Transstroy
-
కళ్లుగప్పి.. కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. కనికట్టు చేసి బ్యాంకులను దోచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరిలనే మించిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కెనరా బ్యాంకు నేతృత్వంలోని ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియంనే మోసం చేసి రూ.7,926.01 కోట్లను కొల్లగొట్టినట్లు సీబీఐ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. బ్యాంకుల అధికారుల సహకారం లేకుండా రాయపాటి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉండదనే నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. రూ.7,926.01 కోట్లు ఎగవేత పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, తిరుపతి–తిరుత్తణి–చెన్నై టోల్వేస్.. భోపాల్–బయోరా టోల్వేస్.. దిండిగల్–తెన్ని–కుమ్లి టోల్వేస్.. కృష్ణగిరి–దిండివనం హైవేస్, ఒబేదుల్లాగంజ్–బేతుల్, తిరుచ్చి–కలైకుడి టోల్వేస్ పనులు చేపట్టేందుకు రుణం ఇవ్వాలని కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియంను ట్రాన్స్ట్రాయ్ కోరింది. ఈ రుణానికి బోగస్ గ్యారంటీలను చూపింది. ఇవి నిజమైనవా కాదా అన్నది తేల్చుకోకుండా బ్యాంకుల కన్సార్షియం రూ.9,394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు 2013–2014లో అంగీకరించింది. ఈ రుణాన్ని నగదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ), గ్యారంటీ (బీజీ)ల రూపంలో ఇస్తామని పేర్కొంది. 2015–16 నాటికి రూ.7,926.01 కోట్ల రుణాన్ని నగదు, ఎల్వోసీ, బీజీల రూపంలో ఇచ్చింది. కానీ, తీసుకున్న రుణం చెల్లించకుండా ట్రాన్స్ట్రాయ్ మోసం చేయడంతో 2019 డిసెంబర్ 30న యూనియన్ బ్యాంక్, 2020 డిసెంబర్ 15న కెనరా బ్యాంక్ అధికారులు వేర్వేరుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన సీబీఐ.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి, ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర బాబ్జీ, మరో డైరెక్టర్ ఎం.సాంబశివరావులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్యాప్తులో వెల్లడైన అంశాలివీ.. రూ.2,261.58 కోట్లు ఏ బాబు జేబులోకో.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు ఏ సంస్థ అయినా బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన లావాదేవీలను ఆ బ్యాంకుల పరిధిలోనే నిర్వహించాలి. దీనివల్ల ఇచ్చిన రుణం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కానీ, కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.7,926.01 కోట్లలో రూ.2,261.58 కోట్లను కన్సార్షియంలోని లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), ఆర్బీఎల్లకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఐదు బ్యాంకుల ద్వారా మళ్లించిన మొత్తానికి ట్రాన్స్ట్రాయ్ సరైన లెక్కలు చూపకపోవడంతో.. ఆ నిధులు ఏ బాబు జేబులోకి చేరాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఎం.సాంబశివరావు పేరుతో యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయించిన రాయపాటి, పోలవరం పనుల కోసం ఆ సంస్థ నుంచి కేవలం రూ.3 కోట్ల విలువ చేసే వాహనాలను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, కొన్న వాహనాలనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపి బ్యాంకులు మంజూరు చేసిన రుణంలో యూనిక్ ఇంజనీర్స్ ఖాతాలోకి రూ.313.85 కోట్లను మళ్లించి కాజేశారు. సిమెంటు, స్టీలు వంటివి కొనకుండానే.. పోలవరం, ఇతర రహదారుల పనుల కోసం ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2017 వరకూ ట్రాన్స్ట్రాయ్ కేవలం రూ.274.36 కోట్ల విలువైన సామగ్రిని మాత్రమే ఐదు సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. అదే మెటీరియల్‌ను మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి రూ.2,568.77 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని కాజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సంస్థ నుంచి సిమెంటు కొనుగోలు చేసినట్లు బ్యాంక్ లెడ్జర్ బుక్‌లో చూపారు. కానీ, ఆ సంస్థకు కాకుండా మరో సంస్థకు చెల్లింపులు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. బ్యాంక్ లెడ్జర్ బుక్కూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌కూ పొంతన లేని లావాదేవీల ద్వారా రూ.1,624.35 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దోచేసింది. సక్రమంగా చెల్లింపులూ చేయని ట్రాన్స్ట్రాయ్ ట్రాన్స్ట్రాయ్ ఎక్కడ పనిచేసినా సబ్ కాంట్రాక్టర్లకు సక్రమంగా చెల్లింపులు చేయదు. పోలవరంలో చేసిన పనులకు బిల్లులు ఎగ్గొట్టడంతో 2016 నుంచి 2019 వరకూ ట్రాన్స్‌ట్రాయ్‌కి వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్లు నెలల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.794.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా ఇచ్చామని.. వాటిని తిరిగి ఇవ్వలేని దుస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉండటంతో వాటిని మాఫీ చేశామని ట్రాన్స్ట్రాయ్ లెక్కలు చెప్పడంపై సీబీఐ అధికారులే నిర్ఘాంతపోయినట్లు సమాచారం. -
కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి
సాక్షి, అమరావతి: బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించినప్పుడే గత సర్కారు ఆ సంస్థపై వేటు వేసి పోలవరం పనుల నుంచి తొలగిస్తే ఇంత భారీ కుంభకోణానికి అవకాశమే ఉండేది కాదని 14 బ్యాంకుల కన్సార్షియం, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కుంభకోణాన్ని చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం.. చంద్రబాబే పాల్పడిన స్కాంగా అభివర్ణిస్తున్నారు. ఎక్కడా లేని రీతిలో కేబినెట్ తీర్మానం ద్వారా పోలవరం పనుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌కి సిమెంట్, స్టీలు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేలా నాటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ రాయపాటి వాటిని కొనుగోలు చేయకుండానే నకిలీ బిల్లులతో రూ.1,527.10 కోట్ల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించి స్వాహా చేయడాన్ని బట్టి ఈ కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి అనేది స్పష్టమవుతోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ట్రాన్స్ట్రాయ్ వాటా 13 శాతమే.. పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ– ఈసీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ జేవీలో రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ వాటా 87% కాగా రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ సంస్థలో తన సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌ను డైరెక్టర్‌గా చేర్చి ఆ సంస్థకు కమీషన్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. చిన్న ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన రాయపాటి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దివాలా తీసిన సంస్థకే దన్ను.. పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించిన ట్రాన్స్‌ట్రాయ్‌కి కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం బ్యాంకు గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, రుణం రూపంలో రూ.7,926.01 కోట్లు ఇచ్చేందుకు 2013లో అంగీకారం తెలిపాయి. ఆ మేరకు రుణాలిచ్చాయి. ఇందులో కొంత భాగాన్ని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’గా మళ్లించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న రుణాన్ని ఇతర సంస్థలకు మళ్లించి స్వాహా చేయడంతో 2014 అక్టోబర్ 5న ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని ఎన్పీఏగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఆ తర్వాత 13 బ్యాంకులు ట్రాన్స్ట్రాయ్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించాయి. చదవండి: (పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక జేవీలోని విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ సంస్థలు పత్తా లేకుండా పోయాయి. కేవలం కాంట్రాక్టు దక్కించుకోవడానికి మాత్రమే విదేశీ సంస్థలను కాగితాలపై చూపిన ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2015 మార్చి 12న తొలి సారిగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విదేశీ సంస్థలు పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించింది. దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, దాన్ని తప్పించాలని సూచించినా చంద్రబాబు వినలేదు. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి దోపిడీ.. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని గత సర్కారుకు కేంద్రం పలుదఫాలు సూచించింది. అయితే పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ–బావర్(జేవీ), జెట్ గ్రౌటింగ్ పనులను కెల్లర్, మట్టి తవ్వకం పనులను త్రివేణి, కాంక్రీట్ పనులను పూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు అప్పగించి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. దీన్నేమంటారు బాబూ..? డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తున్న సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించేలా 2015 అక్టోబర్ 10న కేబినెట్లో చంద్రబాబు తీర్మానం చేయించారు. ఈ మేరకు ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, పోలవరం ఈఎన్సీల పేరు మీద బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను గత సర్కార్ తెరిపించింది. బిల్లులు చెల్లించేటప్పుడు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. పోలవరం ఈఎన్సీ సూచనల ప్రకారం వాటిని ఆయా సంస్థలకు బ్యాంకు విడుదల చేస్తుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు వస్తాయని నాటి సీఎం చంద్రబాబు చెప్పడంతో నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ సంస్థకు రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యాంకులను రాయపాటి దోచేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ఎస్క్రో అకౌంట్ తెరిచిన కొద్ది రోజులకే దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ 2018 అక్టోబర్ 10న ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటాయని, కమీషన్లు రావని పసిగట్టిన గత సర్కారు పెద్దలు నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లింపులు జరపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను చెల్లించగా కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించడం ద్వారా కేబినెట్ తీర్మానాన్ని ఉల్లంఘించారు. ఇందులో సింహభాగం చంద్రబాబు జేబులోకి చేరినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాదా సహకారం? ►నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నేలా బ్యాంకుల నుంచి రూ.7,926.01 కోట్లను రాయపాటి లూటీ చేయడంలో ప్రధాన సూత్రధారి ఎవరు? దివాళా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ని పోలవరం కాంట్రాక్టు నుంచి తొలగించకుండా కొనసాగించడం ద్వారా ఈ లూటీకి చంద్రబాబు సహకరించలేదా? ►బ్యాంక్ ఆఫ్ బరోడా 2014లోనే ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్ధక ఆస్థి (ఎన్పీఏ)గా ప్రకటించినందున నిబంధనల ప్రకారం ఆ సంస్థకు మళ్లీ రుణం ఇవ్వకూడదు. కానీ ట్రాన్స్ట్రాయ్, జలవనరుల శాఖలతో అదే బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరిపించిన చంద్రబాబు దాన్ని హామీగా చూపి 2017లో కొత్తగా రూ.300 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యం బ్యాంకులను లూటీ చేయడం కాదా? -
'దొంగలు..' బాబో!
ఇనుము, ఇసుక లాంటి భారీ మెటీరియల్‌ను తరలించాలంటే పెద్ద వాహనాలు తప్పనిసరి. లారీ, ట్రక్కు లేకపోతే ట్రాక్టర్ వంటి వాహనాల్లోనే వాటిని తరలిస్తారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి టన్నుల కొద్దీ ఉక్కును ద్విచక్ర వాహనాలపై తరలించారంటే అది దోపిడీల్లో నేర్పరులకే సాధ్యం. అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికే సాధ్యమైంది. స్కూటీలో పోలవరం స్టీల్...!! స్టీల్, ఇసుక లాంటి భారీ మెటీరియల్ తరలించాలంటే ఎక్కడైనా డీసీఎం, లారీ లాంటి పెద్ద వాహనాలు తప్పనిసరి. ఓ ఇల్లు కట్టాలన్నా నిర్మాణానికి వాడే బరువైన ఇనుము, ఇతర మెటీరియల్‌ను పెద్ద వాహనంలోనే తరలిస్తారు. పోనీ కనీసం ట్రాక్టరైనా వాడతారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం ద్విచక్ర వాహనాలపై టన్నుల కొద్దీ ఉక్కు తరలించారంటే నమ్మాలి మరి! ఇవే కాదు.. విచిత్రంగా ఇక్కడ ఆటోలు, కార్లలో వందల టన్నుల స్టీల్ తరలించినట్లు చూపించారు! సిమెంట్, ఇసుక, స్టీల్ తరలించడంలో రాయపాటి స్టైలే వేరు మరి..!! అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికి మాత్రమే సాధ్యమైంది. సీబీఐ ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. చంద్రబాబుకు మరో సన్నిహితుడైన సుజనా చౌదరి బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టడంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులను బురిడీ కొట్టించడంలో వీరిద్దరూ ఆరితేరినట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. తిరుచానూరు అమ్మవారికి 8 కిలోల బంగారం, వజ్రాలతో నేసిన చీరను సమర్పిస్తున్న రాయపాటి, చెరుకూరి శ్రీధర్(ఫైల్) ఫోరెన్సిక్ ఆడిట్లో... పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల కాంట్రాక్టు పనుల పేరుతో 14 జాతీయ బ్యాంకుల నుంచి రూ.7,153.62 కోట్ల రుణం తీసుకున్న రాయపాటి తన సంస్థ ‘ట్రాన్స్ట్రాయ్’లో పనిచేస్తున్న వారి పేర్లతో ఏకంగా తొమ్మిది కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ కొనుగోళ్లతో రూ.6,202.82 కోట్లను మింగేశారు. ఇందులో రూ.350.49 కోట్లను రాయపాటి తన భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్ వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా మళ్లించి స్వాహా చేయడం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమైందని సీబీఐ తేల్చింది. ట్రాన్స్ట్రాయ్ తరఫున రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్, లీలాకుమారి రుణం తీసుకుని చెల్లించకుండా మోసగించడంపై కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వీరభద్రారెడ్డి ఈనెల 15న ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్ ఇళ్లు, కార్యాలయాలపై ఈనెల 18న సోదాలు నిర్వహించింది. ఎఫ్ఐఆర్లో రాయపాటి అక్రమాలను సీబీఐ బట్టబయలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో ప్రధానాంశాలు ఇవీ.. ప్రణాళికతో బ్యాంకుల దోపిడీ.. రాయపాటి 2001లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్(టీఐఎల్) జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కాంట్రాక్టు పనులను చేపడుతోంది. 2013లో పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణాన్ని ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ట్రాన్స్ట్రాయ్కు రూ.9394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో రూ.7153.62 కోట్ల రుణాన్ని రాయపాటి తీసుకున్నారు. రాయపాటి తన సంస్థలో పనిచేసే వారి పేర్లతో తొమ్మిది నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి నుంచి ఇనుము, సిమెంటు, కంకర, యంత్రాలు, వాహనాలు, పరికరాలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి రూ.7153.62 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం నుంచి చెల్లించేశారు. ఆ తర్వాత ఆ తొమ్మిది సంస్థల నుంచి రూ.6,202.82 కోట్లను ట్రాన్స్ట్రాయ్ ఖాతాలోకి మళ్లించి స్వాహా చేశారు. నకిలీ కొనుగోళ్లు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో పనిచేసే సుధాకర్‌బాబు పేరుతో పద్మావతి ఎంటర్ప్రైజెస్, మాజీ డైరెక్టర్ సాంబశివరావు మలినేని పేరుతో యూనిక్ ఇంజనీర్స్, వేములపల్లి హరీష్‌బాబు పేరుతో బాలాజీ ఎంటర్‌ప్రైజస్, కొరివి శివకుమార్ పేరుతో రుత్విక్ అసోసియేట్స్‌ను ఏర్పాటు చేయించిన రాయపాటి ఆ సంస్థల ఖాతాల్లోకి రూ.686.55 కోట్లను కనీసం జమ చేయకుండానే అంతే విలువైన వస్తువులను ఆ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపి మింగేశారు. ఇదిగో ఆ చిట్టా.. ► పద్మావతి ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.2,172.75 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు రాయపాటి చూపించారు. కానీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ టిన్ నెంబర్ 36200282035 పరిశీలిస్తే ఆ టిన్ నెంబర్‌తో ఎలాంటి సంస్థ ఏర్పాటు కాలేదని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ► బాలాజీ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.1,865.47 కోట్ల వస్తువులను ట్రాన్స్ట్రాయ్ కొనుగోలు చేసినట్లు చూపింది. కానీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ సంస్థ టిన్ నెంబర్‌తో ఈ కొనుగోళ్లు జరిపినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో స్పష్టమైంది. ► రుత్విక్ అసోసియేట్స్ నుంచి రూ.1925.86 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ అలాంటి లావాదేవీలు జరగలేదని ట్రాన్స్ట్రాయ్ రికార్డుల్లో వెల్లడైంది. దీన్ని బట్టి అవన్నీ బోగస్ లావాదేవీలన్నది స్పష్టమవుతోంది. ► యూనిక్ ఇంజనీర్స్ నుంచి సంస్థ యజమాని ఎం.సాంబశివరావు పాన్ నెంబర్ ఏఎఫ్కేపీఎం1706ఎల్‌నే టిన్ నెంబర్‌గా చూపించి రూ.672.12 కోట్ల విలువైన వస్తువులు కొన్నట్లు చూపారు. ఈ సంస్థ నుంచి కొనుగోలు చేసిన సరుకును తరలించడానికి వినియోగించిన వాహనాల నెంబర్లను పరిశీలిస్తే అందులో అధిక శాతం ద్విచక్ర వాహనాలుగా తేలింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో రూ.1,527.10 కోట్లు స్వాహా.. బోగస్ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండానే చేసినట్లు చూపిన ఇనుము, సిమెంటు, కంకర, వాహనాలు లాంటి వాటిలో రూ.1,753.82 కోట్ల విలువైన సరుకు నిల్వ ఉన్నట్లు ట్రాన్స్ట్రాయ్ చూపించింది. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టు వద్దే రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రి నిల్వ చేసినట్లు చూపారు. ఇంత భారీ ఎత్తున ఒక ప్రాజెక్టు వద్ద సరుకును ఎలా నిల్వ చేస్తారని సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. పోలవరంలో పనులు సబ్ కాంట్రాక్టర్లే చేశారు. ట్రాన్స్ట్రాయ్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ట్రాన్స్ట్రాయ్ రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రిని పోలవరం పనుల కోసం కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు చూపడమంటే ఆమేరకు దోపిడీ చేసినట్లు స్పష్టమవుతోంది. దొంగ లెక్కలతో రూ.907.10 కోట్లు లూటీ.. ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆదాయ, వ్యయాలపై బ్యాలెన్స్ షీట్‌ను దొంగ లెక్కలతో భారీగా పెంచేసింది. వస్తువులు కొనకుండానే అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.907.10 కోట్లను రాయపాటి లూటీ చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ట్రాన్స్ట్రాయ్ 24 ఎక్సవేటర్లను రూ.34.06 కోట్లకు కొన్నట్లు చూపింది. కానీ 8 ఎక్సవేటర్లను వోల్వో ఇండియా నుంచి కొనుగోలు చేసింది. మిగతా 16 కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు మింగేసింది. మరో 8 ఎక్సవేటర్లను రూ.14.67 కోట్లకు కొనుగోలు చేసినట్లు చూపింది. ఇందులో ఒకటి టాటా హిటాచీ, మూడు ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసినట్లు చూపింది. మిగతా నాలుగు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు కాజేసింది. పది టిప్పర్లను టాటా సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు ట్రాన్స్ట్రాయ్ చూపింది. నిజానికి ఐదు వాహనాలను మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన ఐదు వాహనాలకు ఇవే ఛాసిస్ (లారీ బాడీ నెంబర్) నంబర్లు చూపించి నిధులను మింగేసింది. వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయించకపోవడం గమనార్హం. నకిలీ వాహనాలు రయ్.. రయ్! ► యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థ నుంచి 25.50 టన్నుల 10 ఎంఎం ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి ఏపీ 12వీ 5408 నెంబరు బజాజ్ ఆటోలో పోలవరం పనులకు తరలించినట్లు చూపించారు. ► పద్మావతి ఎంటర్ప్రైజెస్ నుంచి 16.60 మెట్రిక్ టన్నుల 10 ఎంఎ ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి కేఏ 03 6894 నంబర్ కలిగిన టీవీఎస్ స్కూటీలో తరలించినట్లు చూపారు. ఇంత ఇనుము ఓ చిన్న స్కూటీపై తరలించగలగడం ఎవరికైనా అసాధ్యమే కానీ ఘనాపాటి రాయపాటికి మాత్రం కాదు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.450 కోట్ల షేర్లు ఎవరైనా కొనగలరా? ట్రాన్స్‌ట్రాయ్‌లో రాయపాటి భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌లు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 2012 – 2014 మధ్య రూ.450 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ద్విచక్రవాహనాలపై అనేక మెట్రిక్ టన్నుల స్టీల్ తరలించినట్లు చూపిన నకిలీ బిల్లులు -
9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇక విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.7వేల రూపాయల కోట్ల స్కాంకు తెరలేపిన రాయపాటి కంపెనీ.. తన వద్ద పనిచేసే సిబ్బంది పేర్లపై నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఇక నిధులు దారి మళ్లించేందుకు ఈ కంపెనీలకు డైరెక్టర్లను సైతం నియమించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. (చదవండి: ‘అదే రాయపాటి సాంబశివరావుకు గౌరవం’) పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్, రుత్విక్ అసోసియేట్ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి 7వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డాడు. 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంక్‌తోపాటు మరో 9 బ్యాంక్‌ల నుంచి.. 9వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
రాయపాటికి షాకిచ్చిన సెంట్రల్ బ్యాంక్
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. సుమారు రూ. 452.41 కోట్లు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడటంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ పత్రికల్లో వేలం నోటీసులను జారీ చేసింది. రుణం కోసం తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. (‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ) ఇక 2017 జనవరి 9 నాటికి సెంట్రల్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 51లో 640 చదరపు గజాల స్ధలాన్ని వేలం వేస్తున్నారు. మరోవైపు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్‌కు సంబంధించి సుమారు రూ. 300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులకు ట్రాన్స్ట్రాయ్ రూ. 3,694 కోట్ల మేర బకాయి పడింది. (వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) -
మరోసారి చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి
-
ట్రాన్స్ట్రాయ్.. డబ్బులేమయ్యాయ్?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో సబ్ కాంట్రాక్టు కింద డయాఫ్రమ్ వాల్ పనులు చేసిన బావర్.. జెట్ గ్రౌటింగ్ చేసిన కెల్లర్ సంస్థలకు బకాయిపడిన బిల్లులను చెల్లించక పోవడంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణకు రంగం సిద్ధం చేసింది. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించేలా కేబినెట్ తీర్మానం చేసిందని, అయితే దాన్ని తుంగలో తొక్కడం వల్లే తమ దేశానికి చెందిన బావర్, కెల్లర్ సంస్థలకు రావాల్సిన బిల్లులు చేరలేదని పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం), డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్)కు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. బావర్.. కెల్లర్‌లకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది. ట్రాన్స్ట్రాయ్ వద్ద ఆ రెండు సంస్థలు సబ్ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడినందున వాటితో తమకు సంబంధం లేదని పీఎంవోకూ నివేదించింది. 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని డీఆర్ఐని పీఎంవో ఆదేశించింది. డీఆర్ఐ రంగంలోకి దిగితే చంద్రబాబు కమీషన్ల బాగోతం వెలుగు చూస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ ముసుగులో కమీషన్ల దందా పోలవరం హెడ్ వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–యూఈఎస్(జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జేవీలో విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ వాటా 87 శాతం. అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాయపాటి భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. కానీ.. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను శరవేగంగా పూర్తి చేయడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సూచించింది. అదే జరిగితే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయమని, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపడితే కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా మోకాలడ్డారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారు. కమీషన్ల కోసం కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సబ్ కాంట్రాక్టు కింద పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని 2015 అక్టోబర్ 10న కేబినెట్లో అప్పటి సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు. ఆ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ట్రాన్స్ట్రాయ్–సబ్ కాంట్రాక్టు సంస్థలు, పోలవరం ఎస్ఈల పేరు మీదుగా ఎస్క్రో ఖాతా తెరిచారు. ఆ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని చూపి.. చంద్రబాబు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.300 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇప్పించారు. కానీ.. ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లు చెల్లిస్తే.. ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. మిగతా రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించారు. ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లిస్తే రుణం కింద బ్యాంక్ ఆఫ్ బరోడా మినహాయించుకుంటుందని.. కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కి నేరుగా బిల్లులు చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. బకాయిల చెల్లింపుపై దాటవేత డయా ఫ్రమ్ వాల్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది) పనులను రూ.422 కోట్లతో చేపట్టడానికి బావర్–ఎల్ అండ్ టీ సంస్థ, రూ.125.91 కోట్లతో జెట్ గ్రౌటింగ్ (కాఫర్ డ్యామ్‌ల పునాది) పనులు చేయడానికి కెల్లర్ సంస్థలు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డయా ఫ్రమ్ వాల్ పనులకు మాత్రమే ఎస్క్రో ఖాతా ద్వారా రూ.95 కోట్లను సర్కార్ చెల్లించింది. మరో రూ.237.09 కోట్ల బిల్లులు నేరుగా చెల్లించారు. 2018 నాటికే పనులు పూర్తయినా రూ.89.91 కోట్ల బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ చెల్లించలేదు. జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్ సంస్థకూ రూ.44 కోట్లు బకాయిపడ్డారు. 2018 నుంచి 2019 మే వరకు చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహించిన వర్చువల్ రివ్యూల్లో ట్రాన్స్ట్రాయ్ నుంచి ఆ బిల్లులు ఇప్పించాలని ఆ రెండు సంస్థల ప్రతినిధులు కోరినా ఫలితం లేకపోయింది. -
రాయపాటిపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల అనంతరం రాయపాటిపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చారు. రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్‌టాయ్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టారు. చదవండి : రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు -
టీడీపీ నేతల అవినీతి కేంద్రంగా పోలవరం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో అవినీతి సుడిగుండంలో ఇరుక్కుపోయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కాకుండా అందినకాడికి దోచుకోవాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తోంది, కానీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే చేపట్టడంతోనే అవినీతికి బీజం పడింది. చంద్రబాబు తన అనుయాయులకు, తెలుగుదేశం నాయకులకు ప్రాజెక్టు పనులను అప్పగించి అవినీతికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రాజమహేంద్రవరం ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాజెక్టు పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించింది. వేగంగా పూర్తి చేసేందుకే రివర్స్ టెండరింగ్.. పోలవరం ప్రాజెక్టు ద్వారా డబ్బు దండుకోవాలనే తప్ప.. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఈ ప్రాజెక్టు పనులను ఇకపై వేగంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు ఆనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు తలపెట్టారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ కేవలం తమ ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలోనే చూస్తూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. దీంతో ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదు. 2018 ఖరీఫ్ నాటికే రైతులకు నీళ్లిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత డెడ్ లైన్‌ను మారుస్తూ వెళ్లారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను చేపట్టింది. అవినీతి బైటపడుతుందని టీడీపీ భయం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును తొలుత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే శరవేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే చంద్రబాబు హడావుడి తప్ప ప్రాజెక్టు పనుల్లో సరైన పురోగతి కనిపించలేదు. పోలవరానికి సంబంధించిన ప్రధాన పనులన్నీ ఇప్పటికే పెండింగ్ లోనే ఉండటం ఖర్చు మాత్రం వేలకోట్లలో అవుతుండటంతో తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిజాలను తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్ టెండరింగ్‌కు వెళుతోంది. ఈ పద్ధతిలో ఎవరు అతి తక్కువ ధరలకు ప్రాజెక్టును నిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే తాము చేసిన తప్పు, ముఖ్యంగా పోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బైటకు వస్తుందోనన్న ఉద్ధేశ్యంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూ టీడీపీ నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ అస్మదీయులకే పనులు... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆర్ధికంగా దివాళా తీయటంతో తన అనుయాయులు, బినామీలను చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి జొప్పించారు. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తనవారికి కట్టబెట్టారు. పార్టీలో కీలక స్థానంలో ఉండటంతోపాటు టీడీపీ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు.. తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు వంద కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఒకపక్క ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి బాగా లేదని చెప్పిన యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం వెంటనే క్లియర్ చేసేవారు. రాజు తచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు టీడీపీ నేత బిల్లు పోవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా చెల్లించటంలో యనమల ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో ఆరి తేరిపోయారు. అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీడీపీ ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఇదే కాలువ ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత సుధాకరరావుకు అప్పగించారు. దీని విలువ 179 కోట్లు. ఇక చంద్రబాబు బినామీగా పేరు గాంచిన ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్ వర్క్స్ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్లు. సూర్య కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. అవకతవకలు నిజమేనని తేల్చిన కమిటీ.. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌లో 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ. 1331 కోట్ల భారం పడింది. ప్రధాన కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ లపై వడ్డీ 84.43 కోట్లు తిరిగి వసూలు చేయాల్సి ఉంది. ఇంప్రెస్ట్ కింద ప్రధాన కాంట్రాక్టర్ కు చెల్లించిన రూ.141.22 కోట్లు రికవరీ చేసుకోవాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సులు 787.20 కోట్లు తిరిగి రాబట్టాలి. మొత్తంగా రూ.2400 కోట్లు అదనంగా చెల్లించారు. -
ఖజానా నుంచే కాజేద్దాం!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో(జలాశయం) సబ్ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ప్రైవేట్ వ్యవహారమని ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించడం ద్వారా తన పార్టీ నేత రాయపాటి సాంబశివరావును సంతృప్తి పరచాలన్న ఎత్తుగడను ఉన్నత స్థాయి కమిటీ చిత్తు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిందులు తొక్కుతున్నారు. ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయడం ద్వారా అదనపు బిల్లులు చెల్లించి, వాటిని సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలకు సర్దుబాటు చేసేలా కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే మంగళవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ట్రాన్స్ట్రాయ్ వ్యవహారాన్ని టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేయాలన్నదే చంద్రబాబు ప్రణాళిక. అధికారాంతమున ఖజానాను దోచేసేందుకు సాగుతున్న ఈ యత్నాలను అధికార వర్గాలు తప్పు పడుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలు రూ.418 కోట్లు రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,385.91 కోట్లకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఒప్పందం అమల్లో ఉండగా అంచనా వ్యయాన్ని పెంచడం నిబంధనలకు విరుద్ధం. ఆ తర్వాత ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి మట్టి పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్), పునాది(డయాఫ్రమ్ వాల్) పనులను ఎల్అండ్టీ–బావర్.. కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌటింగ్) పనులను కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. 2016 అక్టోబర్ 7 నుంచి 2018 జనవరి వరకూ చేసిన పనులకు గాను ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించి.. ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ, పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. సబ్ కాంట్రాక్టర్లతోపాటు కిరాణా సరుకులు సరఫరా చేసిన వ్యాపారులకు కూడా ట్రాన్స్ట్రాయ్ భారీ ఎత్తున బకాయిపడింది. ఈ బకాయిలు రూ.418 కోట్లకుపైగా పేరుకుపోయినట్లు పోలవరం హెడ్ వర్క్స్‌ను పర్యవేక్షించే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో 2018 జనవరి నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. దాంతో ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి.. పనులన్నీ నవయుగ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారు. గేట్ల తయారీ పనులను బీకెమ్‌కు నామినేషన్ విధానంలో కట్టబెట్టారు. డీఆర్ఐ దర్యాప్తు నుంచి బయటపడేందుకే.. పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనులకు గాను తమకు బిల్లులు చెల్లించడం లేదని విదేశీ సంస్థలు బావర్, కెల్లర్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని డీఆర్ఐకి జనవరిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలవరం ప్రాజెక్టు అధికారులను డీఆర్ఐ ఆరా తీసింది. డీఆర్ఐ నేరుగా రంగంలోకి దిగితే తాను వసూలు చేసుకున్న కమీషన్ల బాగోతం బయటపడుతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. డీఆర్ఐ విచారణ చేపట్టేలోగా బకాయిల పంచాయతీని తేల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న పోలవరం వర్చువల్ రివ్యూలో ట్రాన్స్ట్రాయ్.. సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను ఆదేశించారు. దాంతో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా.. సీఈ శ్రీధర్ కన్వీనర్‌గా, రిటైర్డు సీఈ రోశయ్య, పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఫిబ్రవరి 18న ఏర్పాటు చేస్తూ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, అది ప్రైవేట్ పంచాయతీ అని ఉన్నతస్థాయి కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక నేపథ్యంలో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రాయపాటిని సంతృప్తిపరచేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అనుమతి ఇస్తే మంగళవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయాలని, జీవో 22, జీవో 63ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని గతంలో కేబినెట్లో తీర్మానం చేశామని.. ఆ తీర్మానం ఆధారంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సూచనలను ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు తోసిపుచ్చినట్లు సమాచారం. సీఈసీకి పంపిన కేబినెట్ ఏజెండాలో ఈ అంశం లేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. మంగళవారం నాటికి ఎలాగైనా ప్రతిపాదనలు తెప్పించుకుని.. దాన్ని కేబినెట్లో టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేసి, ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు మార్గం సుగమం చేయడం ద్వారా రాయపాటిని సంతృప్తి పర్చడానికి చంద్రబాబు చురుగ్గా పావులు కదుపుతున్నారు. -
అక్రమ చెల్లింపులకు హైలెవల్ కుట్ర
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో మరో దోపిడీకి సీఎం చంద్రబాబు తెరతీశారు. అక్టోబర్ 7, 2016 నుంచి జనవరి, 2018 వరకూ చేసిన పనులకు అదనంగా రూ.213 కోట్లు ఇవ్వాలన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్ట్రాయ్’ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని ఉన్నత స్థాయి కమిటీపై ఒత్తిడి తెస్తున్నారు. పెంచిన అంచనా వ్యయం మేరకు ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని.. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించడానికి సంబంధించిన ప్రతిపాదనను మంగళవారం నిర్వహించే కేబినెట్ సమావేశానికి పంపాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ.4054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు ట్రాన్స్‌ట్రాయ్‌తో అక్టోబర్ 7, 2016న జలవనరుల శాఖ అనుబంధ ఒప్పందం (సప్లిమెంటరీ అగ్రిమెంట్) చేసుకుంది. అక్టోబర్ 7, 2016 నుంచి ఆ సంస్థను 60సీ నిబంధన కింద తొలగించే వరకూ.. చేసిన పనులకు రూ.2,362.22 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. అంటే 2015–16 ధరల ఆధారంగా పెంచేసిన అంచనా వ్యయం మేరకే బిల్లులు చెల్లించినట్లుగా స్పష్టమవుతోంది. సబ్ కాంట్రాక్టర్లకు రూ.418 కోట్ల బకాయిలు.. అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి.. మట్టి పనులు త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పునాది(డయా ఫ్రమ్ వాల్)పనులు ఎల్అండ్టీ–బావర్, కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్) పనులు కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులు బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లులు చెల్లించేటపుడు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. అయితే పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. ఇదే అంశంపై సబ్ కాంట్రాక్టు సంస్థలు పలు సందర్భాల్లో ఆందోళన చేశాయి.. ఈ బకాయిలు సుమారు రూ.418 కోట్లకుపైగా ఉంటాయన్నది అంచనా. బకాయిలను చెల్లించకపోవడంతో జనవరి, 2018 నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. దాంతో.. ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి గేట్ల పనులు బీకెమ్‌కు, మిగతా పనులన్నీ నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించేయడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్ బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు ఫిర్యాదు చేసింది. డీఆర్ఐ రంగంలోకి దిగితే తన కమీషన్ల బాగోతం బయటపడుతుందని ఆందోళనకు గురైన చంద్రబాబు, ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి గత నెల 13న ఈఎన్సీ (ఇంజనీర్–ఇన్–చీఫ్) అధ్యక్షతన నలుగురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి.. పోలవరం హెడ్ వర్క్స్‌లో తాము చేసిన పనులకు జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని ఇటీవల ట్రాన్స్ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సెప్టెంబరు 7, 2016న పెంచిన అంచనా వ్యయం ప్రకారం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. రూ.213 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని కోరింది. ఈ ప్రతిపాదనను ఉన్నత స్థాయి కమిటీకి పంపిన సీఎం చంద్రబాబు.. దానిపై ఆమోదముద్ర వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే చెల్లించామని.. అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. మంగళవారం నిర్వహించే కేబినెట్లో అదనపు బిల్లులు చెల్లించడానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అదనంగా చెల్లించే బిల్లులతోనే సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటిలో 50 శాతం చెల్లించి వారి మధ్య బకాయిల పంచాయతీని తేల్చేయాలని భావిస్తున్నారు. -
ముక్కలు ముక్కలుగా చీలిపోయిన పోలవరం రోడ్లు
-
పోలవరం ప్రాజెక్టు రోడ్డుకు బీటలు.. అందుకే
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో నాణ్యతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తవ్విన మట్టి నిల్వ చేసే డంపింగ్ యార్డు కోసం మడుగులను విధ్వంసం చేయడం, కమీషన్ల కోసం నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోలవరం పనుల్లో నాణ్యత లోపాలను కాగ్ ఎత్తిచూపినా, సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు. పోలవరం హెడ్ వర్క్ (జలాశయం) పనులను రూ. 4,054 కోట్లకు దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వాటిని చేసే సత్తా లేదని, టెండర్ల ద్వారా సమర్థవంతమైన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలంటూ 2014 డిసెంబర్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, రిటైర్డు సీఎస్ దినేష్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సత్తా లేని కాంట్రాక్టర్‌కే వంతపాడింది. జలవనరుల విధ్వంసం పాపం సర్కార్‌దే.. పోలవరం హెడ్‌వర్క్స్‌లో మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు నామినేషన్‌పై ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. తవ్విన మట్టిని తరలించడానికి రహదారి, మట్టిని నిల్వ చేయడానికి స్థలాన్ని కాంట్రాక్టరే సేకరించుకోవాలి. దీనికి విరుద్ధంగా డంపింగ్ యార్డ్‌కు(మట్టిని నిల్వ చేయడానికి) అవసరమైన భూమిని రూ.32.66 కోట్లు వెచ్చించి సర్కారే కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు సమకూర్చింది. దీన్ని కాగ్(కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో తప్పుబట్టింది. డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన భూమిలో పెద్ద మడుగులు ఉండేవి. సమీపంలోని కొండల్లో కురిసిన వర్షపు నీరు ఈ మడుగుల ద్వారానే గోదావరిలో కలిసేది. జలవనరులను పరిరక్షించాల్సిన సర్కారే వాటిని విధ్వంసం చేయడం గమనార్హం. తవ్విన మట్టిని తరలించడానికి సర్కార్ నిధులతోనే కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. వంద టన్నులు సామర్థ్యంతో కూడిన వాహనాలు తిరిగే ఈ రహదారిని అత్యంత నాసిరకంగా నిర్మించారు. హెడ్ వర్క్స్‌లో తవ్విన మట్టిని, సమీపంలోని రహదారికి ఇరువైపులా సర్కార్ సేకరించిన భూమిలో నిల్వ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకూ హెడ్ వర్క్స్‌లో తవ్విన 8.93 కోట్ల టన్నుల మట్టిని ఇక్కడే నిల్వ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండల్లో నుంచి వర్షపు నీరు ఈ డంపింగ్ యార్డ్‌లోకే చేరింది. దీంతో డంపింగ్ యార్డ్‌లోని మట్టి రోజురోజుకు ఎగదన్నుతూ వచ్చింది. దీని ప్రభావం వల్లే నాసిరకంగా నిర్మించిన రహదారి నెర్రెలు బారి.. చీలిపోయి ధ్వంసమైంది. డంపింగ్ యార్డ్, రహదారి నిర్మాణంలో రాష్ట్ర సర్కార్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇదంతా జరిగేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాసిరకం పనులతో భారీ మూల్యం తప్పదు.. రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు, డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యథాప్రకారం అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని, వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం సహజమని, దీని వల్లే రహదారి నెర్రెలు బారిందని అటు సీఎం చంద్రబాబు, ఇటు పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. అయితే డంపింగ్ యార్డ్ కోసం చిన్న నీటి వనరులను ధ్వంసం చేయడం, పనులు నాసిరకంగా ఉండటం వల్లే రహదారి ముక్కముక్కలైందని ఎన్జీఆర్ఐ(నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో నీటిని నిల్వ చేసే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులను నాసిరకంగా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పనులను సీఎస్ఎంఆర్ఎస్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం, ఎన్జీఆర్ఐ ద్వారా తనిఖీలు చేయించి నాణ్యతను నిర్దారించుకున్న తర్వాతే బిల్లులు చెల్లించాలని గట్టిగా సూచిస్తున్నాయి. -
పోలవరం పనులు బహిష్కరించిన ట్రాన్స్ట్రాయ్ సిబ్బంది
-
ట్రాన్స్ట్రాయ్ యంత్రాలు సీజ్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కోట్లాది రూపాయల రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా మొండికేయడంతోపాటు నోటీసులు ఇచ్చినా స్పందించని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్ట్రాయ్పై దేనా బ్యాంకు అధికారులు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. నిర్మాణ సంస్థకు చెందిన మూడు యంత్రాలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ‘ముఖ్య’నేత ఆదేశాలతో ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) అధికారులు రంగంలోకి దిగి, ట్రాన్స్ట్రాయ్పై చర్యలు తీసుకోకుండా బ్యాంకు అధికారులను అడ్డుకోవడం గమనార్హం. ట్రాన్స్‌ట్రాయ్‌లో ‘ముఖ్య’నేతకు అనధికారికంగా భాగస్వామ్యం ఉండటం వల్లే ఆ సంస్థపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కోర్టు అనుమతితోనే చర్యలు హైదరాబాద్‌లోని దేనా బ్యాంకులో ట్రాన్స్ట్రాయ్ తన ఆస్తులను తనఖా(మార్ట్గేజ్) పెట్టి 2015లో రూ.87 కోట్ల రుణం తీసుకుంది. అసలు, వడ్డీతో కలిపి గత నవంబర్ నాటికి అది రూ.120 కోట్లకు చేరింది. రుణం చెల్లించాలని ట్రాన్స్ట్రాయ్కు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించామని దేనా బ్యాంకు అధికారులు తెలిపారు. కోర్టు అనుమతితో ట్రాన్స్ట్రాయ్ వాహనాలు, యంత్రాలను సీజ్ చేసేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు తవ్వకం యంత్రాలను సీజ్ చేశారు. ఆ మేరకు యంత్రాలపై నోటీసులు అంటించారు. ట్రాన్స్ట్రాయ్ సంస్థకు చెందిన జీఎం ప్రకాశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. 64 యంత్రాలు, వాహనాలను సీజ్ చేసేందుకు అనుమతి ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. సెక్షన్ 14 సర్ప్లస్ యాక్ట్ ప్రకారం కోర్టు అనుమతితో ట్రాన్స్ట్రాయ్పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు షాకు
-
ట్రాన్స్ట్రాయ్కు దేనా బ్యాంక్ షాక్
సాక్షి, పోలవరం: దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు గట్టి షాకు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు సంస్థకు చెందిన వాహనాలను, యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ గతంలో తీసుకున్న రూ.87 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు దిగారు. వడ్డీతో సహా మొత్తం రూ. 120కోట్లు బకాయిపడడంతో శుక్రవారం పోలవరం వద్దనున్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు ప్రతినిధులు కోర్టు ఆదేశాలతోనే ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా గతంలో కూడా రుణాలను (రూ.725 కోట్లు)చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ట్రాయ్పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొనడం గమనార్హం. -
దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్
-
దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ తమ వద్ద రుణంగా తీసుకున్న రూ.725 కోట్లు తిరిగి చెల్లించడం లేదని కెనరా బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రాన్స్ట్రాయ్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొంది. అలాంటి సంస్థ తరఫున పూచీకత్తు(లెటర్ ఆఫ్ కంఫర్ట్) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆర్థికరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, జల వనరులశాఖల అభ్యంతరాలను బేఖా తరు చేస్తూ గత నెల 1న కేబినెట్లో ట్రాన్స్ట్రాయ్ తరఫున బ్యాంకర్లకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇచ్చేలా సీఎం చంద్రబాబు పట్టుబట్టి తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే. -
బాబుకు ఝలక్ ఇచ్చిన రాయపాటి
-
ఆగిపోయిన పోలవరం పనులు
-
ట్రాన్స్ ట్రాయ్ రోడ్డు కాంట్రాక్టు రద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణ రంగ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్హెచ్ఏఐ) షాక్ ఇచ్చింది. నిర్మాణం, నిర్వహణ, బదిలీ ప్రాతిపదికన కంపెనీకి 2012 ఏప్రిల్‌లో అప్పగించిన రూ.912 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేసింది. మధ్యప్రదేశ్‌లో 69వ జాతీయ రహదారిలో ఉన్న ఓబెదుల్లాగంజ్-బేతుల్ సెక్షన్లో 121.36 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లేన్ల రహదారిగా 2016 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 1.34% పనులే పూర్తి కావడంతో ఎన్‌హెచ్‌ఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. -
పోలవరం ప్రాజెక్ట్ టెండర్ ముగిసి నాలుగేళ్లు
-
ట్రాన్స్‌స్ట్రాయ్‌లో చైనా కంపెనీకి వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్స్‌స్ట్రాయ్‌లో చైనా ప్రభుత్వ రంగ సంస్థ చైనా న్యూ ఎరా గ్రూప్ కార్పొరేషన్ వాటా కొనుగోలు చేస్తోంది. అయితే ఎంత వాటా కొనుగోలు చేసేది వెల్లడించలేదు. వాటా కింద చేసే పెట్టుబడి ‘కొన్ని వందల మిలియన్ డాలర్లు’ అని ఇరు కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. -
పోలవరం టెండర్లకు లైన్ క్లియర్
-
పోలవరం టెండర్లకు లైన్ క్లియర్
హైదరాబాద్ : హైకోర్టులో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో దాఖలైన రిట్ పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ టెండర్లకు లైన్ క్లియరైంది. ట్రాన్స్ట్రాయ్ సంస్థకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం సోమా, మధుకాన్, మహాలక్ష్మీ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలో టెండర్ల విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.