నగదు రూపేణా కొనుగోలుకి రెడీ
తదుపరి బ్యాంక్ పేరుతోనే సేవలు
ఆర్థిక శాఖతో సంప్రదింపులు షురూ
ముంబై: పీఎస్‌యూ.. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి కెనడియన్ పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్ అధినేత బిలియనీర్ ప్రేమ్ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది.
రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్‌ఫాక్స్ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్‌ఫాక్స్ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎస్‌బీ విలీనం
దేశీయంగా సీఎస్‌బీ బ్యాంక్‌కు ఫెయిర్‌ఫాక్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్‌బీ ప్రమోటర్‌గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్ రెండు బ్యాంకులకు ప్రమోటర్‌గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్‌బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్‌బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే.
కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్‌బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది.
ఐడీబీఐ బ్యాంకులో సీఎస్‌బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. సవరించిన ఆఫర్ ద్వారా ఫెయిర్‌ఫాక్స్‌కు చెక్ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment