కరెన్సీ కొరత నిజమే..కానీ..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న నగుదు కొరత సంక్షోభంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ కొరత ఉందని ఒప్పుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, పరివర్తన సమయంలో కొంత పెయిన్ తప్పదని చెప్పుకొచ్చారు. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో డిశెంబర్ 5-7 తేదీల్లో నిర్వహించిన పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగించారు. నవంబర్ 8న ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత కరెన్సీ నోట్ల కొరత నెలకొందని ఆయన అంగీకరించారు
నగదు కొరత ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, కానీ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రతి రోజు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. మీడియా సహా మిగతా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందన్నారు. లావాదేవీల్లో పారదర్శకత మూలంగా పన్నుల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.
ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు సక్రమమైన లావాదేవీల సులభతరం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.అలాగే ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులకోసం బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వినూత్న సాంకేతిక సేవల ద్వారా ప్రతీ చిన్నలావాదేవీని సులభంగా నిర్వహిచడానికి వీలవుతోందని జైట్లీ చెప్పారు.