'సీమాంధ్ర ప్రయోజనాలూ ముఖ్యమే'
'సీమాంధ్ర ప్రయోజనాలూ ముఖ్యమే'
Published Thu, Nov 26 2015 12:08 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
పార్లమెంట్‌లో ఏం జరిగింది -24
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాల కొనసాగింపు.
వై.చౌదరి: (నిన్నటి తరువాయి) ఆఖరుగా, నేనందర్నీ ఆలోచించమంటున్నాను. నా ఉద్దేశం, ఏపీలోని ప్రతి తెలుగువాడి బాధను ఈ సభకు అర్థం అయ్యేలా చెయ్యటమే... ఈ బిల్లును తెస్తున్న పద్ధతి ఎవ్వరికీ మంచిది కాదు. తెలంగాణ, హైదరాబాద్‌లో వారికి గాని, రాయలసీమ కోస్తా ప్రజలకి గానీ కొద్ది సమయంలోనే ఇది ఎంత నష్టదాయకమో అర్థమవుతుంది. నీటి విషయం గాని, కరెంట్ విషయం గాని వారు పట్టించుకోలేదు. తెలంగాణలో బోరుబావుల వ్యవసాయానికి కరెంట్ కావాలి. వారికి కరెంట్ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది. రాజకీయ లబ్ధికోసమే తప్ప, కాంగ్రెస్ ఇంకేమీ చెయ్యలేదు. యూనివర్సిటీలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఎలా చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీసం వివరించే ప్రయత్నమే జరగలేదు. ఈ అప్రజాస్వామిక విధానాన్ని ప్రతి సభ్యుడూ గ్రహించాలి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ పని చేస్తోంది.
తలకిందులుగా ప్రయత్నించినా వారికి ఒక్క సీటు రాదు. అది వేరే విషయం. వాళ్ల సొంత ముఖ్యమంత్రే రాజీనామా చేశారు. 15వ లోక్‌సభ ముగుస్తున్న సమయంలో ఈ రాజ్యాంగ విరుద్ధమైన, అసహజమైన బిల్లు తెచ్చారు. సాంప్రదాయికంగా ఓట్ ఆన్ అకౌంట్ మనమెందుకు తెస్తాం? బయటకు వెళ్లబోతున్న ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోకూడదనే కదా! ఇలాంటి సమయంలో ఓటర్ల మీద ఇలాంటి ప్రభావం చూపే నిర్ణయం తీసుకోవచ్చా? ఇది సమంజసం కాదు. తెలంగాణను ఆహ్వానిస్తున్నాం కానీ, అది సీమాంధ్ర బతుకులు పణంగా పెట్టి మాత్రం కాదు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. అందుకే, అలా జరగకుండా, బిల్లును స్టాండింగ్ కమిటీకో, సెలక్ట్ కమిటీకో పంపించండి! న్యాయ సలహా తీసుకోండి. అటార్నీ జనరల్‌ను వచ్చి వివరించమనండి! మనం సంతృప్తి చెంది బలపరచవచ్చు. అలా కాకపోతే,, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.
డిప్యూటీ చైర్మన్: కృతజ్ఞతలు
జైట్లీ: ఈ బిల్లు మీద నాకు మిశ్రమ అభిప్రాయాలున్నాయి. తెలంగాణ ఏర్పడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా పార్టీ 1980 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో, 2006 నుంచి జాతీయ స్థాయిలో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధిస్తూనే వచ్చింది. అందుకే ఈ రోజు, తెలంగాణ రాష్ట్రం వెలుగు చూడబోతోందన్న ఆనందం కలుగుతోంది. అదే సమయంలో నాకు రెండు మిశ్రమ అభిప్రాయాలున్నాయి. ఇప్పటి వరకూ సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం సరిగ్గా జరగలేదన్నది నా బాధ. సీమాంధ్ర వారు మనం ఏమి చేస్తామా, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందా? అని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కారణంగా వారు ఏ ఇబ్బందులైతే ఎదుర్కొంటారో, ఆ ఇబ్బందుల్ని మనం సమాధాన పరచాలి. ఈ మొత్తం విషయంలో యూపీఏ వ్యవహరించిన తీరు చాలా నిరాశకు గురిచేసిందని చెప్పక తప్పదు. తెలంగాణ డిమాండ్‌కి చాలా చరిత్ర ఉంది. అనేక పోరాటాల తరువాత నిజాం రాజ్యం మన దేశంలో కలసింది. మా పార్టీ ఈ డిమాండ్‌ను పూర్తిగా బలపరిచింది. ఇక యూపీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ప్రవర్తించింది అనేది రెండో విషయం. సార్! ఎన్డీఏ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అనే మూడు రాష్ట్రాలను వాజ్‌పేయిగారి నాయకత్వంలో ఏర్పాటు చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఏకగ్రీవ తీర్మానాల తరువాత దేశంలో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాం.
ఎక్కడా ఒక్క నిరసన కూడా ఎదుర్కొనవలసిన అవసరం రాలేదు. ఇంతటి తీవ్రమైన అంశంలో యూపీఏ ఏం చేసింది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2004లో తెలంగాణ అంశం పెట్టింది. పదేళ్లు పక్కన పెట్టి, చివరికి ఎన్నికల సందర్భంగా 2014లో ఈ డిమాండ్‌ను పూర్తి చేయాలనుకున్నారు. పూర్తి చేసే సమయంలో కూడా రెండు ప్రాంతాల వారిని ఒప్పించలేకపోయారు. ఆనాటి హోంమంత్రి 9-12-2009 నాడు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. అసెంబ్లీ తీర్మానం కావాలని అడిగారు. మళ్లీ వెనక్కి తగ్గి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ తరువాత కమిటీ రిపోర్టు అమలు చేయలేదు. ఇన్నేళ్లూ ఏమీ చేయలేదు. ఫలితంగా ఈ రోజు తెలంగాణ ఏర్పాటు లాంటి ఒక మంచి పని చేస్తుంటే ప్రభుత్వంలో మంత్రులే అడ్డుపడుతున్నారు. అధికార పార్టీ ఎంపీలు అడ్డుపడుతున్నారు. లోక్‌సభ చాలామంది ఎంపీల్ని సస్పెండ్ చేసి, వారు లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయడం దురదృష్టకరం. ఒక రాష్ట్రం ఏర్పాటును ఇంత చేదు అనుభవంగా చేశారు. తెలంగాణ ఏర్పాటు అనే ఒక మంచి కార్యక్రమం, యూపీఏ తీరు వల్ల చెడ్డపేరు తెచ్చుకుంది.
సార్! ఈ సందర్భంగా నేనొక అత్యంత ముఖ్య మైన అంశాన్ని లేవనెత్తుతున్నాను. మేము తెలంగాణ ఏర్పాటును బలపరుస్తున్నాం. కానీ ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా చట్టం ముందు నిలబడేలా సరైన రీతిలో జరగాలి. సార్! బిల్లులోని క్లాజ్-8 ప్రకారం హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధాని అని పేర్కొన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని విషయంలో మాకెలాంటి అభ్యంతరాలూ లేవు. మధ్యవర్తిగా గవర్నర్ చేతుల్లో శాంతిభద్రతలు ఉంచడం కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ నా భయం ఏమిటంటే, గవర్నర్ చేతికి ఈ అధికారాలు అప్పగించడానికి మామూలు చట్టం చేసేస్తే అది రాజ్యాంగబద్ధమవుతుందా? అని. రాజ్యాంగ సవరణ చేయకుండా ఇది రాజ్యాంగబద్ధం అవుతుందా అని!
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
Advertisement
Advertisement