పార్లమెంట్‌లో ఏం జరిగింది -25
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
అరుణ్‌జైట్లీ (నిన్నటి తరువాయి) : ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలిస్తారని, గవర్నర్ అవి పాటించి తీరాలని ఉంది, సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులలో దీనిని ధ్రువపరిచింది. లిస్ట్-ఐఐ లోని 1, 2 ఎంట్రీలు చూస్తే శాంతిభద్రతలు రాష్ర్ట పరిధిలోనివి. గవర్నర్ కేంద్ర ప్రతినిధి. రాష్ట్ర పరిధిలోని శాంతి భద్రతలు గవర్నర్‌కు బదలాయించాలంటే రాజ్యాంగ సవరణ చేయకుండా సాధ్యమా? నా మిత్రుడు, న్యాయ మంత్రి సిబల్‌గారు ఇక్కడే ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఇలాగే చేయాల్సివచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371 హెచ్ పొందుపరిచాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ లేకుండా గవర్నర్‌కి అధికారాలు ఇవ్వగలరా? అందువల్ల రాజ్యాంగ సవరణ చట్టబద్ధమవుతుంది. మేము రాజ్యాంగ సవరణకు మద్దతిస్తాం. సవరణకు మేం వ్యతిరేకం కాదు. కానీ మీరెందుకు తెలంగాణ రాష్ట్రాన్ని చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారనేది నా ప్రశ్న. ప్రభుత్వం ఈ విషయమై స్పందించాలని కోరుకుంటున్నా.
సార్! నా ఆఖరి పాయింట్ - నా సీనియర్ సహచరుడు వెంకయ్యనాయుడు కోరినట్టు మనం సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయాలి. హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం ఉంది. హైదరాబాద్ తెలంగాణకు వెళుతోంది. అందువల్ల సీమాంధ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. సీమాంధ్ర ప్రయోజనాలను మనం కాపాడాలి. కేంద్ర ప్రాజెక్టులు హైదరాబాద్‌లో ఉన్నందున సీమాంధ్రలో ప్రాజెక్టులు ఏర్పరచాలి. ప్రధానమంత్రి గారు ఇప్పుడే ఒక స్పష్టమైన ప్రకటన చేసి, అవసరమైతే చట్టానికి సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి మా డిమాండ్లకు తగ్గ సమాధానం రాకపోతే నేనూ, వెంకయ్యనాయుడూ చేసిన సవరణల విషయమై పట్టుబట్టక తప్పదని తెలియ చేస్తూ, థాంక్స్.
(ప్రతిపక్ష నాయకుడు ప్రసంగిస్తున్నంతసేపూ అంతరాయం కలుగుతూనే ఉంది)
డిప్యూటీ చైర్మన్ : మీకేంకావాలి (అంతరాయం) మీ పార్టీ సభ్యులు మాట్లాడారు. ఏమి పాయింట్? సరే ఒక్క నిమిషం తీసుకోండి.
తపన్‌కుమార్‌సేన్, సీపీఎం సభ్యుడు (వెస్ట్‌బెంగాల్): మా నాయకుడిప్పటికే భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మా పార్టీ వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. యధార్థం చెప్పటానికి నిలబడ్డాను. ఈ బిల్లును సమర్థిస్తూ మాట్లాడిన నా సహచర సభ్యులొకరు, 1950, తెలంగాణ పోరాటాన్ని ప్రస్తావించారు. ఇది చరిత్రను వక్రీకరించటం. ఆ పోరాటం పి.సుందరయ్య, బసవ పున్నయ్య, రాజేశ్వరరావుల నాయకత్వంలో జరిగింది. ఆ పోరాటం నిజాం దుశ్చర్యలకు, రజాకార్ల దారుణాలకు వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటమే, తెలంగాణా ప్రాంతాన్ని ప్రజాస్వామ్య భారతదేశంలో పూర్తిగా విలీనం చేసింది. ఇప్పుడు జరుగుతున్నది విడదీయటం, అప్పటి విలీనానికి పూర్తి భిన్నమైన దిశలో జరుగుతోంది. దయచేసి ఇందులో కలపకండి. మళ్లీ ఆలోచించండి.
డిప్యూటీ చైర్మన్: ఓకే, ఆల్‌రైట్.
తపన్‌కుమార్‌సేన్: భారతీయతను బలహీనపర్చకండి. నిన్నగాక మొన్న గౌ॥ప్రధానమంత్రి ఇదే విషయాన్ని వీడ్కోలు సభలో కూడా చెప్పారు.
డిప్యూటీ చైర్మన్ : ఓకే.
తపన్‌కుమార్‌సేన్: దయచేసి మూలాలను కత్తిరించకండి. మళ్లీ ఆలోచించండి. ఇతర ప్రాంతాల్లో అగ్గి రాజేయకండి. (అంతరాయం)
డిప్యూటీ చైర్మన్: ఓకే. కూర్చోండి. (అంతరాయం)
తపన్‌కుమార్‌సేన్: రెచ్చగొట్టకండి (అంతరాయం) నా విన్నపం. ఈ సభకి (అంతరాయం). తర్వాత సభ నిర్ణయం అందరూ పాటించాల్సిందే.
డిప్యూటీ చైర్మన్ : ఇప్పుడు గౌ॥‘లా’ మంత్రి..
కపిల్ సిబల్: అధ్యక్షా! ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీగారి మాటలను సావధానంగా విన్నాను. గవర్నర్‌కు ఇచ్చే అధికారాల రాజ్యాంగబద్ధత గురించి మాత్రమే చెబుతాను. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేస్తున్నపుడు అనేక విషయాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ పరిష్క రించాలి. ఒకసారి సరిహద్దులు ఏర్పాటు చేసినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కొనడానికి ఆర్టికల్ 3, 4 సరిపోతాయి. ఆర్టికల్ 3 కింద రాజ్యాంగం పార్లమెంట్‌కు అధికారాలిచ్చింది. దానికింద ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు, ఏర్పాటు ఫలితంగా పర్యవసానాలు పరిష్కరించడానికి రాజ్యాంగ సవరణ చేయకపోయినా చేసినట్టే భావించాలి అని 4(2)లో స్పష్టం చేశారు. ఆర్టికల్ 3(ఎ) ప్రకారం ఇది సుస్పష్టం. దాని ప్రకారం ఇన్‌సిడెంటల్, కాన్‌సీక్వెంటల్, సప్లిమెంటల్‌గా జరిగే నిర్ణయాలు, రాజ్యాంగ సవరణ చేయకపోయినా చేసినట్లే. అందుచేత రాష్ట్ర విభజన ఫలితంగా ఉత్పన్నమైన గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు అనే అంశం ఆర్టికల్ 3, 4 ప్రకారం రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఏర్పాటు చేయవచ్చు.
నా మిత్రుడు జైట్లీగారు ఆర్టికల్ 371 హెచ్ గురించి కూడా చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు. మొదటిది - రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు గవర్నర్‌కు అధికారాలివ్వలేదు కాబట్టి తర్వాత రాజ్యాంగ సవరణ చేసి అధికారాలివ్వటం జరిగింది. కాని ఇక్కడ అలా కాదు. ఏది ఏమైనప్పటికీ, ఇది ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు ముఖ్యమైన అంశమే, ఏదైనా సంశయం ఉంటే, 2014 ఎన్నికల తర్వాత కొత్త ప్రభు త్వం, అప్పటి లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కోరికను బట్టి ఎలా కావాలంటే అలా పరిష్కరించుకోవచ్చు. ఈ విషయం చిట్టచివరిగా కోర్టు కెళ్లినప్పుడు, కచ్చితంగా వెళ్తుందనే నా నమ్మకం, కోర్టు కనుక పార్లమెంట్ ఏం చేయాలో చెప్పినప్పుడు, అప్పటి పార్లమెంట్ అవసరానుగుణంగా సవరణలు కావాలంటే ఓటింగ్‌తో సవరించుకోవచ్చు.
నేను చెప్పే ఆఖరి అంశం.. కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు సహజంగానే తలెత్తే ఉద్రిక్తతలను సమాధా నపరచటం క్లిష్టతరమైనది. తెలంగాణ వారైనా, సీమాంధ్ర వారైనా వారి ఆగ్రహావేశాలను అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ పార్లమెంట్ చట్టాలు చెయ్యకతప్పదు. పార్లమెంట్ చట్టాలు చెయ్యాలి. గవర్నమెంట్ నిర్ణయాలు చెయ్యాలి. అలా చెయ్యకపోతే చరిత్ర మనల్ని తప్పుబడుతుంది. తెలంగాణ ఏర్పడే సమయం వచ్చేసింది. తెలంగాణను సమర్థించినందుకు ప్రతిపక్ష నేతను నేనభినందిస్తున్నాను. ఈ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com