అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బుధవారం దలాల్ స్ట్రీట్ ఒకశాతానికిపైగా లాభపడింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు బలపడి 24,484 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రంప్ ఆధిక్యంతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,094 పాయింట్లు పెరిగి 80,570 వద్ద, నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 24,538 వద్ద గరిష్టాలు తాకాయి. బీఎస్‌ఈలో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2.28%, రెండుశాతం రాణించాయి. రంగాల వారీగా అత్యధికంగా బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 4% లాభపడింది. టెక్ 3%, రియల్టీ 3%, ఇండ్రస్టియల్ 3%, సరీ్వసెస్ ఇండెక్సులు 2.50% రాణించాయి.
అమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. యూఎస్ డోజోన్స్ 3%, ఎస్‌అండ్‌పీ 2%, నాస్‌డాక్ 2.5% లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, కొరియా సూచీలు 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్‌టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి.
ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 4% లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్లు ఇవే. పెర్సిస్టెంట్ 6%, ఎల్‌టీఐమైండ్‌టీ 5%, విప్రో షేర్లు 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ రెండురోజుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఎగసింది. బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.10.47 లక్షల కోట్లు పెరిగి రూ.452 లక్షల కోట్లకు చేరింది.
రూపాయి ఆల్‌టైమ్ కనిష్టం
డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 22 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 84.31 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మార్గం సుగమం కావడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో యూఎస్ కరెన్సీ డాలర్ బలపడటం దేశీయ కరెన్సీ కోతకు కారణమైంది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడమూ ప్రతికూలంగా మారింది.
జీవితకాల గరిష్టానికి బిట్‌కాయిన్
డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమనే వార్తలతో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 8% ఎగసి జీవితకాల 75,000 డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీలకు ట్రంప్ సానుకూలత కలిసొచి్చందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 77% ర్యాలీ చేసింది. ఎన్నికల సందర్భంగా అమెరికాను క్రిప్టోల రాజధానిగా మార్చడంతో పాటు వ్యూహాత్మక రిజర్వ్‌గా బిట్‌కాయిన్‌ను తీర్చిదిద్దుదామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment