Dena Bank
-
ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. చదవండి: జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు! సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
అమ్మకానికి దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయం
ముంబై: దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్ ప్రైస్ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహా్వనిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ–వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్ వంటివి ఆస్తిలో భాగం కాదని ప్రకటనలో వివరించింది. కార్యాలయం 2,878.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. బిల్ట్ అప్ ఏరియా 9,953.73 చదరపు మీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. -
రెండేళ్లలో అనుసంధానం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనమై ఒక్కటిగా మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణపరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్–జూన్ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. -
బీవోబీలో బ్యాంకుల విలీనం నేటి నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం.. నేటి నుంచే (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది. తద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది. ఇకనుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ బీవోబీ శాఖలుగా పనిచేయనున్నాయి. ‘విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ ఖాతాదారులను ఏప్రిల్ 1 నుంచి బీవోబీ ఖాతాదారులుగా పరిగణించడం జరుగుతుంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్రం గత వారం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అలాగే, దేనా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 110 లభిస్తాయి. ఈ మూడింటి విలీనంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడుతుంది. దీని వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గాను ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గుతుంది. -
బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్, న్యాయమూర్తి వినీత్ శరణ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది. బ్యాంకుల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తంగ్ వాదనలు వినిపించారు. మార్గదర్శకాల ప్రకారమే విలీన నిర్ణయం జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది. కాగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుల విలీనంతో ఉద్యోగాల కోత ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు నష్టం వాటిల్లదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ వారం మొదట్లో ఆమోదం తెలిపింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ మాదిరిగా పెద్ద బ్యాంకు అవతరిస్తుందని జైట్లీ చెప్పారు. రుణాలపై వ్యయాలు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వ రంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులు ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలో (పీసీఏ) ఉన్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ చెప్పారు. అధిక ఎన్పీఏలతో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ పీసీఏను అమల్లోకి తెచ్చింది. రూ.3 లక్షల కోట్లను వ్యవస్థలోకి తిరిగి తీసుకొచ్చేందుకు దివాలా చట్టం సాయపడినట్టు మంత్రి తెలిపారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహణ పరంగా లాభాల్లోనే ఉన్నప్పటికీ, మొండి బకాయిలకు కేటాయింపులు చేయడం వల్లే నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం రూ.65,000 కోట్లను బడ్జెట్లో కేటాయిం చగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ. 51,533 కోట్ల నిధుల సాయం చేసినట్టు తెలిపారు. -
