ఐడీఆర్‌బీటీ కార్యక్రమంలో ఏఎస్ రామశాస్త్రి, దువ్వూరి సుబ్బారావు, శ్యామసుందర్ (ఎడమ మూడో వ్యక్తి నుంచి కుడికి)
1991 సంస్కరణల తరువాత అంతటి పాలసీ నిర్ణయం ఇదే
• నల్లధనాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేశారు
• విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకు ఖర్చులు తగ్గాయి
• అందుకే సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకున్నాయి
• ఐడీఆర్‌బీటీ అంతర్జాతీయ సదస్సులో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి వ్యాఖ్యలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని... సృజనాత్మక విధ్వంసంగా రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు అభివర్ణించారు. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత పాలసీ పరంగా ప్రభుత్వం ఆవిష్కరించిన సృజనాత్మక విధ్వంసం ఇదేనని ఆయన చెప్పారు. ‘‘నా ఉద్దేశం ప్రకారం ఇదో సృజనాత్మక విధ్వంసం. కాకపోతే ప్రత్యేకమైన సృజనాత్మక విధ్వంసం. ఎందుకంటే నల్లధనం అనేది ఒక విధ్వంసక సృష్టి. దాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేయటానికి తీసుకున్న నిర్ణయం కనక దీన్ని అలా అభివర్ణిస్తున్నా’’ అని వివరించారాయన. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో సృజనాత్మక విధ్వంసమనేది అత్యంత అవసరమని, ఇదే ఆర్థికప్రగతికి బాటలు వేస్తుందని చెప్పారాయన. దేశంలో చెలామణిలో ఉన్న నగదులో 86 శాతంగా ఉన్న రూ.1000, 500 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేసిన సంగతి తెలిసిందే.
‘డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అండ్ నెట్‌వర్కింగ్’ (ఐసీడీసీఎన్) అంశంపై గురువారమిక్కడ జరిగిన 18వ అంతర్జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ మీద శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సాధారణ ఫోన్లతో పాటూ కెమెరాలు, సీడీలు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ వంటివి కనుమరుగయ్యాయి. అదెలాగైతే జరిగిందో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా పాత విధానాలకు స్వస్తి పలికేలా చేస్తుంది. సరికొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతుంది’’ అని వివరించారు. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులకు దారి తీస్తుందన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు దేశ ఆర్ధిక వ్యవస్థ గతిని మార్చేస్తాయని, సంప్రదాయ బ్యాంకింగ్ రంగంలో వీటి సేవలు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. నియంత్రణల భారాన్ని తగ్గించడంతో పాటూ 7–8% వరకూ ఉండే సంప్రదాయ బ్యాంకుల రుణాల ఖర్చును ఈ కంపెనీలు 2 %కి తగ్గిస్తాయన్నారు. ఆర్ధిక సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు.
తక్కువ వడ్డీకి డిపాజిట్లు..: బ్యాంకింగ్, ఆర్ధిక సేవల రంగాల్లో విధ్వంసక ఆవిష్కరణలొస్తున్నాయంటూ.. ‘‘వీటిని కేవలం చెల్లింపుల వ్యవస్థకే పరిమితం చేయకూడదు. పొదుపు, రుణాలు, మైక్రో ఇన్సూరెన్స్‌లోనూ వినియోగించాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకోవటానికి కారణం ఈ ఆవిష్కరణల వల్ల ఖర్చులు తగ్గాయి. మరోవంక ఈ విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకుల సామర్థ్యం, సేవలు మెరుగవుతాయి. వాటిపై నమ్మకం పెరుగుతుంది’’ అని దువ్వూరి వివరించారు. బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక అభివృద్ధి కోసం ఐఆర్‌డీబీటీ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయటం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల అనలటిక్స్, మొబైల్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పేమెంట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి, ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఆర్.కె.శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు.