ట్రాన్స్‌ట్రాయ్‌ యంత్రాలు సీజ్‌ | Transstroy machines seize | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ట్రాయ్‌ యంత్రాలు సీజ్‌

Published Sat, Jan 6 2018 1:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

Transstroy machines seize - Sakshi

సీజ్‌ చేసినట్లుగా మిషనరీపై రాస్తున్న బ్యాంకు సిబ్బంది

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: కోట్లాది రూపాయల రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా మొండికేయడంతోపాటు నోటీసులు ఇచ్చినా స్పందించని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌పై దేనా బ్యాంకు అధికారులు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. నిర్మాణ సంస్థకు చెందిన మూడు యంత్రాలను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ‘ముఖ్య’నేత ఆదేశాలతో ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) అధికారులు రంగంలోకి దిగి, ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలు తీసుకోకుండా బ్యాంకు అధికారులను అడ్డుకోవడం గమనార్హం. ట్రాన్స్‌ట్రాయ్‌లో ‘ముఖ్య’నేతకు అనధికారికంగా భాగస్వామ్యం ఉండటం వల్లే ఆ సంస్థపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 

కోర్టు అనుమతితోనే చర్యలు 
హైదరాబాద్‌లోని దేనా బ్యాంకులో ట్రాన్స్‌ట్రాయ్‌ తన ఆస్తులను తనఖా(మార్ట్‌గేజ్‌) పెట్టి 2015లో రూ.87 కోట్ల రుణం తీసుకుంది. అసలు, వడ్డీతో కలిపి గత నవంబర్‌ నాటికి అది రూ.120 కోట్లకు చేరింది. రుణం చెల్లించాలని ట్రాన్స్‌ట్రాయ్‌కు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించామని దేనా బ్యాంకు అధికారులు తెలిపారు. కోర్టు అనుమతితో ట్రాన్స్‌ట్రాయ్‌ వాహనాలు, యంత్రాలను సీజ్‌ చేసేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు తవ్వకం యంత్రాలను సీజ్‌ చేశారు.

ఆ మేరకు యంత్రాలపై నోటీసులు అంటించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు చెందిన జీఎం ప్రకాశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. 64 యంత్రాలు, వాహనాలను సీజ్‌ చేసేందుకు అనుమతి ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. సెక్షన్‌ 14 సర్‌ప్లస్‌ యాక్ట్‌ ప్రకారం కోర్టు అనుమతితో ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement