ప్రభుత్వంతో విభేదాలు..తెరవెనకే ఉండాలి: దువ్వూరి
ముంబై: వడ్డీ రేట్ల నిర్ణయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)తో ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి మెరుగుపడుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఎంపీసీతోపాటు తాను ఇటీవలే తీసుకొచ్చిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకంలోని అంశాలపై దువ్వూరి ‘పీటీఐ’తో మాట్లాడారు.
క్రమశిక్షణ అలవడుతుంది...
‘ఎంపీసీ ఆర్‌బీఐ స్వతంత్రతను బలహీనపరుస్తుందని నేను అనుకోవడం లేదు. పైగా స్వయం ప్రతిపత్తిని పెంచుతుంది. ఎంపీసీ ఏర్పాటుతో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఆర్‌బీఐ, ప్రభుత్వం రెండు వైపులా క్రమశిక్షణ సాధ్యమవుతుంది’ అని దువ్వూరి చెప్పారు. ఎంపీసీలో గవర్నర్‌కు వీటో అధికారం కల్పించడాన్ని స్వాగతించారు. ఎంపీసీ అనేది మనం ఆవిష్కరించినది కాదని, ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు పాటిస్తున్న ఉత్తమ విధానమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, పరిణతి సాధించిన ప్రజాస్వామ్య దేశాల్లో ఈ విధానం ఉందని, ఇప్పుడు దాన్ని మనం అనుసరించబోతున్నామని చెప్పారు.
ఆర్‌బీఐ శక్తివంతంగానే వ్యవహరించాలి..
పరపతి విధానం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శక్తివంతంగానే ఉండాలని, ప్రభుత్వం విభేదించినా తన స్వతంత్రకు భంగం వాటిల్లనంతవరకు పట్టించుకోనక్కర్లేదని అన్నారు. ‘ఎన్నికలతో ముడిపడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో విభేదాలు సహజమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ద్రవ్యోల్బణం కంటే వృద్ధి రేటుకే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ సెంట్రల్ బ్యాంకు మాత్రం ధరల స్థిరత్వం కోసం దీర్ఘకాల దృష్టితో వ్యవహరించాలి. దీని వల్ల స్వల్ప కాలంలో వృద్ధిని త్యాగం చేయాల్సి రావచ్చు’ అని సుబ్బారావు చెప్పారు. ప్రభుత్వ దృక్పథం పట్ల ఆర్‌బీఐ గవర్నర్ సున్నితంగానే ఉండాలని, అదే సమయంలో ఆర్‌బీఐ స్వతంత్రతను కూడా గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విభేదాలు ఏమున్నా అవి తెరవెనకే ఉండిపోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
చిదంబరమంత ఉదారత నాకు లేదు...
తాను రచించిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకానికి ఆమోదం తెలిపే విషయంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎంతో ఉదారతతో, ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని దువ్వూరి సుబ్బారావు అన్నారు. కానీ, తాను మాత్రం ఆయన పట్ల అంత ఉదారతతో వ్యవహరించ లేదని స్పష్టం చేశారు. తాను ఈ పుస్తకంలో చిదంబరంతో విభేదించిన విషయాలు మాత్రమే కాకుండా ఆయనలోని సానుకూలతల గురించి కూడా మాట్లాడానని చెప్పారు.
ఆయన పదవీ కాలం ఓ పాఠం: చిదంబరం
‘ఆర్‌బీఐ గవర్నర్‌గా డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల పదవీ కాలం.. నేర్చుకోదగిన, నిజాయితీతో కూడుకున్నది. ఆయన మేథ స్సు, కచ్చితత్వం పుస్తకంలోని ప్రతి పేజీలోనూ ప్రస్ఫుటమవుతోంది’ అంటూ హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్ అనే పుస్త కంలో చిదంబరం స్వయంగా రాసి తన సంతకం చేశారు.