ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88 వేల కోట్ల అదనపు మూలధనం
న్యూఢిల్లీ: మొండిబాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్‌బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈ విషయాలు తెలిపారు. పీఎస్‌బీలకి అందించే అదనపు మూలధనంపై విస్తృతంగా కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొండిబాకీల సమస్యకు చెక్ చెప్పే దిశగా బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. భారీ రుణాల మంజూరుకు నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు, రూ. 250 కోట్ల పైబడిన రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూపంలో ఉండనుంది.
బ్యాంకులు అత్యున్నత ప్రమాణాలు పాటించేలా గవర్నెన్స్‌ని మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ తెలిపారు. వారసత్వంగా వచ్చిన తీవ్రమైన సమస్యను పరిష్కరించడమొక్కటే కాకుండా.. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా సంస్థాగతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని విధాలా మెరుగ్గా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. తాజా చర్యల లక్ష్యం కూడా అదే‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సుమారు రూ. 9.5 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో అదనపు మూలధనం వాటికి కొంత ఊరటనివ్వనుంది.
ద్రవ్య లోటుపై ప్రభావం ఉండదు..
ఆయా బ్యాంకుల పనితీరు, అవి అమలు చేసే సంస్కరణలను బట్టి రీక్యాపిటలైజేషన్ ఉంటుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకులు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధానేతర విభాగాల నుంచి తప్పుకుని.. ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. బాండ్లతో పాటు.. బ్యాంకులు షేర్ల విక్రయం ద్వారా మార్కెట్ నుంచి సమీకరించే నిధులను కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రీక్యాపిటలైజేషన్ పరిమాణం రూ. 1 లక్ష కోట్లు దాటుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగలిగే సామర్ధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ. 10,312 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించిన బ్యాంకులు.. మిగతా వ్యవధిలో మరిన్ని నిధులు సమీకరించే అవకాశాలు ఉన్నాయి.
రూ.250 కోట్లు దాటే రుణాలపై పర్యవేక్షణ ..
ప్రభుత్వం నుంచి అదనపు మూలధనాన్ని అందుకునే బ్యాంకులు పలు సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులతో వ్యవహరించే తీరు, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ మంజూరీ తీరుతెన్నులు, చిన్న.. మధ్యతరహా సంస్థలకు రుణాలు ఇవ్వడం, డిజిటలైజేషన్, అందరికీ ఆర్థిక సేవలు అందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు మొదలైన వాటన్నింటినీ బ్యాంకుల పనితీరు మదింపులో పరిశీలించడం జరుగుతుందని వివరించారు. అలాగే, బ్యాంకులు రుణాల మంజూరీ, రికవరీపై మరింత నిశితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూ. 250 కోట్ల పైబడిన రుణాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిరర్ధక ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అందరికీ ఆర్థిక సేవలు అందించే క్రమంలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కి ఇంటి వద్దనే బ్యాంకింగ్ సర్వీసులు అందించేలా చర్యలు తీసుకోవాలి.
బ్యాంకుల బోర్డులో ఒక స్వతంత్ర డైరెక్టరు ప్రతి మూడు నెలలకోసారి సంస్కరణల పురోగతిని సమీక్షించాల్సి ఉంటుంది. బ్యాంకుల ర్యాంకింగ్ కోసం సేవల లభ్యత, నాణ్యతకు సంబంధించి ఈఏఎస్‌ఈ సూచీ ఏర్పాటు చేస్తున్నట్లు కుమార్ తెలిపారు. దీని ఆధారంగా స్వతంత్ర ఏజెన్సీలు వాటి పనితీరును మదింపు చేసి, సంస్కరణల అమలు ప్రాతిపదికన వార్షికంగా రేటింగ్ ఇస్తాయి కనుక.. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనాన్ని మరింతగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు తీసుకునే వ్యాపారపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని, అవి స్వతంత్రంగానే వ్యవహరిస్తాయని చెప్పారు. అయితే.. అవి కచ్చితంగా సంస్కరణలు అమలు చేయాలని, రుణాలివ్వడంలో వివేకవంతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని కుమార్ తెలిపారు.
రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ఇలా..
రీక్యాపిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా బ్యాంకులకు బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్లు సమకూర్చనున్నట్లు రాజీవ్ కుమార్ వివరించారు. మరో రూ. 8,139 కోట్లు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ల వ్యవధి 10–15 సంవత్సరాలు ఉంటుందని, ఇవి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) పరిధిలోకి రావని తెలిపారు. ఈ బాండ్లపై వడ్డీ రేటు సుమారు 8 శాతంగా ఉంటుందని అంచనా. రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద బాండ్ల జారీ ద్వారా బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం మళ్లీ వాటికే బదలాయించి.. ప్రతిగా కొంత వాటా తీసుకోవడం జరుగుతుంది. అదనపు మూలధన ప్రణాళిక కింద కేంద్రం జారీ చేసే రీక్యాపిటలైజేషన్ బాండ్లను ముందుగా బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. వాటికి సంబంధించిన నిధులను ప్రభుత్వానికి బదలాయిస్తాయి.
కేంద్రం ఈ నిధులనే మళ్లీ పెట్టుబడి కింద ఆయా బ్యాంకులకు అందించి ప్రతిగా ఈక్విటీ తీసుకుంటుంది. ఇదంతా ఖాతాల్లో మార్పులు, చేర్పులతోనే జరుగుతుంది. నికరంగా ప్రభుత్వం తన ఖజానా నుంచి బ్యాంకులకు నిధులు ఇవ్వడం ఉండదు. కాబట్టి బ్యాంకులకు అదనపు మూలధనం అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణ సమీకరణ ఏమీ జరపదు కాబట్టి.. ద్రవ్య లోటుపై కూడా ప్రభావం ఉండదు. ఇక, బ్యాంకులపరంగా చూస్తే.. సాధారణంగా అవి తమకి వచ్చే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఎస్‌ఎల్‌ఆర్ కింద కచ్చితంగా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, తాజాగా వచ్చే బాండ్ల స్వరూపం పెట్టుబడి రూపంలో ఉండనుంది కనుక .. వీటి కొనుగోలు ఎస్‌ఎల్‌ఆర్ కిందికి రాదు.
Comments
Please login to add a commentAdd a comment