న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,177 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 406 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా బలపడి రూ. 21,210 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం సైతం నామమాత్ర వృద్ధితో రూ. 6,147 కోట్లయ్యింది. అయితే ఇతర ఆదాయం 67 శాతంపైగా జంప్‌చేసి రూ. 4,438 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.13 శాతం నీరసించి 2.71 శాతంగా నమోదయ్యాయి.
ఎన్‌పీఏలు తగ్గాయ్: క్యూ1లో కెనరా బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.84% నుంచి 8.5%కి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 3.95% నుంచి 3.46%కి వెనకడుగు వేశాయి. మొత్తం ప్రొవిజన్లు 18 శాతం పెరిగి రూ. 4,574 కోట్లకు చేరాయి.
ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం పుంజుకుని రూ. 149 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment