దేశమంతా భయపడుతోంది..! | ap-bifurcate-bill | Sakshi
Sakshi News home page

దేశమంతా భయపడుతోంది..!

Published Wed, Nov 25 2015 9:36 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

దేశమంతా భయపడుతోంది..! - Sakshi

దేశమంతా భయపడుతోంది..!

పార్లమెంట్‌లో ఏం జరిగింది -23
 
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాల కొనసాగింపు.
బీరేంద్ర ప్రసాద్ బైశ్య: నేనీ బిల్లు వ్యతిరేకిస్తున్నాను. ప్రధాన మంత్రిగారిని తగు చర్యలు చేపట్టమని కోరుతున్నాను. ఈ బిల్లు పాస్ చెయ్య వద్దు. మీ తప్పుడు విధానం వల్ల దేశంలో ఏం జరిగినా దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
డిప్యూటీ చైర్మన్: ఇంక మీరు చాలించండి.
బీరేంద్ర ప్రసాద్ బైశ్య: ఒక్క నిముషం. మనోభావాలకి సంబంధించిన విషయమిది. సెంటిమెంట్‌కు సంబంధించినప్పుడు అనేక విషయాలు బైటపడతాయి. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు మొత్తం దేశానికే ముప్పు తెస్తుంది. ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు కారణంగా ఏదైనా విపత్తు వాటిల్లితే గవర్నమెంట్‌దే బాధ్యత.
డిప్యూటీ చైర్మన్: ఓకే.
బీరేంద్రప్రసాద్ బైశ్య: దయచేసి దీనిని ఆపండి. దయచేసి ఆపండి. మాకు న్యాయం చేయండి. థాంక్యూ.
డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్... సభలో లేరు. శ్రీ వైఎస్ చౌదరి, శ్రీ చౌదరి మాట్లాడబోయేముందు ఒక ప్రకటన. వీడ్కోలు సభ 8 గంటలకు మార్చబడింది. అప్పటిదాకా సభ కొనసాగటానికి అంగీకరిస్తున్నారనుకుంటున్నా.. ఇప్పుడు శ్రీ చౌదరి...
 
వై.సత్యనారాయణ చౌదరి (ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి): గౌరవనీయులైన డిప్యూటీ చైర్మన్ గారూ, సభ్యులారా, ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ పట్ల బాధ, జాలితో మాట్లాడుతున్నా. ఈ బిల్లు పాస్ చెయ్యటానికి అత్యంత అప్రజా స్వామికంగా జరుగుతున్న విధానమిది. మా పార్టీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ చేపట్టిన ఈ పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది అప్రజాస్వామిక నిరంకుశ విధానం. అతి కష్టం మీద మనకు స్వాతంత్య్రం వచ్చింది. క్విట్ ఇండియా వంటి అనేక ఆందోళనలు జరిగాయి. కానీ ఈ వేళ జరుగుతున్నది, కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకటి కాదు. యూపీఏ పదేళ్ల నుంచి అధికారంలో ఉంది.
 
ముందే ఎందుకు చెయ్యలేదు? 2004 మ్యానిఫెస్టో ప్రకారం అంచెలంచెలుగా వారు ఈ పని మొదలు పెట్టవలసింది. లోక్ సభలో ఈ బిల్లు పాస్ చేసిన తీరు దేశమంతా భయపడేలా ఉంది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఎన్నికల నామి నేషన్లు పదిరోజుల్లో ఉండగా, ఇప్పుడిలా చేయటం చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం. మాకు తెలుసు, ప్రజా సెంటిమెంట్ ఆర్థిక, చట్ట విలువలకి అతీతమైనది. మనకి రాష్ట్రాల (ఎస్‌ఆర్‌సీ) పునర్విభజన చట్టముంది. 1956లో ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు మనకు ఎస్‌ఆర్‌సీ యాక్ట్ ఉంది. ఆ చట్టంలోనే, ఎప్పుడు ఏ రాష్ట్ర విభజన జరిగినా, ఉన్న పరిస్థితుల్ని బట్టి ప్రయోజనకరంగా ఉండాలని ప్రస్తావించబడింది. ఈ బిల్లుకు కారణాలేమిటో, ఏం సాధిం చాలనుకుంటున్నారో కూడా రాయటం మర్చిపోయారు. అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్లు పంపారు.
 
ఇక్కడ పెట్టిన బిల్లు పూర్తిగా వేరుగా ఉంది. ఏమిటంటే, అది డ్రాఫ్ట్ బిల్లు అంటారు హోం సెక్రటరీ. మినిస్టర్ మాత్రం అది రెగ్యులర్ బిల్లు అంటారు. టీఆర్‌ఎస్ పార్టీతో రాజకీయ వ్యూహాలు ప్రకటిస్తారు. ఇది అయిపోయాక వైఎస్సార్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రాజ్యాంగం వీరికి పరి పాలనాధికారం ఇచ్చిందా? రాజకీయాలు చేసే అధికారమిచ్చిందా? ఒకానొక సమయంలో శ్రీకృష్ణ కమిషన్ నియమించారు. 35-40 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ కమిటీ రిపోర్టు అవగాహన చేసుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం, తెలంగాణలో వెనకబడిన ప్రాంతం లేదని, అలా చూస్తే దేశం మొత్తం మీద చాలా వెనకబడిన ప్రాంతాలున్నాయని పేర్కొంది. మనం వేరు రాష్ట్రాలు ఇచ్చేద్దామా? కాని తర్వాత అంటున్నారు వెనకబడిన ప్రాంతం అని కాదు... స్వయం పాలన కోసమని! స్వయంపాలన పేరుతో ఈ రకంగా దేశాన్ని ముక్కలు చేస్తారా?
 
సార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ బిల్లును తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ వారినే సమాధానపరచలేకపోయింది ఇలాంటి బిల్లు విషయంలో. దీనికి అనేక రాజ్యాంగ సవరణలు అవసరం. అన్నీ విస్మరించారు. అసమగ్ర బిల్లు ముందు ఇక్కడకే తెద్దామనుకున్నారు. ఆర్థికపరమైన అంశాలున్నాయని మన చైర్మన్ గారికి మేము నోటీసు ఇవ్వటం వల్ల, తిప్పి పంపారు. బిల్లు ముందుగా రాజ్యసభలో ప్రవేశపెడితే, పాస్ కాక పోయినా తర్వాత ప్రభుత్వం మళ్లీ చేపట్టవచ్చు. అదే లోక్‌సభలో ప్రవేశపెడితే ఆ లోక్‌సభ ‘డిజాల్వ్’ అనగానే బిల్లు డిజాల్వ్ అయిపోతుంది. తరువాత ప్రభుత్వం చేబట్టలేదు! ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ వారు విభజన వాయిదా వేద్దాం... బిల్లు బ్రతికించి ఉంచుదాం అని ఆలోచన చేశారా!? ఎందుకు రాజ్యసభలో పెట్టాలని అనుకున్నారు... అలా ఈ బిల్లు లోక్‌సభకి వెళ్లింది.
(ఇక్కడ లోక్‌సభలో జరిగిన సంఘటన మీద చేసిన వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించారు)
సార్, ఆంధ్రప్రదేశ్ అసలు భారతదేశంలో భాగమేనా? మాకర్థం కావటం లేదు! ఇలాగేనా చేయటం. యుద్ధ ప్రాతిపదికన పాస్ చేస్తున్నారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం.
 
డిప్యూటీ చైర్మన్: లోక్‌సభ మీద చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డు నుంచి తొలగిస్తున్నాం.
వై.చౌదరి: ఇది అన్ పార్లమెంటరీ కాదు. అదీ పార్లమెంట్‌లో భాగమే. ఈ బిల్లు న్యాయ నిపుణుల పరిశీలన జరగాలి. రూల్ 88 ప్రకారం అటార్నీ జనరల్‌ని పిలవమని నేను నోటీసిచ్చాను. మనం న్యాయ కోవిదులం కాదు. అసలీ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టడమే చట్ట విరుద్ధం. మన దేశానికి ప్రజాస్వామ్య దేశంగా మంచి పేరు ఉంది. నేను ప్రజాస్వామ్య పరిరక్షకులైన మిమ్మల్ని కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆట ఈ దేశమంతా గుర్తించాలి. గెలుపు ఓటములు ఆటలో సహజం. కాని వారు ఈ దేశ ప్రజాస్వామ్య ఫెడరల్ ప్రతిపత్తిని పాడు చేయకూడదు. ఇప్పటికే వారు ఆ ప్రతిపత్తిని నాశనం చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్నే నవ్వుల పాలు చేస్తున్నారు.
 
ద్వంద్వవిధానం పనిచేయదు. ప్రజా స్వామ్య పరిరక్షణ జరగాలి. ప్రతి సభ్యుడిని గౌరవించాలి. సంఖ్యను బట్టి కాదు. ఏమార్చే పద్ధతులు ఆపాలి. ఈ సభ అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం సెలక్ట్ కమిటీకి పంపించాలి. ఈ అరుపుల మధ్య బిల్లు పాస్ చేయకూడదు. చట్టవ్యతిరేకంగా జరగకూడదు. ఒకసారి అపహాస్యం మొదలైతే అది ఆగదు. ఏ పార్టీ అయినా ఎన్నిపార్టీలయినా... మనం ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ఉన్నాం. సార్ ఇది చాలా ప్రమాదం. ఇలాంటిది మొదలైతే, 272 స్థానాలు పొందగలిగిన వారెవరైనా ఈ దేశాన్ని ముక్కలు చేసేయగలరు.
 
ఉండవల్లి అరుణ్‌కుమార్
 
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
 a_vundavalli@yahoo.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement