ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు.
ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు.
సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట
అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment