ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా
ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా
Published Sat, Nov 28 2015 8:47 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
పార్లమెంట్‌లో ఏం జరిగింది -26
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
అరుణ్‌జైట్లీ(నిన్నటి తరువాయి) : న్యాయమంత్రి గారు చెప్పిన ఒక విషయం మీద నేను మాట్లాడాలి. మనకి ఈ దేశంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయి. శాంతిభద్రతలు, పోలీసులు రాష్ట్ర పరిధిలోని అంశాలు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మాకభ్యంతరం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ సీమాంధ్ర ప్రభుత్వం కిందగాని, తెలంగాణ ప్రభుత్వం కిందగాని ఉండకూడదు. న్యూట్రల్ ఏజెన్సీగా గవర్నర్ చేతుల్లో ఉంటుంది. దానికి మా అభ్యంతరంలేదు. ప్రశ్న ఏమిటంటే, గవర్నర్‌కి ఇద్దరు సలహాదారులుంటారు. వారిని కేంద్రం నియమిస్తుంది.
గవర్నర్ కూడా కేంద్ర ప్రతినిధి. అంటే, గవర్నర్ ద్వారా శాంతిభద్రతలు కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోంది. ఇది మన ఫెడరల్ విధానానికి వ్యతిరేకం. సిబల్‌గారు ఇది సప్లిమెంటల్, ఇన్‌సిడెంటల్, కాన్‌సీక్వెంటల్ అంటున్నారు. ఈ విషయం అనుబంధమో, ఆకస్మికమో అనుకునేంత చిన్న విషయం కాదు. నా భయం ఏమిటంటే, ఇది మన ప్రభుత్వాల పనితీరుల్లో ప్రధానమైన మార్పు. అందుకే రాజ్యాంగ సవరణ, ఏదో ఒక స్థాయిలో తప్పనిసరి. మేము రాజ్యాంగ సవరణకు మద్దతిస్తాం. ఇప్పుడే, ఇక్కడే చట్టబద్ధంగా తెలంగాణ ఏర్పరచమంటున్నాం. రేపు ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వస్తే ఏమవుతుంది? మళ్లీ పార్లమెంట్ సమావేశమై రాజ్యాంగ సవరణ చెయ్యాలి.
కపిల్ : అప్పోజిషన్ లీడర్ కొన్ని నిమిషాల క్రితం గవర్నర్ న్యూట్రల్ ఏజెన్సీ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అంటున్నారు. సీమా్రంధ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే గవర్నర్‌కు ఇలా ఏజెంట్ బిరుదు కట్టబెట్టడం సమంజసం కాదు. గవర్నర్‌ను న్యూట్రల్‌గా భావించి అధికారాలిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా, తెలంగాణ మంత్రిమండలి సలహామేరకే ఆయన నడుచుకుంటారు. కాని ఆఖరుగా నిర్ణయాధికారం మాత్రం గవర్నర్‌దే. 371-హెచ్ ఆర్టికల్ కూడా ఇదే చెప్పింది.
ప్రధానమంత్రి : అధ్యక్షా! ప్రతిపక్ష నాయకుడు, ఇతర ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల ఉపన్యాసాలు శ్రద్ధగా విన్నాను. ఇప్పటికే, ప్రభుత్వం చేపట్టనున్న ప్రత్యేక చర్యల గురించి, ముఖ్యంగా సీమాంధ్ర గురించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గురించి హోంమంత్రి ప్రస్తావించారు. నేను మరికొన్ని ప్రకటనలు చేయదలిచాను.
మొదటిగా, కేంద్ర సహాయం అందించే నిమిత్తం, పదమూడు జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో సహా, ఐదేళ్లపాటు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇవ్వబడుతుంది. ఈ చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేస్తుంది.
రెండవది, బిల్లులో ఇప్పటికే ప్రస్తావించిన అంశం, అవసరమైన ఆర్థిక చర్యలతోపాటు, పన్ను మినహాయింపులు వంటి పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు కూడా రెండు రాష్ట్రాల్లో చేబడ్తాం. కొన్ని రాష్ట్రాలకు ఎలాగైతే ఇటువంటి వెసులుబాట్లు కల్పించామో, అదే ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు అమలు చేస్తాం.
మూడవది, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ‘డెవలప్‌మెంట్ ప్యాకేజీ’ని బిల్లులో పొందుపర్చాం. ఈ ప్యాకేజీ ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోరాపుట్- బొలంగీర్ - కలహంది, బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుంది.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
Advertisement
Advertisement