మరో మెగా బ్యాంక్ రెడీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ‘ఈ విలీనంతో ఉద్యోగుల సర్వీస్ కండీషన్స్‌పై ప్రతికూల ప్రభావం ఉండదు. ] అలాగే, ఉద్యోగుల తొలగింపు చర్యలూ ఉండవు. కస్టమర్ల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్, నిర్వహణ సామర్థ్యాలు, పథకాల విస్తృతి, కస్టమర్లకు సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. నెట్వర్క్, చౌక డిపాజిట్లు మొదలైనవి విలీన బ్యాంకుకు లాభిస్తాయి‘ అని ఆయన వివరించారు. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా బీవోబీని తీర్చిదిద్దే లక్ష్యంతో 3 బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మూడింటి విలీనం అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గుతుంది. విలీన స్కీమును ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ్యుల పరిశీలనకు పార్లమెంటు ముందు 30 రోజులు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపా యి. ఈ సమావేశాలు జనవరి 8తో ముగుస్తాయి. ప్రభుత్వ రంగంలో రెండో పెద్ద బ్యాంక్.. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా నిలుస్తుంది. విలీన బ్యాంక్ నికర మొండిబకాయిల నిష్పత్తి 5.71% స్థాయిలో ఉండనుంది. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు 12.13 శాతంగా ఉంది. ఇక క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్) కూడా నియంత్రణ సంస్థ నిర్దేశిత 10.87 శాతం కన్నా అధికంగా 12.25 శాతం స్థాయిలో ఉంటుంది. అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనంతో ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. అదే కోవలో బీవోబీని కూడా మెగా బ్యాంక్‌గా తీర్చిదిద్దే ఉద్దేశంతో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను అందులో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. మైనారిటీ షేర్‌హోల్డర్ల అభ్యంతరాలేమైనా ఉంటే పరిష్కరించేందుకు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కడే సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. షేర్ల స్వాప్ నిష్పత్తి ఖరారు.. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తాజాగా షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. బీవోబీ, దేనా బ్యాంక్‌ల బోర్డులు షేర్ల స్వాప్ నిష్పత్తి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి. బుధవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 3.16 శాతం క్షీణించి రూ. 119.40 వద్ద, దేనా బ్యాంక్ షేరు 0.28 శాతం క్షీణించి రూ.17.95 వద్ద ముగియగా.. విజయ బ్యాంక్ షేరు స్వల్పంగా 0.29 శాతం లాభపడి రూ. 51.05 వద్ద క్లోజయ్యింది. ఈ ధరల ప్రకారం చూస్తే.. దేనా బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.17,950 విలువ చేసే షేర్లకు బదులుగా రూ.13,134 విలువ చేసే బీవోబీ షేర్లు లభిస్తాయి. అలాగే విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.51,050 విలువ చేసే 1,000 షేర్లకు గాను రూ.47,998.80 విలువ చేసే బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. ఎగుమతి వర్తకులకు వడ్డీ రాయితీ.. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఎగుమతి వర్తకులకు 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.600 కోట్ల మేర వ్యయం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఉత్పత్తులు, వ్యవసాయ, హస్తకళలు, జౌళి, తోలు, యంత్రపరికరాల సంస్థలు తయారు చేసే సుమారు 416 ఉత్పత్తులు ఈ పరిధిలోకి వస్తాయి. వడ్డీ రాయితీ స్కీములో ఎగుమతి వర్తకుల్ని కూడా చేర్చడంతో వారు మరింతగా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభించగలదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా ఎంఎస్ఎంఈల్లో ఉత్పత్తి పెరిగి, మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. తయారీ ఎగుమతిదారుల కోసం 2015 ఏప్రిల్‌లో వడ్డీ రాయితీ పథకాన్ని అయిదేళ్ల వ్యవధికి కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే, ఇందులో వర్తక ఎగుమతిదారులకు చోటు కల్పించలేదు. తాజాగా వీరిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చింది. రుణాలు తక్కువ వడ్డీకే లభించడం వల్ల ఎగుమతిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భారతీయ ఎగు మతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. మరోవైపు, తయారీ ఎగుమతిదారుల తరహాలోనే ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించే వర్తక ఎగుమతిదారులను కూడా ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. -
బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీనం..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది. -
విలీన ప్రతిపాదనకు దేనా బ్యాంక్ ఓకే
