కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి | Transstroy Scam: A Loan Default Of Rs 7926 Crore | Sakshi
Sakshi News home page

రూటు మార్చి లూటీ.. అంతా చంద్రబాబే!

Published Sun, Dec 27 2020 2:50 AM | Last Updated on Sun, Dec 27 2020 8:56 AM

Transstroy Scam: A Loan Default Of Rs 7926 Crore - Sakshi

సాక్షి, అమరావతి: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్రాన్స్‌ట్రాయ్‌ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించినప్పుడే గత సర్కారు ఆ సంస్థపై వేటు వేసి పోలవరం పనుల నుంచి తొలగిస్తే ఇంత భారీ కుంభకోణానికి అవకాశమే ఉండేది కాదని 14 బ్యాంకుల కన్సార్షియం, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కుంభకోణాన్ని చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం..  చంద్రబాబే పాల్పడిన స్కాంగా అభివర్ణిస్తున్నారు. ఎక్కడా లేని రీతిలో కేబినెట్‌ తీర్మానం ద్వారా పోలవరం పనుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌కి సిమెంట్, స్టీలు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేలా నాటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ రాయపాటి వాటిని కొనుగోలు చేయకుండానే నకిలీ బిల్లులతో రూ.1,527.10 కోట్ల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించి స్వాహా చేయడాన్ని బట్టి ఈ కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి అనేది  స్పష్టమవుతోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

ట్రాన్స్‌ట్రాయ్‌ వాటా 13 శాతమే..
పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్‌సీ– ఈసీ–యూఈఎస్‌ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ జేవీలో రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన జేఎస్‌సీ–ఈసీ–యూఈఎస్‌ వాటా 87% కాగా రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ వాటా కేవలం 13 శాతమే. జేఎస్‌సీ–ఈసీ–యూఈఎస్‌ సంస్థలో తన సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌ను డైరెక్టర్‌గా చేర్చి ఆ సంస్థకు కమీషన్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. చిన్న ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  సోనియా గాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన రాయపాటి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.

దివాలా తీసిన సంస్థకే దన్ను..
పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించిన ట్రాన్స్‌ట్రాయ్‌కి కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం బ్యాంకు గ్యారెంటీలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్, రుణం రూపంలో రూ.7,926.01 కోట్లు ఇచ్చేందుకు 2013లో అంగీకారం తెలిపాయి. ఆ మేరకు రుణాలిచ్చాయి. ఇందులో కొంత భాగాన్ని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’గా మళ్లించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న రుణాన్ని ఇతర సంస్థలకు మళ్లించి స్వాహా చేయడంతో 2014 అక్టోబర్‌ 5న ట్రాన్స్‌ట్రాయ్‌ రుణాన్ని ఎన్‌పీఏగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించింది. ఆ తర్వాత 13 బ్యాంకులు ట్రాన్స్‌ట్రాయ్‌ రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించాయి. చదవండి: (పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్‌ సంకల్పం)

పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక జేవీలోని విదేశీ సంస్థలైన జేఎస్‌సీ, యూఈఎస్‌ సంస్థలు పత్తా లేకుండా పోయాయి. కేవలం కాంట్రాక్టు దక్కించుకోవడానికి మాత్రమే విదేశీ సంస్థలను కాగితాలపై చూపిన ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2015 మార్చి 12న తొలి సారిగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విదేశీ సంస్థలు పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించింది. దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, దాన్ని తప్పించాలని సూచించినా చంద్రబాబు వినలేదు.

ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి దోపిడీ..
విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని గత సర్కారుకు కేంద్రం పలుదఫాలు సూచించింది. అయితే పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబర్‌ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ పనులను ఎల్‌ అండ్‌ టీ–బావర్‌(జేవీ), జెట్‌ గ్రౌటింగ్‌ పనులను కెల్లర్, మట్టి తవ్వకం పనులను త్రివేణి, కాంక్రీట్‌ పనులను పూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్‌ సంస్థలకు అప్పగించి, కమీషన్లు వసూలు చేసుకున్నారు.

దీన్నేమంటారు బాబూ..?
డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేస్తున్న సంస్థలకు ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లించేలా 2015 అక్టోబర్‌ 10న కేబినెట్‌లో చంద్రబాబు తీర్మానం చేయించారు. ఈ మేరకు ట్రాన్స్‌ట్రాయ్, సబ్‌ కాంట్రాక్టర్లు, పోలవరం ఈఎన్‌సీల పేరు మీద బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను గత సర్కార్‌ తెరిపించింది. బిల్లులు చెల్లించేటప్పుడు ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయాలి. పోలవరం ఈఎన్‌సీ సూచనల ప్రకారం వాటిని ఆయా సంస్థలకు బ్యాంకు విడుదల చేస్తుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు వస్తాయని నాటి సీఎం చంద్రబాబు  చెప్పడంతో నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ సంస్థకు రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యాంకులను రాయపాటి దోచేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. 

కేబినెట్‌ తీర్మానం తుంగలోకి..
ఎస్క్రో అకౌంట్‌ తెరిచిన కొద్ది రోజులకే దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ 2018 అక్టోబర్‌ 10న ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)ని ఆశ్రయించింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తే బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటాయని, కమీషన్లు రావని పసిగట్టిన గత సర్కారు పెద్దలు నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కే చెల్లింపులు జరపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను చెల్లించగా కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్‌ ద్వారా చెల్లించారు. రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కే చెల్లించడం ద్వారా కేబినెట్‌ తీర్మానాన్ని ఉల్లంఘించారు. ఇందులో సింహభాగం చంద్రబాబు జేబులోకి చేరినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కాదా సహకారం?
►నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నేలా బ్యాంకుల నుంచి రూ.7,926.01 కోట్లను రాయపాటి లూటీ చేయడంలో ప్రధాన సూత్రధారి ఎవరు? దివాళా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ని పోలవరం కాంట్రాక్టు నుంచి తొలగించకుండా కొనసాగించడం ద్వారా ఈ లూటీకి చంద్రబాబు సహకరించలేదా?
►బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2014లోనే ట్రాన్స్‌ట్రాయ్‌ రుణాన్ని నిరర్ధక ఆస్థి (ఎన్‌పీఏ)గా ప్రకటించినందున నిబంధనల ప్రకారం ఆ సంస్థకు మళ్లీ రుణం ఇవ్వకూడదు. కానీ ట్రాన్స్‌ట్రాయ్, జలవనరుల శాఖలతో అదే బ్యాంకులో ఎస్క్రో అకౌంట్‌ తెరిపించిన చంద్రబాబు దాన్ని హామీగా చూపి 2017లో కొత్తగా రూ.300 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యం బ్యాంకులను లూటీ చేయడం కాదా? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement