ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు! | B. Sambamurthy Andhra Bank new chairman | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!

Published Thu, Jun 4 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!

ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!

 బి. సాంబమూర్తి ఎంపిక!
 9 పీఎస్‌యూ బ్యాంకుల చైర్మన్ల తుది జాబితా సిద్ధం
 ఎండీ సీఈవో పోటీలో 50 మంది బ్యాంకు ఉన్నతాధికారులు
 రెండు రోజుల్లో పావు శాతం తగ్గనున్న ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టాల ఊబిలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను గట్టెక్కించడానికి బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తికి చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పనున్నారా? అత్యంత విస్వశనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న బులుసు సాంబమూర్తిని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది.
 
 ఈయన్ను బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 1976లో సిండికేట్ బ్యాంకుతో వృత్తిని ప్రారంభించిన ఈ చార్టర్డ్ అకౌంటెంట్‌కు ఆ తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారీగా పెరిగిపోయిన ఎన్‌పీఏలతో సతమతవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను తెలుగువాడైన సాంబ మూర్తి గట్టెక్కించగలడని ఆర్థిక శాఖ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
 
 ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్ రాజేంద్రన్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయటం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్రం సీఎండీ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పేరుతో రెండుగా విభజించింది. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీ ఈవోగా నియమించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టు భర్తీపై దృష్టి సారించారు. దీంతో పాటు మరో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల ఎంపిక పూర్తి చేసిందని, త్వరలోనే ఈ జాబితాకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది.
 
 ఎండీ పోస్ట్‌కు డిమాండ్
 వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పోస్ట్‌లకు పోటీ చాలా అధికంగా ఉంది. సుమారు అయిదు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఎండీ, సీఈవో పోస్టుల కోసం 50 మందికిపైగా పోటీపడుతున్నారు. వీరిని ఎంపిక చేసే బాధ్యతను ఆర్‌బీఐ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ హే గ్రూపునకు అప్ప చెప్పింది. ప్రస్తుతం ఈడీగా ఉంటూ ఎండీ, సీఈవోగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కల్రా వారం రోజుల్లో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని, అందులో ఎంపికైతే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
 
 తగ్గింపుపై నేడోరేపో నిర్ణయం
 ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు తగ్గింపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌బీఐ రెపో రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గించినా ఇంత వరకు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు చేరవేయలేదు. గురువారం సమావేశంలో బేస్ రేటును పావు శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25 శాతంగా ఉంది.
 
 ప్రచారంలో ఉన్న చైర్మన్ల జాబితా
 బ్యాంకు పేరు    ప్రతిపాదిత చైర్మన్
 ఆంధ్రాబ్యాంక్    బి.సాంబమూర్తి
 పంజాబ్ నేషనల్    సుమిత్ బోస్
 ఓబీసీ    జి.సి.చతుర్వేది
 కెనరా    టి.ఎన్.మనోహరన్
 బ్యాంక్ ఆఫ్ బరోడా    రవి వెంకటేశన్
 బ్యాంక్ ఆఫ్ ఇండియా    జి.పద్మనాభన్
 ఇండియన్ ఓవర్సీస్    ఎం.బాలచంద్రన్
 విజయా బ్యాంక్    జి.నారాయణన్
 ఇండియన్ బ్యాంక్    టి.సి.వి సుబ్రమణియన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement