IDRBT
-
‘ఆ వార్తతో మాకు సంబంధం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆధార్ సమాచారానికి సరైన భద్రత లేదని, సైబర్ దాడి జరిగితే ఊహించని నష్టం జరుగుతుందంటూ నిన్న (బుధవారం) మీడియాలో వచ్చిన వార్తకు, తమకు ఏ సంబంధం లేదని ఆర్బీఐ అనుబంధ ఐడీఆర్‌బీటీ (ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ) పేర్కొంది. కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోని అంశాలను ఆర్బీఐ పరిశోధకులకు ఆపాదించారనీ, సదరు నివేదికలో ఆర్‌బీఐకిగానీ, తమకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నివేదిక తయారు చేసిన అధ్యాపకుడు ఎస్ అనంత్ తమ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పని చేస్తున్నారని ఐడీఆర్‌బీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నోట్ల రద్దు.. సృజనాత్మక విధ్వంసం!
1991 సంస్కరణల తరువాత అంతటి పాలసీ నిర్ణయం ఇదే • నల్లధనాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేశారు • విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకు ఖర్చులు తగ్గాయి • అందుకే సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకున్నాయి • ఐడీఆర్‌బీటీ అంతర్జాతీయ సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని... సృజనాత్మక విధ్వంసంగా రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు అభివర్ణించారు. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత పాలసీ పరంగా ప్రభుత్వం ఆవిష్కరించిన సృజనాత్మక విధ్వంసం ఇదేనని ఆయన చెప్పారు. ‘‘నా ఉద్దేశం ప్రకారం ఇదో సృజనాత్మక విధ్వంసం. కాకపోతే ప్రత్యేకమైన సృజనాత్మక విధ్వంసం. ఎందుకంటే నల్లధనం అనేది ఒక విధ్వంసక సృష్టి. దాన్ని సృజనాత్మకంగా ధ్వంసం చేయటానికి తీసుకున్న నిర్ణయం కనక దీన్ని అలా అభివర్ణిస్తున్నా’’ అని వివరించారాయన. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో సృజనాత్మక విధ్వంసమనేది అత్యంత అవసరమని, ఇదే ఆర్థికప్రగతికి బాటలు వేస్తుందని చెప్పారాయన. దేశంలో చెలామణిలో ఉన్న నగదులో 86 శాతంగా ఉన్న రూ.1000, 500 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్’ (ఐసీడీసీఎన్) అంశంపై గురువారమిక్కడ జరిగిన 18వ అంతర్జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ మీద శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘స్మార్ట్ఫోన్లు వచ్చాక సాధారణ ఫోన్లతో పాటూ కెమెరాలు, సీడీలు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ వంటివి కనుమరుగయ్యాయి. అదెలాగైతే జరిగిందో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా పాత విధానాలకు స్వస్తి పలికేలా చేస్తుంది. సరికొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతుంది’’ అని వివరించారు. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులకు దారి తీస్తుందన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు దేశ ఆర్ధిక వ్యవస్థ గతిని మార్చేస్తాయని, సంప్రదాయ బ్యాంకింగ్ రంగంలో వీటి సేవలు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. నియంత్రణల భారాన్ని తగ్గించడంతో పాటూ 7–8% వరకూ ఉండే సంప్రదాయ బ్యాంకుల రుణాల ఖర్చును ఈ కంపెనీలు 2 %కి తగ్గిస్తాయన్నారు. ఆర్ధిక సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకి డిపాజిట్లు..: బ్యాంకింగ్, ఆర్ధిక సేవల రంగాల్లో విధ్వంసక ఆవిష్కరణలొస్తున్నాయంటూ.. ‘‘వీటిని కేవలం చెల్లింపుల వ్యవస్థకే పరిమితం చేయకూడదు. పొదుపు, రుణాలు, మైక్రో ఇన్సూరెన్స్‌లోనూ వినియోగించాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా సంప్రదాయ బ్యాంకులు నిలదొక్కుకోవటానికి కారణం ఈ ఆవిష్కరణల వల్ల ఖర్చులు తగ్గాయి. మరోవంక ఈ విధ్వంసక ఆవిష్కరణలతో బ్యాంకుల సామర్థ్యం, సేవలు మెరుగవుతాయి. వాటిపై నమ్మకం పెరుగుతుంది’’ అని దువ్వూరి వివరించారు. బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక అభివృద్ధి కోసం ఐఆర్డీబీటీ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయటం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల అనలటిక్స్, మొబైల్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పేమెంట్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి, ఐఐటీ ముంబై ప్రొఫెసర్ ఆర్.కె.శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!
బి. సాంబమూర్తి ఎంపిక! 9 పీఎస్‌యూ బ్యాంకుల చైర్మన్ల తుది జాబితా సిద్ధం ఎండీ సీఈవో పోటీలో 50 మంది బ్యాంకు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో పావు శాతం తగ్గనున్న ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టాల ఊబిలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను గట్టెక్కించడానికి బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తికి చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పనున్నారా? అత్యంత విస్వశనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న బులుసు సాంబమూర్తిని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. ఈయన్ను బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 1976లో సిండికేట్ బ్యాంకుతో వృత్తిని ప్రారంభించిన ఈ చార్టర్డ్ అకౌంటెంట్‌కు ఆ తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారీగా పెరిగిపోయిన ఎన్పీఏలతో సతమతవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను తెలుగువాడైన సాంబ మూర్తి గట్టెక్కించగలడని ఆర్థిక శాఖ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్ రాజేంద్రన్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయటం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్రం సీఎండీ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పేరుతో రెండుగా విభజించింది. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీ ఈవోగా నియమించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టు భర్తీపై దృష్టి సారించారు. దీంతో పాటు మరో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల ఎంపిక పూర్తి చేసిందని, త్వరలోనే ఈ జాబితాకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది. ఎండీ పోస్ట్‌కు డిమాండ్ వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పోస్ట్‌లకు పోటీ చాలా అధికంగా ఉంది. సుమారు అయిదు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఎండీ, సీఈవో పోస్టుల కోసం 50 మందికిపైగా పోటీపడుతున్నారు. వీరిని ఎంపిక చేసే బాధ్యతను ఆర్బీఐ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ హే గ్రూపునకు అప్ప చెప్పింది. ప్రస్తుతం ఈడీగా ఉంటూ ఎండీ, సీఈవోగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కల్రా వారం రోజుల్లో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని, అందులో ఎంపికైతే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తగ్గింపుపై నేడోరేపో నిర్ణయం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు తగ్గింపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ రెపో రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గించినా ఇంత వరకు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు చేరవేయలేదు. గురువారం సమావేశంలో బేస్ రేటును పావు శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25 శాతంగా ఉంది. ప్రచారంలో ఉన్న చైర్మన్ల జాబితా బ్యాంకు పేరు ప్రతిపాదిత చైర్మన్ ఆంధ్రాబ్యాంక్ బి.సాంబమూర్తి పంజాబ్ నేషనల్ సుమిత్ బోస్ ఓబీసీ జి.సి.చతుర్వేది కెనరా టి.ఎన్.మనోహరన్ బ్యాంక్ ఆఫ్ బరోడా రవి వెంకటేశన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జి.పద్మనాభన్ ఇండియన్ ఓవర్సీస్ ఎం.బాలచంద్రన్ విజయా బ్యాంక్ జి.నారాయణన్ ఇండియన్ బ్యాంక్ టి.సి.వి సుబ్రమణియన్ -
ఉజ్వల కెరీర్.. బ్యాంకింగ్.
గెస్ట్ కాలమ్ ‘బ్యాంకింగ్ రంగం.. బ్యాంకుల్లో కొలువులు అంటే కేవలం మనకు కనిపించే క్లరికల్, ఆఫీసర్ పోస్ట్‌లు మాత్రమే కాదు. బ్యాంకింగ్ రంగంలో మరెన్నో విభాగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనూ టెక్నాలజీ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా బ్యాంకుల్లో ఐటీ విభాగంలో ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’ అంటున్నారు.. టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవల ఆవశ్యకతను గుర్తించి ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి. బ్యాంకింగ్ రంగంలోనూ రీసెర్చ్ అవకాశాలకూ కొదవ లేదని ఆయన పేర్కొంటున్నారు. ఐఐటీ చెన్నైలో పీహెచ్డీ చేసి ఆర్బీఐలో పలు విభాగాల్లో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం గడించి.. ప్రసుతం ఐడీఆర్‌బీటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రామశాస్త్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అకడమిక్ + ప్రొఫెషనల్ అప్రోచ్ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1995లో ఏర్పాటు చేసిన సంస్థ ఐడీఆర్‌బీటీ. దీనికి ప్రధాన కారణం ఆ రోజుల్లో బ్యాంకుల్లో టెక్నాలజీ వినియోగం, అవగాహన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బ్యాంకులు టెక్నాలజీని అనుసరించేందుకు, అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఐడీఆర్‌బీటీని ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఏర్పాటైన నాటి నుంచి బ్యాంకింగ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఎంటెక్ వంటి అకడమిక్ కోర్సులు, బ్యాంక్ ఆఫీసర్లకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్లోనూ రీసెర్చ్ అవకాశాలు రీసెర్చ్ అంటే కేవలం సైన్స్, ఇంజనీరింగ్కే పరిమితం కాదు. బ్యాంకింగ్లోనూ ఈ అవకాశం ఉంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్‌లోని క్రిప్టోగ్రఫీ ఫండమెంటల్ రీసెర్చ్ బ్యాంకింగ్‌లో ఆవిష్కరణలకూ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో మొబైల్ పేమెంట్స్, అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బయో మెట్రిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మొదలైనవి ముఖ్యమైన రీసెర్చ్ అంశాలుగా ఉన్నాయి. బ్యాంకు కొలువులకు సరితూగే అకడమిక్స్ నేటి యువతలో బ్యాంకు కొలువులంటే ఎనలేని క్రేజ్ అనేది నిస్సందేహం. అకడమిక్స్ పరంగా ఎకనామిక్స్, బ్యాంకింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఆడిటింగ్ నేపథ్యం ఉంటే సంప్రదాయ బ్యాంకు కొలువులకు సరితూగుతారు. కానీ బ్యాంకులు అన్ని నేపథ్యాల అభ్యర్థులను నియమించుకుని తమకు అవసరమైన రీతిలో శిక్షణనిస్తున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా బ్యాంకులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవల్లో సాంకేతికతను (ఉదా: ఏటీఎం, ఇంటర్నెట్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్) అమలు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కొత్త టెక్నాలజీలను వినియోగించి మరిన్ని కొత్త సేవలు, ఉత్పత్తులు రూపొందించడంలో కృషి చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. జనరల్ పోస్ట్‌లతోపాటు ప్రత్యేకంగా ఐటీ విభాగాల్లో టెక్నాలజీ స్పెషలిస్ట్‌ల నియామకాలు చేపడుతున్నాయి. ఐడీఆర్బీటీలో అకడమిక్ ఎంట్రీ ప్రస్తుతం ఐడీఆర్‌బీటీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తోంది. హెచ్‌సీయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరుగుతుంది. ఎంటెక్‌లో బ్యాంకింగ్ టెక్నాలజీ, పేమెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకులతోపాటు సాఫ్ట్వేర్ సంస్థలు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్న ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పీహెచ్డీ విషయానికొస్తే ఎన్నో అంశాలపై రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కు సంబంధించి రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. భవిష్యత్తు ఉజ్వలం బ్యాంకింగ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. కారణం.. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులే. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, జన్‌ధన్ యోజన వంటి పథకాల ప్రారంభం కారణంగా బ్యాంకులు దేశంలో ప్రతి ఒక్కరికీ సేవలందించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వీటి సమర్థ అమలుకు కార్యకలాపాల విస్తరణ ఆవశ్యకత... ఫలితంగా భారీఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు వంటివి కూడా ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు మార్గం వేస్తున్నాయి. మరెన్నో చిన్న బ్యాంకులు కూడా ఈ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో వేల సంఖ్యలో కొలువులకు మార్గం వేసేవే. కొత్తగా వచ్చే బ్యాంకులు కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అధిక శాతం అవకాశాలు కల్పించనున్నాయి. కారణం.. అవి ప్రారంభంలో పూర్తి టెక్నాలజీ బ్యాంకులుగా రానుండటం. అవసరమైన నైపుణ్యాలు బ్యాంకులు ఇప్పుడు అన్ని నేపథ్యాలు ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఔత్సాహికులకు కావాల్సిందల్లా నిబద్ధతతో పని చేయాలనే దృక్పథం. ప్రస్తుతం బ్యాంకులు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ టెస్ట్‌లలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్‌లను పరీక్షిస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అటు టెక్నాలజీ కోణంలోనూ డేటా సెంటర్స్, నెట్వర్క్స్, డేటా బేసెస్ తదితర విభాగాల్లో.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపైనా బ్యాంకులు ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్స్, ఎథికల్ హ్యాకర్స్ వంటి నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికితోడు డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్, అనలిటిక్స్‌లో నైపుణ్యాలు కూడా బ్యాంకు కొలువులకు మార్గం వేస్తాయి. అకడమిక్స్, కమ్యూనికేషన్ రెండూ ఉంటేనే నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగమైనా ఔత్సాహికులకు అకడమిక్స్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా మారాయి. దీంతో విద్యార్థులు ముందుగా అకడమిక్స్‌లో పట్టు సాధించాలి. తర్వాత కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్న రంగానికి సంబంధించి ఆప్టిట్యూడ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా కష్టపడే తత్వం, నిరంతరం నేర్చుకునే నైపుణ్యాలు ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు! వృత్తిపరమైన సంతృప్తి దేశంలో బ్యాంకింగ్ రంగం నిరంతరం వృద్ధి చెందుతున్న రంగం. సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి సాధిస్తుందని అంచనా. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ ఉన్న రంగం బ్యాంకింగ్. ఒకవైపు సుస్థిర భవిష్యత్తును, మరో వైపు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్నో గ్రామాల్లో బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది.. అన్ని వర్గాల ఉన్నతికి ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారు. అదే విధంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వంటి చర్యల కారణంగా పేద ప్రజలకు కూడా సహకారం అందించగలుగుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకుల్లో పనిచేయడం వల్ల వ్యక్తిగత లబ్ధితోపాటు వృత్తిపరమైన సంతృప్తిని కూడా పొందొచ్చు. -
నేడు నగరానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్బీఐ నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆర్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులతో విడివిడిగా భేటీ అవుతారు. సాయంత్రం మాసాబ్‌ట్యాంకులోని ఐడీఆర్బీటీలో జరిగే బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 16న ఆర్బీఐలో జరిగే సెంట్రల్ బోర్డు మీటింగ్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం పార్క్ హయత్ హోటల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెన్యా గవర్నర్ ప్రొఫెసర్ జుగునా ఎన్ దుంగుతో సమావేశమవుతారు. అనంతరం ముంబై వెళ్తారు.