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయ బ్యాంక్‌తో పాటు విలీనం కావాలన్న ప్రతిపాదనకు దేనా బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కన్సాలిడేషన్‌తో అంతర్జాతీయ బ్యాం కుల స్థాయిలో కార్యకలాపాలు సాగించగలిగే పటిష్ట బ్యాంకు ఏర్పడగలదని, దేశీయంగా.. అంతర్జాతీయంగా సమర్ధంగా పోటీనివ్వగలదని స్టాక్ ఎక్చ్సేంజీలకు దేనా బ్యాంకు తెలియజేసింది. రుణ వృద్ధిని పెంచేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు అమలు చేసేందుకు, వ్యయాలు నియంత్రించుకునేందుకు తోడ్పడగలదని వివరించింది. దేనా, విజయా, బీవోబీల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థ.. మొత్తం రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు కానుంది. -
మరో మెగా బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో.. మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ విషయం ప్రకటించారు. ఈ విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారడంతో పాటు రుణ వితరణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలవని చెప్పారు. పెరుగుతున్న మొండిబాకీలతో చాలా బ్యాంకులు దుర్బలంగా మారాయని జైట్లీ చెప్పారు. ‘‘బ్యాంకుల రుణ వితరణ కార్యకలాపాలు బలహీనపడ్డాయి. దీంతో కార్పొరేట్ పెట్టుబడులు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పడే సంస్థతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలుంటాయి’’ అని ఆయన వివరించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్ జయకుమార్ అభిప్రాయపడ్డారు. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకే.. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి జైట్లీ సారథ్యంలో ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఈ మేరకు సిఫార్సు చేసింది. విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు సూచించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ‘ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడుతుంది. విలీన సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవిస్తుంది. నెట్వర్క్, చౌక డిపాజిట్లు, అనుబంధ సంస్థల పరంగా ఈ మూడింటికి సానుకూలాంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు, బ్రాండ్ ఈక్విటీకి పరిరక్షణ ఉంటుంది’’ అని కుమార్ వివరించారు. విలీన సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు. విలీనానంతరం కూడా మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగుతాయన్నారు. ‘విలీన ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ గత విధానాలను, అనుభవాలను బట్టి చూస్తే.. 4–6 నెలలు పట్టొచ్చు. పరిస్థితిని బట్టి మరింత వేగంగా కూడా పూర్తి కావొచ్చు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. 5.71 శాతం ఎన్పీఏలు.. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో దేనా బ్యాంక్ కూడా ఉంది. దీంతో దేనా రుణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయ బ్యాంకు కూడా ఒకటి కావడం గమనార్హం. విలీన బ్యాంకు నికర మొండిబాకీలు 5.71 శాతం మేర ఉండనున్నాయి. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 12.25 శాతంగాను, టియర్1 క్యాపిటల్ 9.32 శాతంగాను ఉంటుంది. విలీన బ్యాంకుకు మొత్తం 9,500 శాఖలుంటాయి. ’మొండి’ పీఎస్‌బీలు .. దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా.. వీటిలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగంలో మూడింట రెండొంతుల వాటా పీఎస్‌బీలదే ఉంటోంది. అలాగే, బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల్లో కూడా వీటి వాటా భారీగా ఉంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను అందుకునేందుకు వచ్చే రెండేళ్లలో ఈ బ్యాంకులు కోట్ల కొద్దీ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పురోగామి చర్య: ఫిక్కీ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పురోగామి చర్యగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి.. పటిష్టమైన బ్యాంకింగ్ రంగం అత్యంత అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మెగా మెర్జర్ : మూడు బ్యాంకులు విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే మెగా మెర్జర్‌కు కీలక అడుగు పడింది. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు దెనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనానికి సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల విలీనం అనంతరం దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా విలీన బ్యాంకు అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ కార్యకలాపాల హేతుబద్ధత బాగా పుంజుకుందని చెప్పారు. బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఈ విలీన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు. -
బ్యాంకు వద్ద మహిళకు టోకరా
వినుకొండ టౌన్: బ్యాంకుల వద్ద ఖాతాదారులను మాటల్లో ఉంచి ఆభరణాలు, నగదును దోచుకు పోయేవారు పెరిగిపోతున్నారు. నూజెండ్ల మండలం ఖమ్మపాడు గ్రామానికి చెందిన బొప్పుడి రమణమ్మ బంధువులతో కలసి పల్నాడ్ రోడ్డులోని దేనా బ్యాంకుకు బుధవారం వచ్చింది. ఖాతాలో రూ.5వేలను డ్రా చేసి రూ.4,500ను పర్సులో పెట్టుకుంది. దానిలో మూడు సవర్ల నల్లపూసల చైను కూడా ఉంది. పర్సును చేతిలో ఉన్న బుట్టలో వేసుకుంది. అదే సమయంలో బ్యాంకు ఆవరణలో ఓ వ్యక్తి వారి వెంటే ఉంటూ ధర్మం చేయమంటూ ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. అతని బారి నుంచి తప్పుకొని బట్టల షాపులోకి రమణమ్మ వెళ్లింది. అక్కడకు వెళ్లి బుట్టలో చూసుకోగా పర్సు కనిపించలేదు. ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ టీవీ శ్రీనివాసరావు బ్యాంకులో సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద ఆభరణాలు లేకపోవడం, అమాయకునిలా కనిపించడంతో వదిలి వేశారు. బుట్టలో నగదు, బంగారు ఆభరణం ఏమైనది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేనా బ్యాంక్‌పై ఆంక్షలు ఎత్తివేయండి
వడోదరా: భారీ మొండిబాకీల కారణంగా తదుపరి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వ రంగ దేనా బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అభ్యర్థించింది. ఆంక్షల మూలంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దేనా బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేర్చడం తెలిసిందే. దీనివల్ల కొత్తగా రుణాలు మంజూరు చేయటం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి అంశాల్లో బ్యాంకు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జూన్ 10న ఉర్జిత్ పటేల్‌కు రాసిన లేఖలో ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులను ఇది అనవసర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాపార పరిమాణం ప్రకారం భారీ బ్యాంకు కాకపోయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిలో దేనా బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని వెంకటాచలం వివరించారు. 2018 మార్చి 31 నాటికి దేనా బ్యాంకులో స్థూల మొండిబాకీలు 16.27% నుంచి 22.4 శాతానికి ఎగిశాయి. విలువపరంగా చూస్తే రూ. 12,619 కోట్ల నుంచి రూ.16,361 కోట్లకు చేరాయి. నికర ఎన్పీఏలు 10.66% (రూ.7,735 కోట్లు) నుంచి 11.95 శాతానికి (రూ.7,839 కోట్లు) చేరాయి. దేనా బ్యాంక్‌తో పాటు అలహాబాద్ బ్యాంక్, ఐడీబీఐ, యూకో తదితర బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. ఎన్సీఎల్టీ ముందుకు 65 మొండిపద్దులు: అలహాబాద్ బ్యాంక్ కోల్‌కతా: గత ఆర్థిక సంవత్సరం(2017–18) సుమారు రూ.12,566 కోట్ల మొండిబాకీలకు సంబంధించిన 65 ఖాతాదారులపై దివాలా చట్టం కింద చర్యల కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. -
దేనా బ్యాంక్ నష్టాలు రూ.380 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ. 380 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.35 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,996 కోట్ల నుంచి రూ.2,476 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 14.79 శాతం నుంచి 19.56 శాతానికి, నికర మొండి బకాయిలు 9.52 శాతం నుంచి 11.52 శాతానికి పెరిగాయని వివరించింది. ఫలితంగా మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపయ్యాయని, రూ.427 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా రూ.3,045 కోట్ల సమీకరణకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని దేనా బ్యాంక్ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్ఈలో దేనా బ్యాంక్ షేర్ 2.4 శాతం క్షీణించి రూ.22.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.21.90ను తాకింది. -
ట్రాన్స్ట్రాయ్ యంత్రాలు సీజ్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కోట్లాది రూపాయల రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా మొండికేయడంతోపాటు నోటీసులు ఇచ్చినా స్పందించని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్ట్రాయ్పై దేనా బ్యాంకు అధికారులు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. నిర్మాణ సంస్థకు చెందిన మూడు యంత్రాలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ‘ముఖ్య’నేత ఆదేశాలతో ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) అధికారులు రంగంలోకి దిగి, ట్రాన్స్ట్రాయ్పై చర్యలు తీసుకోకుండా బ్యాంకు అధికారులను అడ్డుకోవడం గమనార్హం. ట్రాన్స్‌ట్రాయ్‌లో ‘ముఖ్య’నేతకు అనధికారికంగా భాగస్వామ్యం ఉండటం వల్లే ఆ సంస్థపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కోర్టు అనుమతితోనే చర్యలు హైదరాబాద్‌లోని దేనా బ్యాంకులో ట్రాన్స్ట్రాయ్ తన ఆస్తులను తనఖా(మార్ట్గేజ్) పెట్టి 2015లో రూ.87 కోట్ల రుణం తీసుకుంది. అసలు, వడ్డీతో కలిపి గత నవంబర్ నాటికి అది రూ.120 కోట్లకు చేరింది. రుణం చెల్లించాలని ట్రాన్స్ట్రాయ్కు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించామని దేనా బ్యాంకు అధికారులు తెలిపారు. కోర్టు అనుమతితో ట్రాన్స్ట్రాయ్ వాహనాలు, యంత్రాలను సీజ్ చేసేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు తవ్వకం యంత్రాలను సీజ్ చేశారు. ఆ మేరకు యంత్రాలపై నోటీసులు అంటించారు. ట్రాన్స్ట్రాయ్ సంస్థకు చెందిన జీఎం ప్రకాశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. 64 యంత్రాలు, వాహనాలను సీజ్ చేసేందుకు అనుమతి ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. సెక్షన్ 14 సర్ప్లస్ యాక్ట్ ప్రకారం కోర్టు అనుమతితో ట్రాన్స్ట్రాయ్పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు షాకు
-
ట్రాన్స్ట్రాయ్కు దేనా బ్యాంక్ షాక్
సాక్షి, పోలవరం: దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు గట్టి షాకు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు సంస్థకు చెందిన వాహనాలను, యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ గతంలో తీసుకున్న రూ.87 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు దిగారు. వడ్డీతో సహా మొత్తం రూ. 120కోట్లు బకాయిపడడంతో శుక్రవారం పోలవరం వద్దనున్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు ప్రతినిధులు కోర్టు ఆదేశాలతోనే ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా గతంలో కూడా రుణాలను (రూ.725 కోట్లు)చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ట్రాయ్పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొనడం గమనార్హం. -
వడ్డీరేట్లు తగ్గించిన దేనా బ్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన దేనా బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) 0.20 శాతం పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2017, అక్టోబర్ 1 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని కాల పరిమితులకు గాను, ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. ఓవర్‌నైట్, మూడు నెలల కాలానికి గాను ఎంసీఎల్ఆర్ రేటును 0.20 శాతం కోత పెట్టి 8 శాతం , 8.10 శాతంగా బ్యాంకు నిర్ణయించింది. అదేవిధంగా మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర కాల రుణాలకు ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.05 శాతం, 8.20 శాతం, 8.25 శాతంగా ఉంచుతున్నట్టు బ్యాంకు చెప్పింది. బేస్ రేటును కూడా 9.70 శాతం నుంచి 9.60 శాతానికి తగ్గించింది. ఇది కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంకు చెప్పింది. 2016 ఏప్రిల్ నుంచి ఎంసీఎల్ఆర్ మెకానిజాన్ని బ్యాంకింగ్ సిస్టమ్‌లో ప్రవేశపెట్టారు. బేస్ రేటుకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారు. -
దేనా బ్యాంక్ లాభాలు ఫట్...షేరు లాభాల్లో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగం బ్యాంకు దేనా బ్యాంక్ తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో ఏకంగా రూ. 279 కోట్లమేర నికర నష్టాలు ప్రకటించింది. గత(2015-16) క్యూ1లో రూ. 15 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ 2,907.35 కోట్లకు తగ్గింది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ 2,914.87 కోట్లు. మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.98 శాతం నుంచి 11.88 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 6.35 శాతం నుంచి 7.65 శాతానికి ఎగశాయి. మొండిబకాయిలకు ప్రొవిజన్లు రూ. 325 కోట్ల నుంచి ఏకంగా రూ. 665 కోట్లకు జంప్‌చేశాయి. ఫలితాలు నిరాశ పరచినప్పటికీ పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ కౌంటర్ కూడా లాభపడింది. బీఎస్ఈలో దేనా బ్యాంక్ షేరు 3 శాతం బలపడి రూ. 37.30కు చేరింది. -
దేనా బ్యాంక్‌కు రూ.326 కోట్ల నష్టాలు
ఎంపీఏలకు కేటాయింపులు 200% అప్ ముంబై: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.326 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు కేటాయింపులు 200 శాతంగా ఉండటంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని దేనా బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్ సీఎండీ అశ్వని కుమార్ చెప్పారు. ఇక గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో తమ నికర నష్టాలు రూ.663 కోట్లని తెలిపారు. 2014-15 క్యూ4లో రూ.366 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 200 శాతం వృద్ధితో రూ.1,094 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.265 కోట్ల నికర లాభం ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.935 కోట్ల నికర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 2.22 శాతం నుంచి 2.12 శాతానికి తగ్గిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 5.45 శాతం నుంచి 9.98 శాతానికి, నికర మొండి బకాయిలు 3.82 శాతం నుంచి 6.35 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు. -
రూ.1,000 కోట్ల ఎన్పీఏలు విక్రయిస్తాం
- వ్యాపారంలో 14% వృద్ధి సాధిస్తాం - దేనా బ్యాంక్ ఈడీ ఆర్.కె.టక్కర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్ పెద్ద మొత్తంలో ఎన్పీఏలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఎన్పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేనా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.కె.టక్కర్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు లక్షల రూపాయలలోపు ఎన్‌పీఏలున్న 48,000 ఖాతాలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ఖాతాల మొత్తం విలువ రూ.200 కోట్లు. దీంతో పాటు 1200 ఖాతాలకు సంబంధించి రూ.125 కోట్ల ఎన్పీఏ ఆస్తులను వేలానికి పిలిచామని, రూ. 72 కోట్ల ఎన్పీఏలను విక్రయించామని చెప్పారాయన. ప్రస్తుతం 6.20 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏలను ఈ ఏడాది చివరి నాటికి 5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాల్గవ త్రైమాసికం నుంచి కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడైతే రిటైల్, ఎస్ఎంఈ రుణాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధి సాధించగలమని భావిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేనా బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.1.98 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 400 శాఖలను ఏర్పాటు చేయనుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 15 శాఖలున్నాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 1,762 శాఖలుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కలిపి 51 శాఖలున్నాయి. ఈ మధ్యనే కేంద్రం రూ. 407 కోట్ల మూలధనాన్ని సమకూర్చిందని, క్రెడిట్ డిమాండ్ బాగా పెరిగితే మార్చిలోగా టైర్1, టైర్2 బాండ్ల రూపంలో మరింత మూలధనాన్ని సమీకరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
నేడు 8బ్యాంకుల సీఎండీ పోస్టులకు ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల సీఎండీ పోస్టుల భర్తీకి శుక్రవారం (నేడు) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఇంటర్వ్యూలకు కేంద్రం ఇటీవల మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు కమిటీల సగటు మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నియామకాల బోర్డ్ అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల జాబితాలో దేనా బ్యాంక్ సీఎండీ అశ్వనీ కుమార్, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ బీకే బాత్రా, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్కే కల్రాలూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు (దేనా బ్యాంక్) సీఎండీగా ఉన్న ఒక అధికారి, ఈ తరహా ఇంటర్వ్యూకు హాజరుకావడం ఇదే తొలిసారి. పైన పేర్కొన్న ముగ్గురి పేర్లూ విజిలెన్స్ క్లియరెన్స్ తరువాత చివరి నిముషంలో ఖరారయ్యాయి. మిగిలిన 16 మంది పేర్లూ ముందుగానే షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బ్యాంకులు ఇవీ..: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ , యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల సీఎండీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో విజయాబ్యాంక్ సీఎండీ పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది. -
