
రెండు రోజుల నష్టాలకు చెక్
ముంబై: బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల ర్యాలీతో స్టాక్‌సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ సూచీ 2% రాణించాయి.
ఇండోఫార్మ్ ఎక్విప్‌మెంట్ హిట్
ఇండోఫార్మ్ ఎక్విప్‌మెంట్ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది.