
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం.. నేటి నుంచే (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది. తద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది. ఇకనుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ బీవోబీ శాఖలుగా పనిచేయనున్నాయి. ‘విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ ఖాతాదారులను ఏప్రిల్ 1 నుంచి బీవోబీ ఖాతాదారులుగా పరిగణించడం జరుగుతుంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.
మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్రం గత వారం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అలాగే, దేనా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 110 లభిస్తాయి. ఈ మూడింటి విలీనంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడుతుంది. దీని వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గాను ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గుతుంది.