ఎఫ్డీ నిధులగోల్మాల్!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా కుంభకోణాల కోరల్లో చిక్కుకుంటున్నాయి. సిండికేట్ బ్యాంక్ ఉదంతం ఇంకా సద్దుమణగకముందే.. తాజాగా ఇప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), దేనా బ్యాంక్‌లలో ఫిక్సిడ్ డిపాజిట్ల(ఎఫ్డీ) గోల్మాల్ స్కామ్ వెలుగుచూసింది. ఈ రెండు బ్యాంకుల్లో సుమారు రూ. 436 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు బయటపడింది. తక్షణం మేల్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ ఈ రెండు బ్యాంకుల్లో ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలిచ్చింది. భూషణ్ స్టీల్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌లకు రుణ పరిమితిని పెంచేందుకుగాను రూ.50 లక్షల లంచాన్ని తీసుకున్న కేసులో ఇప్పటికే సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్కే జైన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో సంబంధిత రెండు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా అరెస్టయ్యారు. కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు ఇప్పుడు ఈ స్కామ్‌లు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దేనా బ్యాంక్‌లో ఏం జరిగిందంటే... ముంబైలోని దేనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఎఫ్డీ కుంభకోణం చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. సుమారు రూ.256 కోట్ల మొత్తాన్ని ఏడు కార్పొరేట్ కంపెనీల నుంచి అక్కడి బ్రాంచ్ మేనేజర్ ఫిక్సిడ్ డిపాజిట్లుగా కట్టించినట్లు తెలుస్తోంది. కార్పొరేట్లను ఒప్పించడం దగ్గరనుంచి... ఎఫ్డీలకు సంబంధించి లాంఛనాలన్నింటినీ మధ్యవర్తులే నిర్వహించినట్లు సమాచారం. ఎఫ్‌డీల ద్వారా నిధులను సమీకరించిన తర్వాత సంబంధిత కార్పొరేట్ సంస్థలకు నకిలీ ఎఫ్డీ రసీదు(ఎఫ్డీఆర్)లను ఇచ్చారు. అసలు ఎఫ్డీఆర్ బ్యాంకు బ్రాంచ్‌లోనే అట్టిపెట్టుకున్నారు. ఆతర్వాత వీటిని కుదువ పెట్టుకుని ఇతర సంస్థలకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా మధ్యవర్తులు ప్రతిపాదించారు. ఆ బ్రాంచ్‌లోని సిబ్బంది సహకారంతో సంబంధిత సంస్థల థర్డ్‌పార్టీ ఖాతాల్లోకి రుణ మొత్తాన్ని మళ్లించారు. ఈ స్కామ్‌ను నెల రోజుల క్రితమే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగుచూడటంతో దేనా బ్యాంక్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. మలబార్ హిల్స్ శాఖ ఈ ఏడాది జనవరి 30-మే 5 మధ్య రూ.256.69 కోట్ల బల్క్ టర్మ్ డిపాజిట్లను సమీకరించిందని.. ఈ ఎఫ్‌డీఆర్‌ను తనఖా పెట్టుకొని రూ.223.25 కోట్లను ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొంది. అయితే, నకిలీ ఓవర్‌డ్రాఫ్ట్‌లను సృష్టించి ఈ నిధులను బదిలీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. బ్యాంకుతో పాటు ఎఫ్డీలు చేసిన కార్పొరేట్/ప్రభుత్వ సంస్థలను మోసం చేశారని.. దీనిపై సీబీఐకి ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొంది. ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఇచ్చిన మొత్తంలో ఇంకా రూ.217.17 కోట్లు బ్యాంకుకు తిరిగి రావాల్సి ఉందని(అవుట్‌స్టాండింగ్) వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు.. ఆ శాఖలోని సిబ్బందిని బదిలీ కూడా చేసినట్లు దేనా బ్యాంక్ తెలిపింది. ఓబీసీ సంగతిదీ... ఓబీసీకి చెందిన ముంబైలోని బ్రాంచ్‌లో ఒక సంస్థ చేసిన రూ.180 కోట్ల ఎఫ్డీ మొత్తం దుర్వినియోగమైనట్లు వెలుగుచూసింది. డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి ఓబీసీ బ్రాంచ్‌లో ఎఫ్డీ అకౌంటే ఓపెన్ కాకపోవడంతో... తమకు ఎఫ్డీఆర్ ఇవ్వలేదంటూ ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో అసలు సంగతి బట్టబయలైంది. ఎఫ్డీ మొత్తాన్ని సండ్రీ అకౌంట్(అకౌంట్ లేనివాళ్ల నిధులను తాత్కాలికంగా ఉంచే ఖాతా)లో తొలుత జమచేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడినుంచి నిధులను కరెంట్ అకౌంట్లోకి.. అటునుంచి థర్డ్‌పార్టీ అకౌంట్లలోకి మళ్లించి ఉండొచ్చని బ్యాంకింగ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ స్కామ్ బయటపడేనాటికే బ్యాంక్ రూ.110 కోట్లను రికవరీ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ పరిశీలనలో ఉంది. ఒకవేళ ఎఫ్డీ నిధులను మోసపూరితంగా దారిమళ్లించినట్లు సీబీఐ గనుక దర్యాప్తులో నిరూపిస్తే ఓబీసీ చిక్కుల్లో పడినట్లేనని భావిస్తున్నారు.