jaitly
-
పతాక స్థాయికి లీకుల డ్రామా
సాక్షి, అమరావతి: టీడీపీ లీకుల డ్రామా శుక్రవారం రాత్రి పతాక స్థాయికి చేరింది. పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత జరిగిన ఒక సమావేశంలో విభజన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారంటూ ఆ పార్టీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. జైట్లీ, అమిత్‌షా, పీయూష్ గోయల్, సుజనా చౌదరిలు సమావేశమై, హామీల అమలుకు అంగీకరించినట్లు మీడియాకు విస్తృతంగా లీకులిచ్చింది. ప్రధాని మోదీ గానీ, అరుణ్ జైట్లీ రెండుసార్లు పార్లమెంట్లో చేసిన తమ ప్రసంగాల్లో గానీ ఎక్కడా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పలేదు. జైట్లీ పార్లమెంట్లో రెండుసార్లు మాట్లాడినప్పుడు ఇవ్వని హామీలను సభ వాయిదా పడిన తర్వాత జరిగిన సాధారణ సమావేశంలో ఇచ్చేసినట్లు శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ అనుకూల మీడియాలో ఊదరగొట్టారు. పోరాటం పేరుతో పార్లమెంట్లో ఎంత హడావుడి చేసినా అదంతా డ్రామాయేనని పసిగట్టిన కేంద్రం తెలుగుదేశం పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాము నడిపిన డ్రామా అంతా విఫలమైందని గ్రహించిన చంద్రబాబు శుక్రవారం రాత్రి మరో కొత్త లీకుల నాటకానికి తెరలేపారు. ఇవీ లీకులు...: విభజన హామీలన్నీ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని టీడీపీ నేతలు లీకులు వదిలారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అమిత్‌షాలు సుజానా చౌదరితో అత్యవసరంగా సమావేశమై, టీడీపీ చేసిన అన్ని డిమాండ్లను ఒప్పుకున్నట్లు లీకులిచ్చారు. రెవెన్యూ లోటు (2014–15లో పది నెలలకు) భర్తీకి, ప్రత్యేక ప్యాకేజీ నిధులన్నింటినీ ఒకేసారి ఇచ్చేందుకు, ఈఏపీ నిధులు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేశారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మరోచోట నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినట్లు ప్రచారం మొదలుపెట్టారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ ఏర్పాటుపైనా ప్రకటన చేస్తామని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చుల వివరాలు పంపితే వెంటనే నిధులు విడుదల చేస్తామని జైట్లీ చెప్పినట్లు వల్లెవేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసినట్లు లీకులిచ్చారు. అయితే, పార్లమెంట్లో ఎంత హంగామా చేసినా అక్కడ ఇవ్వని ఈ హామీలను ప్రైవేట్ సమావేశంలో బేషరతుగా ఇచ్చేందుకు జైట్లీ ఒప్పేసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేయడం చూసి టీడీపీ వర్గాలే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇవ్వని వీటన్నింటినీ రాత్రికి రాత్రి, అదీ మోదీ విదేశాలకు వెళ్లిన సమయంలో ఇచ్చేందుకు జైట్లీ సాహసిస్తారా? అని అనుమానిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో ఇది పతాక సన్నివేశమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
బ్యాంకులకు బూస్ట్
ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88 వేల కోట్ల అదనపు మూలధనం న్యూఢిల్లీ: మొండిబాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈ విషయాలు తెలిపారు. పీఎస్‌బీలకి అందించే అదనపు మూలధనంపై విస్తృతంగా కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొండిబాకీల సమస్యకు చెక్ చెప్పే దిశగా బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. భారీ రుణాల మంజూరుకు నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు, రూ. 250 కోట్ల పైబడిన రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూపంలో ఉండనుంది. బ్యాంకులు అత్యున్నత ప్రమాణాలు పాటించేలా గవర్నెన్స్‌ని మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ తెలిపారు. వారసత్వంగా వచ్చిన తీవ్రమైన సమస్యను పరిష్కరించడమొక్కటే కాకుండా.. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా సంస్థాగతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని విధాలా మెరుగ్గా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. తాజా చర్యల లక్ష్యం కూడా అదే‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సుమారు రూ. 9.5 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో అదనపు మూలధనం వాటికి కొంత ఊరటనివ్వనుంది. ద్రవ్య లోటుపై ప్రభావం ఉండదు.. ఆయా బ్యాంకుల పనితీరు, అవి అమలు చేసే సంస్కరణలను బట్టి రీక్యాపిటలైజేషన్ ఉంటుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకులు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధానేతర విభాగాల నుంచి తప్పుకుని.. ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. బాండ్లతో పాటు.. బ్యాంకులు షేర్ల విక్రయం ద్వారా మార్కెట్ నుంచి సమీకరించే నిధులను కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రీక్యాపిటలైజేషన్ పరిమాణం రూ. 1 లక్ష కోట్లు దాటుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగలిగే సామర్ధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ. 10,312 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించిన బ్యాంకులు.. మిగతా వ్యవధిలో మరిన్ని నిధులు సమీకరించే అవకాశాలు ఉన్నాయి. రూ.250 కోట్లు దాటే రుణాలపై పర్యవేక్షణ .. ప్రభుత్వం నుంచి అదనపు మూలధనాన్ని అందుకునే బ్యాంకులు పలు సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులతో వ్యవహరించే తీరు, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ మంజూరీ తీరుతెన్నులు, చిన్న.. మధ్యతరహా సంస్థలకు రుణాలు ఇవ్వడం, డిజిటలైజేషన్, అందరికీ ఆర్థిక సేవలు అందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు మొదలైన వాటన్నింటినీ బ్యాంకుల పనితీరు మదింపులో పరిశీలించడం జరుగుతుందని వివరించారు. అలాగే, బ్యాంకులు రుణాల మంజూరీ, రికవరీపై మరింత నిశితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూ. 250 కోట్ల పైబడిన రుణాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిరర్ధక ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అందరికీ ఆర్థిక సేవలు అందించే క్రమంలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కి ఇంటి వద్దనే బ్యాంకింగ్ సర్వీసులు అందించేలా చర్యలు తీసుకోవాలి. బ్యాంకుల బోర్డులో ఒక స్వతంత్ర డైరెక్టరు ప్రతి మూడు నెలలకోసారి సంస్కరణల పురోగతిని సమీక్షించాల్సి ఉంటుంది. బ్యాంకుల ర్యాంకింగ్ కోసం సేవల లభ్యత, నాణ్యతకు సంబంధించి ఈఏఎస్‌ఈ సూచీ ఏర్పాటు చేస్తున్నట్లు కుమార్ తెలిపారు. దీని ఆధారంగా స్వతంత్ర ఏజెన్సీలు వాటి పనితీరును మదింపు చేసి, సంస్కరణల అమలు ప్రాతిపదికన వార్షికంగా రేటింగ్ ఇస్తాయి కనుక.. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనాన్ని మరింతగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు తీసుకునే వ్యాపారపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని, అవి స్వతంత్రంగానే వ్యవహరిస్తాయని చెప్పారు. అయితే.. అవి కచ్చితంగా సంస్కరణలు అమలు చేయాలని, రుణాలివ్వడంలో వివేకవంతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని కుమార్ తెలిపారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ఇలా.. రీక్యాపిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా బ్యాంకులకు బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్లు సమకూర్చనున్నట్లు రాజీవ్ కుమార్ వివరించారు. మరో రూ. 8,139 కోట్లు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ల వ్యవధి 10–15 సంవత్సరాలు ఉంటుందని, ఇవి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) పరిధిలోకి రావని తెలిపారు. ఈ బాండ్లపై వడ్డీ రేటు సుమారు 8 శాతంగా ఉంటుందని అంచనా. రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద బాండ్ల జారీ ద్వారా బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం మళ్లీ వాటికే బదలాయించి.. ప్రతిగా కొంత వాటా తీసుకోవడం జరుగుతుంది. అదనపు మూలధన ప్రణాళిక కింద కేంద్రం జారీ చేసే రీక్యాపిటలైజేషన్ బాండ్లను ముందుగా బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. వాటికి సంబంధించిన నిధులను ప్రభుత్వానికి బదలాయిస్తాయి. కేంద్రం ఈ నిధులనే మళ్లీ పెట్టుబడి కింద ఆయా బ్యాంకులకు అందించి ప్రతిగా ఈక్విటీ తీసుకుంటుంది. ఇదంతా ఖాతాల్లో మార్పులు, చేర్పులతోనే జరుగుతుంది. నికరంగా ప్రభుత్వం తన ఖజానా నుంచి బ్యాంకులకు నిధులు ఇవ్వడం ఉండదు. కాబట్టి బ్యాంకులకు అదనపు మూలధనం అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణ సమీకరణ ఏమీ జరపదు కాబట్టి.. ద్రవ్య లోటుపై కూడా ప్రభావం ఉండదు. ఇక, బ్యాంకులపరంగా చూస్తే.. సాధారణంగా అవి తమకి వచ్చే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఎస్ఎల్ఆర్ కింద కచ్చితంగా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, తాజాగా వచ్చే బాండ్ల స్వరూపం పెట్టుబడి రూపంలో ఉండనుంది కనుక .. వీటి కొనుగోలు ఎస్ఎల్ఆర్ కిందికి రాదు. -
‘హల్వా వేడుక’తో బడ్జెట్ ముద్రణ షురూ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభానికి సూచికగా శనివారం హల్వా వేడుక జరిగింది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో మంత్రి జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక పాత్రలో హల్వా వండి తమ శాఖలోని ఉద్యోగులందరికీ పంచిపెట్టారు. 2018–19 బడ్జెట్ పత్రాల ముద్రణను ప్రారంభించామని ట్వీటర్ ద్వారా తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమానికి బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఉద్యోగులు, అధికారులతోపాటు ముద్రణ విభాగం ఉద్యోగులు హాజరవుతారు. ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక అక్కడి ఉద్యోగులెవరూ ఇళ్లకు వెళ్లరు. బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేదాకా కార్యాలయంలోనే ఉంటారు. వీరికి కుటుంబసభ్యులతో సంబంధాలు ఉండవు. -
మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలిగే సత్తాను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడగలదని జైట్లీ చెప్పారు. రీక్యాపిటలైజేషన్ కింద జారీ చేసే బాండ్లకు ఎస్ఎల్ఆర్ హోదా ఉండదని, ట్రేడింగ్‌కి అనుమతి ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం గత ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది. -
క్రిప్టోకరెన్సీలపై తక్షణ చర్యలేమీ లేవు
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకునే యోచనేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీలపై అధ్యయనానికి నియమించిన నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాతే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ఈ విషయాలు తెలియజేశారు. పెట్టుబడుల వెల్లువతో బిట్‌కాయిన్ విలువ రూ.10 లక్షల స్థాయికి పైగా ఎగిసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్రిప్టోకరెన్సీలు మోసపూరిత పోంజీ స్కీముల్లాంటివని.. వీటికి దూరంగా ఉండాలని కేంద్రం, ఆర్బీఐ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్చువల్ కరెన్సీలు, వాటి ద్వారా మనీలాండరింగ్ అవకాశాలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ, హోం శాఖ, ఆర్బీఐ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. -
వ్యవసాయ ఆదాయ పన్నుపై జైట్లీ వివరణ
న్యూఢిల్లీ: వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపు పై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించే యోచన ఏదీ లేదని బుధవారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక ఏదీ లేదని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నీతి ఆయోగ్ సూచించినట్టుగా వ్యవసాయ ఆదాయంలో ఏ పన్ను విధించాలనే ప్రణాళిక లేదని జైట్లీ ట్వీట్ చేశారు.తద్వారా నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ సలహాను ఆయన కొట్టివేశారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సూచనల నేపథ్యంలో జైట్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యవసాయ ఆదాయంపై న్ను వేయాలన్న యోచన ఏ దశలోనూ కలగలేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యాల్లో ఉన్నఅరుణ్ జైట్లీ వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేయలేదని ప్రకటించారు. రాజ్యాంగ కేటాయించిన అధికారం ప్రకారం, ఈ తరహా పన్ను విధించేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారంలేదని ఆయన వివరించారు. టాక్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను వ్యక్తిగత ఆదాయపు పన్నుపై మినహాయింపులు తొలగించాలని, అలాగే రాష్ట్రాల ఆదాయ వనరుల్ని పెంచేందుకు వ్యవసాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ సూచించారు. దీనివల్ల పన్ను పరిధి పెరిగి, సాంఘిక సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలని సూచించడం ఆందోళన రేపింది. కాగా వ్యవసాయ ఆదాయం పన్ను విధించబోమని మార్చి 22న జైట్లీ పార్లమెంటుకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. FM @arunjaitley :As per the Constitutional Allocation of Powers, the Central Govt has no jurisdiction to impose tax on agricultural income. — Ministry of Finance (@FinMinIndia) April 26, 2017 -
కరెన్సీ కొరత నిజమే..కానీ..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న నగుదు కొరత సంక్షోభంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ కొరత ఉందని ఒప్పుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, పరివర్తన సమయంలో కొంత పెయిన్ తప్పదని చెప్పుకొచ్చారు. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో డిశెంబర్ 5-7 తేదీల్లో నిర్వహించిన పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగించారు. నవంబర్ 8న ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత కరెన్సీ నోట్ల కొరత నెలకొందని ఆయన అంగీకరించారు నగదు కొరత ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, కానీ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రతి రోజు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. మీడియా సహా మిగతా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందన్నారు. లావాదేవీల్లో పారదర్శకత మూలంగా పన్నుల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు సక్రమమైన లావాదేవీల సులభతరం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.అలాగే ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులకోసం బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వినూత్న సాంకేతిక సేవల ద్వారా ప్రతీ చిన్నలావాదేవీని సులభంగా నిర్వహిచడానికి వీలవుతోందని జైట్లీ చెప్పారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఎన్పీకుంట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆర్థికశాఖావుంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, గౌరవ సలహాదారుడు శ్రీనివాసులురెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్లో జైట్లీని కలిసి ఈ మేరకు విన్నవించావున్నారు. అంతకు మునుపు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి ఉమ్మడి సర్సీసు రూల్స్‌పై ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. జైట్లీ సానుకూలంగా స్పందించారన్నారు. -
మాల్యా.. బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకో!
న్యూఢిల్లీ: ''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాలాంటి ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు. బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్ పారిపోయే ముందు... అతని గ్రూప్ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జైట్తీ తెలిపారు. -
ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా
పార్లమెంట్లో ఏం జరిగింది -26 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. అరుణ్‌జైట్లీ(నిన్నటి తరువాయి) : న్యాయమంత్రి గారు చెప్పిన ఒక విషయం మీద నేను మాట్లాడాలి. మనకి ఈ దేశంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయి. శాంతిభద్రతలు, పోలీసులు రాష్ట్ర పరిధిలోని అంశాలు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మాకభ్యంతరం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ సీమాంధ్ర ప్రభుత్వం కిందగాని, తెలంగాణ ప్రభుత్వం కిందగాని ఉండకూడదు. న్యూట్రల్ ఏజెన్సీగా గవర్నర్ చేతుల్లో ఉంటుంది. దానికి మా అభ్యంతరంలేదు. ప్రశ్న ఏమిటంటే, గవర్నర్‌కి ఇద్దరు సలహాదారులుంటారు. వారిని కేంద్రం నియమిస్తుంది. గవర్నర్ కూడా కేంద్ర ప్రతినిధి. అంటే, గవర్నర్ ద్వారా శాంతిభద్రతలు కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోంది. ఇది మన ఫెడరల్ విధానానికి వ్యతిరేకం. సిబల్‌గారు ఇది సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్‌సీక్వెంటల్ అంటున్నారు. ఈ విషయం అనుబంధమో, ఆకస్మికమో అనుకునేంత చిన్న విషయం కాదు. నా భయం ఏమిటంటే, ఇది మన ప్రభుత్వాల పనితీరుల్లో ప్రధానమైన మార్పు. అందుకే రాజ్యాంగ సవరణ, ఏదో ఒక స్థాయిలో తప్పనిసరి. మేము రాజ్యాంగ సవరణకు మద్దతిస్తాం. ఇప్పుడే, ఇక్కడే చట్టబద్ధంగా తెలంగాణ ఏర్పరచమంటున్నాం. రేపు ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వస్తే ఏమవుతుంది? మళ్లీ పార్లమెంట్ సమావేశమై రాజ్యాంగ సవరణ చెయ్యాలి. కపిల్ : అప్పోజిషన్ లీడర్ కొన్ని నిమిషాల క్రితం గవర్నర్ న్యూట్రల్ ఏజెన్సీ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అంటున్నారు. సీమా్రంధ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే గవర్నర్‌కు ఇలా ఏజెంట్ బిరుదు కట్టబెట్టడం సమంజసం కాదు. గవర్నర్‌ను న్యూట్రల్‌గా భావించి అధికారాలిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా, తెలంగాణ మంత్రిమండలి సలహామేరకే ఆయన నడుచుకుంటారు. కాని ఆఖరుగా నిర్ణయాధికారం మాత్రం గవర్నర్దే. 371-హెచ్ ఆర్టికల్ కూడా ఇదే చెప్పింది. ప్రధానమంత్రి : అధ్యక్షా! ప్రతిపక్ష నాయకుడు, ఇతర ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల ఉపన్యాసాలు శ్రద్ధగా విన్నాను. ఇప్పటికే, ప్రభుత్వం చేపట్టనున్న ప్రత్యేక చర్యల గురించి, ముఖ్యంగా సీమాంధ్ర గురించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గురించి హోంమంత్రి ప్రస్తావించారు. నేను మరికొన్ని ప్రకటనలు చేయదలిచాను. మొదటిగా, కేంద్ర సహాయం అందించే నిమిత్తం, పదమూడు జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో సహా, ఐదేళ్లపాటు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇవ్వబడుతుంది. ఈ చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేస్తుంది. రెండవది, బిల్లులో ఇప్పటికే ప్రస్తావించిన అంశం, అవసరమైన ఆర్థిక చర్యలతోపాటు, పన్ను మినహాయింపులు వంటి పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు కూడా రెండు రాష్ట్రాల్లో చేబడ్తాం. కొన్ని రాష్ట్రాలకు ఎలాగైతే ఇటువంటి వెసులుబాట్లు కల్పించామో, అదే ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు అమలు చేస్తాం. మూడవది, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ‘డెవలప్మెంట్ ప్యాకేజీ’ని బిల్లులో పొందుపర్చాం. ఈ ప్యాకేజీ ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోరాపుట్- బొలంగీర్ - కలహంది, బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
ఇది చట్టవిరుద్ధ విభజనే!
పార్లమెంట్లో ఏం జరిగింది -25 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. అరుణ్‌జైట్లీ (నిన్నటి తరువాయి) : ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలిస్తారని, గవర్నర్ అవి పాటించి తీరాలని ఉంది, సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులలో దీనిని ధ్రువపరిచింది. లిస్ట్-ఐఐ లోని 1, 2 ఎంట్రీలు చూస్తే శాంతిభద్రతలు రాష్ర్ట పరిధిలోనివి. గవర్నర్ కేంద్ర ప్రతినిధి. రాష్ట్ర పరిధిలోని శాంతి భద్రతలు గవర్నర్‌కు బదలాయించాలంటే రాజ్యాంగ సవరణ చేయకుండా సాధ్యమా? నా మిత్రుడు, న్యాయ మంత్రి సిబల్‌గారు ఇక్కడే ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఇలాగే చేయాల్సివచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371 హెచ్ పొందుపరిచాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ లేకుండా గవర్నర్‌కి అధికారాలు ఇవ్వగలరా? అందువల్ల రాజ్యాంగ సవరణ చట్టబద్ధమవుతుంది. మేము రాజ్యాంగ సవరణకు మద్దతిస్తాం. సవరణకు మేం వ్యతిరేకం కాదు. కానీ మీరెందుకు తెలంగాణ రాష్ట్రాన్ని చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారనేది నా ప్రశ్న. ప్రభుత్వం ఈ విషయమై స్పందించాలని కోరుకుంటున్నా. సార్! నా ఆఖరి పాయింట్ - నా సీనియర్ సహచరుడు వెంకయ్యనాయుడు కోరినట్టు మనం సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయాలి. హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం ఉంది. హైదరాబాద్ తెలంగాణకు వెళుతోంది. అందువల్ల సీమాంధ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. సీమాంధ్ర ప్రయోజనాలను మనం కాపాడాలి. కేంద్ర ప్రాజెక్టులు హైదరాబాద్‌లో ఉన్నందున సీమాంధ్రలో ప్రాజెక్టులు ఏర్పరచాలి. ప్రధానమంత్రి గారు ఇప్పుడే ఒక స్పష్టమైన ప్రకటన చేసి, అవసరమైతే చట్టానికి సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి మా డిమాండ్లకు తగ్గ సమాధానం రాకపోతే నేనూ, వెంకయ్యనాయుడూ చేసిన సవరణల విషయమై పట్టుబట్టక తప్పదని తెలియ చేస్తూ, థాంక్స్. (ప్రతిపక్ష నాయకుడు ప్రసంగిస్తున్నంతసేపూ అంతరాయం కలుగుతూనే ఉంది) డిప్యూటీ చైర్మన్ : మీకేంకావాలి (అంతరాయం) మీ పార్టీ సభ్యులు మాట్లాడారు. ఏమి పాయింట్? సరే ఒక్క నిమిషం తీసుకోండి. తపన్కుమార్సేన్, సీపీఎం సభ్యుడు (వెస్ట్‌బెంగాల్): మా నాయకుడిప్పటికే భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మా పార్టీ వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. యధార్థం చెప్పటానికి నిలబడ్డాను. ఈ బిల్లును సమర్థిస్తూ మాట్లాడిన నా సహచర సభ్యులొకరు, 1950, తెలంగాణ పోరాటాన్ని ప్రస్తావించారు. ఇది చరిత్రను వక్రీకరించటం. ఆ పోరాటం పి.సుందరయ్య, బసవ పున్నయ్య, రాజేశ్వరరావుల నాయకత్వంలో జరిగింది. ఆ పోరాటం నిజాం దుశ్చర్యలకు, రజాకార్ల దారుణాలకు వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటమే, తెలంగాణా ప్రాంతాన్ని ప్రజాస్వామ్య భారతదేశంలో పూర్తిగా విలీనం చేసింది. ఇప్పుడు జరుగుతున్నది విడదీయటం, అప్పటి విలీనానికి పూర్తి భిన్నమైన దిశలో జరుగుతోంది. దయచేసి ఇందులో కలపకండి. మళ్లీ ఆలోచించండి. డిప్యూటీ చైర్మన్: ఓకే, ఆల్రైట్. తపన్కుమార్సేన్: భారతీయతను బలహీనపర్చకండి. నిన్నగాక మొన్న గౌ॥ప్రధానమంత్రి ఇదే విషయాన్ని వీడ్కోలు సభలో కూడా చెప్పారు. డిప్యూటీ చైర్మన్ : ఓకే. తపన్కుమార్సేన్: దయచేసి మూలాలను కత్తిరించకండి. మళ్లీ ఆలోచించండి. ఇతర ప్రాంతాల్లో అగ్గి రాజేయకండి. (అంతరాయం) డిప్యూటీ చైర్మన్: ఓకే. కూర్చోండి. (అంతరాయం) తపన్కుమార్సేన్: రెచ్చగొట్టకండి (అంతరాయం) నా విన్నపం. ఈ సభకి (అంతరాయం). తర్వాత సభ నిర్ణయం అందరూ పాటించాల్సిందే. డిప్యూటీ చైర్మన్ : ఇప్పుడు గౌ॥‘లా’ మంత్రి.. కపిల్ సిబల్: అధ్యక్షా! ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీగారి మాటలను సావధానంగా విన్నాను. గవర్నర్‌కు ఇచ్చే అధికారాల రాజ్యాంగబద్ధత గురించి మాత్రమే చెబుతాను. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేస్తున్నపుడు అనేక విషయాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ పరిష్క రించాలి. ఒకసారి సరిహద్దులు ఏర్పాటు చేసినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కొనడానికి ఆర్టికల్ 3, 4 సరిపోతాయి. ఆర్టికల్ 3 కింద రాజ్యాంగం పార్లమెంట్‌కు అధికారాలిచ్చింది. దానికింద ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు, ఏర్పాటు ఫలితంగా పర్యవసానాలు పరిష్కరించడానికి రాజ్యాంగ సవరణ చేయకపోయినా చేసినట్టే భావించాలి అని 4(2)లో స్పష్టం చేశారు. ఆర్టికల్ 3(ఎ) ప్రకారం ఇది సుస్పష్టం. దాని ప్రకారం ఇన్సిడెంటల్, కాన్‌సీక్వెంటల్, సప్లిమెంటల్గా జరిగే నిర్ణయాలు, రాజ్యాంగ సవరణ చేయకపోయినా చేసినట్లే. అందుచేత రాష్ట్ర విభజన ఫలితంగా ఉత్పన్నమైన గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు అనే అంశం ఆర్టికల్ 3, 4 ప్రకారం రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఏర్పాటు చేయవచ్చు. నా మిత్రుడు జైట్లీగారు ఆర్టికల్ 371 హెచ్ గురించి కూడా చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు. మొదటిది - రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు గవర్నర్‌కు అధికారాలివ్వలేదు కాబట్టి తర్వాత రాజ్యాంగ సవరణ చేసి అధికారాలివ్వటం జరిగింది. కాని ఇక్కడ అలా కాదు. ఏది ఏమైనప్పటికీ, ఇది ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు ముఖ్యమైన అంశమే, ఏదైనా సంశయం ఉంటే, 2014 ఎన్నికల తర్వాత కొత్త ప్రభు త్వం, అప్పటి లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కోరికను బట్టి ఎలా కావాలంటే అలా పరిష్కరించుకోవచ్చు. ఈ విషయం చిట్టచివరిగా కోర్టు కెళ్లినప్పుడు, కచ్చితంగా వెళ్తుందనే నా నమ్మకం, కోర్టు కనుక పార్లమెంట్ ఏం చేయాలో చెప్పినప్పుడు, అప్పటి పార్లమెంట్ అవసరానుగుణంగా సవరణలు కావాలంటే ఓటింగ్‌తో సవరించుకోవచ్చు. నేను చెప్పే ఆఖరి అంశం.. కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు సహజంగానే తలెత్తే ఉద్రిక్తతలను సమాధా నపరచటం క్లిష్టతరమైనది. తెలంగాణ వారైనా, సీమాంధ్ర వారైనా వారి ఆగ్రహావేశాలను అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ పార్లమెంట్ చట్టాలు చెయ్యకతప్పదు. పార్లమెంట్ చట్టాలు చెయ్యాలి. గవర్నమెంట్ నిర్ణయాలు చెయ్యాలి. అలా చెయ్యకపోతే చరిత్ర మనల్ని తప్పుబడుతుంది. తెలంగాణ ఏర్పడే సమయం వచ్చేసింది. తెలంగాణను సమర్థించినందుకు ప్రతిపక్ష నేతను నేనభినందిస్తున్నాను. ఈ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
'సీమాంధ్ర ప్రయోజనాలూ ముఖ్యమే'
పార్లమెంట్లో ఏం జరిగింది -24 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాల కొనసాగింపు. వై.చౌదరి: (నిన్నటి తరువాయి) ఆఖరుగా, నేనందర్నీ ఆలోచించమంటున్నాను. నా ఉద్దేశం, ఏపీలోని ప్రతి తెలుగువాడి బాధను ఈ సభకు అర్థం అయ్యేలా చెయ్యటమే... ఈ బిల్లును తెస్తున్న పద్ధతి ఎవ్వరికీ మంచిది కాదు. తెలంగాణ, హైదరాబాద్‌లో వారికి గాని, రాయలసీమ కోస్తా ప్రజలకి గానీ కొద్ది సమయంలోనే ఇది ఎంత నష్టదాయకమో అర్థమవుతుంది. నీటి విషయం గాని, కరెంట్ విషయం గాని వారు పట్టించుకోలేదు. తెలంగాణలో బోరుబావుల వ్యవసాయానికి కరెంట్ కావాలి. వారికి కరెంట్ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది. రాజకీయ లబ్ధికోసమే తప్ప, కాంగ్రెస్ ఇంకేమీ చెయ్యలేదు. యూనివర్సిటీలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఎలా చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీసం వివరించే ప్రయత్నమే జరగలేదు. ఈ అప్రజాస్వామిక విధానాన్ని ప్రతి సభ్యుడూ గ్రహించాలి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ పని చేస్తోంది. తలకిందులుగా ప్రయత్నించినా వారికి ఒక్క సీటు రాదు. అది వేరే విషయం. వాళ్ల సొంత ముఖ్యమంత్రే రాజీనామా చేశారు. 15వ లోక్‌సభ ముగుస్తున్న సమయంలో ఈ రాజ్యాంగ విరుద్ధమైన, అసహజమైన బిల్లు తెచ్చారు. సాంప్రదాయికంగా ఓట్ ఆన్ అకౌంట్ మనమెందుకు తెస్తాం? బయటకు వెళ్లబోతున్న ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోకూడదనే కదా! ఇలాంటి సమయంలో ఓటర్ల మీద ఇలాంటి ప్రభావం చూపే నిర్ణయం తీసుకోవచ్చా? ఇది సమంజసం కాదు. తెలంగాణను ఆహ్వానిస్తున్నాం కానీ, అది సీమాంధ్ర బతుకులు పణంగా పెట్టి మాత్రం కాదు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. అందుకే, అలా జరగకుండా, బిల్లును స్టాండింగ్ కమిటీకో, సెలక్ట్ కమిటీకో పంపించండి! న్యాయ సలహా తీసుకోండి. అటార్నీ జనరల్‌ను వచ్చి వివరించమనండి! మనం సంతృప్తి చెంది బలపరచవచ్చు. అలా కాకపోతే,, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. డిప్యూటీ చైర్మన్: కృతజ్ఞతలు జైట్లీ: ఈ బిల్లు మీద నాకు మిశ్రమ అభిప్రాయాలున్నాయి. తెలంగాణ ఏర్పడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా పార్టీ 1980 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో, 2006 నుంచి జాతీయ స్థాయిలో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధిస్తూనే వచ్చింది. అందుకే ఈ రోజు, తెలంగాణ రాష్ట్రం వెలుగు చూడబోతోందన్న ఆనందం కలుగుతోంది. అదే సమయంలో నాకు రెండు మిశ్రమ అభిప్రాయాలున్నాయి. ఇప్పటి వరకూ సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం సరిగ్గా జరగలేదన్నది నా బాధ. సీమాంధ్ర వారు మనం ఏమి చేస్తామా, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందా? అని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కారణంగా వారు ఏ ఇబ్బందులైతే ఎదుర్కొంటారో, ఆ ఇబ్బందుల్ని మనం సమాధాన పరచాలి. ఈ మొత్తం విషయంలో యూపీఏ వ్యవహరించిన తీరు చాలా నిరాశకు గురిచేసిందని చెప్పక తప్పదు. తెలంగాణ డిమాండ్‌కి చాలా చరిత్ర ఉంది. అనేక పోరాటాల తరువాత నిజాం రాజ్యం మన దేశంలో కలసింది. మా పార్టీ ఈ డిమాండ్‌ను పూర్తిగా బలపరిచింది. ఇక యూపీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ప్రవర్తించింది అనేది రెండో విషయం. సార్! ఎన్డీఏ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అనే మూడు రాష్ట్రాలను వాజ్‌పేయిగారి నాయకత్వంలో ఏర్పాటు చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఏకగ్రీవ తీర్మానాల తరువాత దేశంలో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాం. ఎక్కడా ఒక్క నిరసన కూడా ఎదుర్కొనవలసిన అవసరం రాలేదు. ఇంతటి తీవ్రమైన అంశంలో యూపీఏ ఏం చేసింది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2004లో తెలంగాణ అంశం పెట్టింది. పదేళ్లు పక్కన పెట్టి, చివరికి ఎన్నికల సందర్భంగా 2014లో ఈ డిమాండ్‌ను పూర్తి చేయాలనుకున్నారు. పూర్తి చేసే సమయంలో కూడా రెండు ప్రాంతాల వారిని ఒప్పించలేకపోయారు. ఆనాటి హోంమంత్రి 9-12-2009 నాడు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. అసెంబ్లీ తీర్మానం కావాలని అడిగారు. మళ్లీ వెనక్కి తగ్గి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ తరువాత కమిటీ రిపోర్టు అమలు చేయలేదు. ఇన్నేళ్లూ ఏమీ చేయలేదు. ఫలితంగా ఈ రోజు తెలంగాణ ఏర్పాటు లాంటి ఒక మంచి పని చేస్తుంటే ప్రభుత్వంలో మంత్రులే అడ్డుపడుతున్నారు. అధికార పార్టీ ఎంపీలు అడ్డుపడుతున్నారు. లోక్‌సభ చాలామంది ఎంపీల్ని సస్పెండ్ చేసి, వారు లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయడం దురదృష్టకరం. ఒక రాష్ట్రం ఏర్పాటును ఇంత చేదు అనుభవంగా చేశారు. తెలంగాణ ఏర్పాటు అనే ఒక మంచి కార్యక్రమం, యూపీఏ తీరు వల్ల చెడ్డపేరు తెచ్చుకుంది. సార్! ఈ సందర్భంగా నేనొక అత్యంత ముఖ్య మైన అంశాన్ని లేవనెత్తుతున్నాను. మేము తెలంగాణ ఏర్పాటును బలపరుస్తున్నాం. కానీ ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా చట్టం ముందు నిలబడేలా సరైన రీతిలో జరగాలి. సార్! బిల్లులోని క్లాజ్-8 ప్రకారం హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధాని అని పేర్కొన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని విషయంలో మాకెలాంటి అభ్యంతరాలూ లేవు. మధ్యవర్తిగా గవర్నర్ చేతుల్లో శాంతిభద్రతలు ఉంచడం కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ నా భయం ఏమిటంటే, గవర్నర్ చేతికి ఈ అధికారాలు అప్పగించడానికి మామూలు చట్టం చేసేస్తే అది రాజ్యాంగబద్ధమవుతుందా? అని. రాజ్యాంగ సవరణ చేయకుండా ఇది రాజ్యాంగబద్ధం అవుతుందా అని! ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com