న్యూఢిల్లీ: ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల సీఎండీ పోస్టుల భర్తీకి శుక్రవారం (నేడు) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఇంటర్వ్యూలకు కేంద్రం ఇటీవల మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు కమిటీల సగటు మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన, ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని నియామకాల బోర్డ్ అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థుల జాబితాలో దేనా బ్యాంక్ సీఎండీ అశ్వనీ కుమార్, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ బీకే బాత్రా, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్‌కే కల్రాలూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు (దేనా బ్యాంక్) సీఎండీగా ఉన్న ఒక అధికారి, ఈ తరహా ఇంటర్వ్యూకు హాజరుకావడం ఇదే తొలిసారి. పైన పేర్కొన్న ముగ్గురి పేర్లూ విజిలెన్స్ క్లియరెన్స్ తరువాత చివరి నిముషంలో ఖరారయ్యాయి. మిగిలిన 16 మంది పేర్లూ ముందుగానే షార్ట్‌లిస్ట్ అయ్యాయి.
బ్యాంకులు ఇవీ..: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ , యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల సీఎండీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో విజయాబ్యాంక్ సీఎండీ పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది.
నేడు 8బ్యాంకుల సీఎండీ పోస్టులకు ఇంటర్వ్యూలు
Published Fri, Nov 14 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement