రూ.1,000 కోట్ల ఎన్‌పీఏలు విక్రయిస్తాం
- వ్యాపారంలో 14% వృద్ధి సాధిస్తాం
- దేనా బ్యాంక్ ఈడీ ఆర్.కె.టక్కర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్ పెద్ద మొత్తంలో ఎన్‌పీఏలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఎన్‌పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేనా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.కె.టక్కర్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు లక్షల రూపాయలలోపు ఎన్‌పీఏలున్న 48,000 ఖాతాలను అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ఖాతాల మొత్తం విలువ రూ.200 కోట్లు. దీంతో పాటు 1200 ఖాతాలకు సంబంధించి రూ.125 కోట్ల ఎన్‌పీఏ ఆస్తులను వేలానికి పిలిచామని, రూ. 72 కోట్ల ఎన్‌పీఏలను విక్రయించామని చెప్పారాయన.
ప్రస్తుతం 6.20 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలను ఈ ఏడాది చివరి నాటికి 5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాల్గవ త్రైమాసికం నుంచి కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడైతే రిటైల్, ఎస్‌ఎంఈ రుణాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధి సాధించగలమని భావిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.
ప్రస్తుతం దేనా బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.1.98 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 400 శాఖలను ఏర్పాటు చేయనుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 15 శాఖలున్నాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 1,762 శాఖలుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కలిపి 51 శాఖలున్నాయి. ఈ మధ్యనే కేంద్రం రూ. 407 కోట్ల మూలధనాన్ని సమకూర్చిందని, క్రెడిట్ డిమాండ్ బాగా పెరిగితే మార్చిలోగా టైర్1, టైర్2 బాండ్ల రూపంలో మరింత మూలధనాన్ని సమీకరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.