ఐసీఐసీఐ లాభం 25% డౌన్
♦ క్యూ1లో రూ. 2,232 కోట్లు...
♦ ఆదాయం రూ.16,760 కోట్లు; 6 శాతం వృద్ధి
♦ 5.87 శాతానికి ఎగబాకిన మొండిబకాయిలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్‌పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి) నికర లాభం 25 శాతం దిగజారి రూ. 2,232 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ. 2,976 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎన్‌పీఏలు భారీగా ఎగబాకడంతో కేటాయింపుల(ప్రొవిజనింగ్) భారం పెరగడం... లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో రూ.16,760 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ. 15,802 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. కాగా, బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం ద్వారా రూ.617 కోట్లమేరకు అదనపు రాబడి లాభాలకు కొంత దన్నుగా నిలిచింది.
ఎన్‌పీఏలు పైపైకి...
బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు జూన్ క్వార్టర్ నాటికి 5.87 శాతానికి(రూ.27,194 కోట్లు) పెరిగిపోయాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్‌పీఏలు 3.68 శాతం(రూ.15,138 కోట్లు) కాగా, మార్చి క్వార్టర్‌కు 5.82 శాతం(రూ.26,221 కోట్లు)గా నమోదయ్యాయి. ఇక నికర ఎన్‌పీఏల విషయానికొస్తే.. గతేడాది జూన్ చివరినాటికి 1.58 శాతం(రూ.6,333 కోట్లు) కాగా, ఈ ఏడాది జూన్ నాటికి 3.35 శాతానికి(రూ.15,041 కోట్లు) ఎగబాకాయి. మార్చి క్వార్టర్ నాటికి నికర ఎన్‌పీఏలు 2.98 శాతం(రూ.12,963 కోట్లు)గా ఉన్నాయి.
ఇక ఎన్‌పీఏలకు మొత్తం కేటాయింపులు గతేడాది జూన్ క్వార్టర్‌లో రూ.956 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో మూడింతలు ఎగబాకి రూ.2,515 కోట్లకు చేరాయి. క్యూ1లో పునర్‌వ్యవస్థీకరించిన కార్పొరేట్ రుణాలు రూ.7,241 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి క్వార్టర్(క్యూ4)లో ఈ మొత్తం విలువ రూ.8,573 కోట్లుగా ఉంది. కాగా, మొండిబకాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూ.3,600 కోట్ల రిజర్వు నిధి నుంచి క్యూ1లో రూ.865 కోట్లను ప్రొవిజనింగ్ కోసం బ్యాంక్ వినియోగించుకుంది. అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్‌సీ)లకు రూ.2,232 కోట్ల విలువైన రుణాలను విక్రయించింది.
కన్సాలిడేటెడ్‌గా చూస్తే...
బీమా వ్యాపారం, మ్యూచువల్ ఫండ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ1లో రూ. 2,516 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,232 కోట్లతో పోలిస్తే 22.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.22,456 కోట్ల నుంచి రూ.24,483 కోట్లకు పెరిగింది. 9 శాతం వృద్ధి నమోదైంది.
ఇతర ముఖ్యాంశాలివీ..
⇔ క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ)లో వృద్ధి నమోదుకాలేదు. రూ.5,115 కోట్ల నుంచి రూ.5,159 కోట్లకు చేరింది.
⇔ వడ్డీయేతర ఇతర ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 2,990 కోట్ల నుంచి రూ.3,429 కోట్లకు పెరిగింది.
⇔ రిటైల్ రుణాల్లో 22 శాతం భారీ వృద్ధి నేపథ్యంలో జూన్ క్వార్టర్‌లో మొత్తం రుణ వృద్ధి 12.5 శాతంగా నమోదైంది.
⇔ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.116 కోట్ల నుంచి రూ.131 కోట్లకు పెరిగింది. 13 శాతం వృద్ధి చెందింది.
⇔ ఇక మరో సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ.397 కోట్ల నుంచి రూ.405 కోట్లకు చేరింది. పబ్లిక్ ఆఫర్ కోసం సంస్థ ఇటీవలే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.
⇔ ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 3.4 శాతం క్షీణించి రూ.263 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ కడపటి సమాచారం మేరకు 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
‘జూన్ క్వార్టర్‌లో కొత్తగా రూ.8,249 కోట్లు మొండిబకాయిల్లోకి చేరాయి. ప్రధానంగా ప్రత్యేక పరిశీలనలో ఉంచిన ఖాతాల నుంచి ఇందులో 76 శాతం నమోదైంది. ఈ జాబితాలో మార్చి 30 నాటికి రూ.44,000 కోట్ల విలువైన రుణాలను చేర్చాం. ప్రస్తుతం ఈ మొత్తం రూ.38,723 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొండిబకాయిల్లో 30 శాతం మేర మళ్లీ గాడిలోకి వస్తాయని భావిస్తున్నాం. అయితే, దేశీయంగా ఆర్థిక రికవరీ నెమ్మదిగానే జరుగుతుండటం, బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల వంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని రంగాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఎన్‌పీఏలకు అడ్డుకట్టపడకపోవడంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. ప్రస్తుతానికి కాస్త సురక్షితంగా కనబడుతున్న రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిసారిస్తున్నాం. ఈ ఏడాది దేశీ రుణాల్లో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