకుని ఉండాల్సింది: దువ్వూరి సుబ్బారావు న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించేటపుడు బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ గవర్నరుగా తాను తగిన దృష్టి పెట్టలేదని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. ఈ విషయాన్ని తాను మరికొంత పట్టించుకుని ఉండాల్సిందని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడానికి అప్పట్లో తగిన దృష్టి సారించకపోవడం కూడా కారణం కావచ్చని ఆయన చెప్పారు. మొండిబకాయిల సమస్య కట్టడికి ఇంతకుముందే ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఆర్బీఐ గవర్నర్ రాజన్ చేసిన ప్రకటన నేపథ్యంలో సుబ్బారావు తాజా వాఖ్యలు చేశారు. ప్రపంచం తిరిగి లేమన్ తరహా సంక్షోభాన్ని చూస్తుందా? అన్న ప్రశ్నకు సుబ్బారావు సమాధానమిస్తూ... అంత తీవ్రస్థాయి కాకున్నా మరొక ఆర్థిక సంక్షోభం ఉంటుందన్నది తన అభిప్రాయమని తెలిపారు. -
ప్రభుత్వంతో విభేదాలు..తెరవెనకే ఉండాలి: దువ్వూరి
ముంబై: వడ్డీ రేట్ల నిర్ణయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)తో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి మెరుగుపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఎంపీసీతోపాటు తాను ఇటీవలే తీసుకొచ్చిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకంలోని అంశాలపై దువ్వూరి ‘పీటీఐ’తో మాట్లాడారు. క్రమశిక్షణ అలవడుతుంది... ‘ఎంపీసీ ఆర్బీఐ స్వతంత్రతను బలహీనపరుస్తుందని నేను అనుకోవడం లేదు. పైగా స్వయం ప్రతిపత్తిని పెంచుతుంది. ఎంపీసీ ఏర్పాటుతో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఆర్బీఐ, ప్రభుత్వం రెండు వైపులా క్రమశిక్షణ సాధ్యమవుతుంది’ అని దువ్వూరి చెప్పారు. ఎంపీసీలో గవర్నర్‌కు వీటో అధికారం కల్పించడాన్ని స్వాగతించారు. ఎంపీసీ అనేది మనం ఆవిష్కరించినది కాదని, ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు పాటిస్తున్న ఉత్తమ విధానమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, పరిణతి సాధించిన ప్రజాస్వామ్య దేశాల్లో ఈ విధానం ఉందని, ఇప్పుడు దాన్ని మనం అనుసరించబోతున్నామని చెప్పారు. ఆర్బీఐ శక్తివంతంగానే వ్యవహరించాలి.. పరపతి విధానం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శక్తివంతంగానే ఉండాలని, ప్రభుత్వం విభేదించినా తన స్వతంత్రకు భంగం వాటిల్లనంతవరకు పట్టించుకోనక్కర్లేదని అన్నారు. ‘ఎన్నికలతో ముడిపడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో విభేదాలు సహజమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ద్రవ్యోల్బణం కంటే వృద్ధి రేటుకే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ సెంట్రల్ బ్యాంకు మాత్రం ధరల స్థిరత్వం కోసం దీర్ఘకాల దృష్టితో వ్యవహరించాలి. దీని వల్ల స్వల్ప కాలంలో వృద్ధిని త్యాగం చేయాల్సి రావచ్చు’ అని సుబ్బారావు చెప్పారు. ప్రభుత్వ దృక్పథం పట్ల ఆర్బీఐ గవర్నర్ సున్నితంగానే ఉండాలని, అదే సమయంలో ఆర్బీఐ స్వతంత్రతను కూడా గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విభేదాలు ఏమున్నా అవి తెరవెనకే ఉండిపోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చిదంబరమంత ఉదారత నాకు లేదు... తాను రచించిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకానికి ఆమోదం తెలిపే విషయంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎంతో ఉదారతతో, ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని దువ్వూరి సుబ్బారావు అన్నారు. కానీ, తాను మాత్రం ఆయన పట్ల అంత ఉదారతతో వ్యవహరించ లేదని స్పష్టం చేశారు. తాను ఈ పుస్తకంలో చిదంబరంతో విభేదించిన విషయాలు మాత్రమే కాకుండా ఆయనలోని సానుకూలతల గురించి కూడా మాట్లాడానని చెప్పారు. ఆయన పదవీ కాలం ఓ పాఠం: చిదంబరం ‘ఆర్బీఐ గవర్నర్‌గా డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల పదవీ కాలం.. నేర్చుకోదగిన, నిజాయితీతో కూడుకున్నది. ఆయన మేథ స్సు, కచ్చితత్వం పుస్తకంలోని ప్రతి పేజీలోనూ ప్రస్ఫుటమవుతోంది’ అంటూ హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్ అనే పుస్త కంలో చిదంబరం స్వయంగా రాసి తన సంతకం చేశారు. -
సుబ్బారావు సంతకంతోనే కరెన్సీ నోట్లు!
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ డి. సుబ్బారావు సంతకంతో కరెన్సీ నోట్లు ముద్రించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సుబ్బారావు పదవీ విరమణ తర్వాత రఘురామ్ రాజన్ 2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2014 జనవరి నుంచి రాజన్ సంతకంతో కరెన్సీ నోట్లు ముద్రించాలని ఆర్బీఐ అన్ని ముద్రణాలయాలకు ప్రకటన జారీ చేసింది. మధ్యప్రదేశ్ లోని దెవాస్ ముద్రాణాలయం దీన్ని అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించింది. మాజీ గవర్నర్ సంతకంతోనే రెండు నెలల పాటు 22.6 కోట్ల నోట్లు ముద్రించింది. ఇందులో 20, 100, 500 నోట్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 37 కోట్లు. కాగ్ నివేదికతో ఈ విషయం వెలుగు చూసింది. ఆర్బీఐ కార్యాలయాలు ఈ నోట్లను తిరస్కరించడంతో దెవాస్ ముద్రాణాలయం మేల్కోంది. -
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ అవసరం
ముంబై: మోసపూరిత పథకాల నుంచి మదుపరులను రక్షించాల్సిన బాధ్యత ఇటు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తో పాటు అటు ప్రభుత్వంపైన కూడా ఉందని ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రాజ్యభాష పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత పథకాల నుంచి ప్రజలను దూరంగా ఉంచడానికి ద్విముఖ వ్యూహాన్ని ఆయన సూచించారు. ఇందులో ఒకటి ప్రజలను చైతన్యవంతులను చేయడం ఒకటని పేర్కొన్నారు. మరొకటి సామాన్యుని పొదుపులు అధికారిక ఆర్థిక వ్యవస్థకు మరల్చే విధంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచడమని వివరించారు. -
కొత్త బ్యాంక్ లెసైన్సులకు మరికొంత సమయం: ఆర్బీఐ
ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.