ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ వెల్లడి
ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన నారాయణన్
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు.
అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్‌లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
నారాయణన్‌కు అభినందనల వెల్లువ
ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
నాలుగు దశాబ్దాల అనుభవం
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు.
1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్‌లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment