ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్‌చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్‌బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్‌టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.