పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు.
ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్‌బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు.