పోలవరం ప్రాజెక్టు రోడ్డుకు బీటలు.. అందుకే | Huge Cracks On Polavaram Project Road | Sakshi
Sakshi News home page

మడుగుల విధ్వంసంతోనే నెర్రెలు!

Published Thu, Nov 8 2018 8:58 AM | Last Updated on Thu, Nov 8 2018 5:52 PM

Huge Cracks On Polavaram Project Road - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్‌(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో నాణ్యతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తవ్విన మట్టి నిల్వ చేసే డంపింగ్‌ యార్డు కోసం మడుగులను విధ్వంసం చేయడం, కమీషన్ల కోసం నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోలవరం పనుల్లో నాణ్యత లోపాలను కాగ్‌ ఎత్తిచూపినా, సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు. పోలవరం హెడ్‌ వర్క్‌ (జలాశయం) పనులను రూ. 4,054 కోట్లకు దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి వాటిని చేసే సత్తా లేదని, టెండర్ల ద్వారా సమర్థవంతమైన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలంటూ 2014 డిసెంబర్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, రిటైర్డు సీఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రభుత్వానికి సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సత్తా లేని కాంట్రాక్టర్‌కే వంతపాడింది.

జలవనరుల విధ్వంసం పాపం సర్కార్‌దే..
పోలవరం హెడ్‌వర్క్స్‌లో మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌కు నామినేషన్‌పై ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. తవ్విన మట్టిని తరలించడానికి రహదారి, మట్టిని నిల్వ చేయడానికి స్థలాన్ని కాంట్రాక్టరే సేకరించుకోవాలి. దీనికి విరుద్ధంగా డంపింగ్‌ యార్డ్‌కు(మట్టిని నిల్వ చేయడానికి) అవసరమైన భూమిని రూ.32.66 కోట్లు వెచ్చించి సర్కారే కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు సమకూర్చింది. దీన్ని కాగ్‌(కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తన నివేదికలో తప్పుబట్టింది. డంపింగ్‌ యార్డ్‌ కోసం సేకరించిన భూమిలో పెద్ద మడుగులు ఉండేవి. సమీపంలోని కొండల్లో కురిసిన వర్షపు నీరు ఈ మడుగుల ద్వారానే గోదావరిలో కలిసేది. జలవనరులను పరిరక్షించాల్సిన సర్కారే వాటిని విధ్వంసం చేయడం గమనార్హం.

తవ్విన మట్టిని తరలించడానికి సర్కార్‌ నిధులతోనే కాంట్రాక్టర్‌ రోడ్డు వేశారు. వంద టన్నులు సామర్థ్యంతో కూడిన వాహనాలు తిరిగే ఈ రహదారిని అత్యంత నాసిరకంగా నిర్మించారు. హెడ్‌ వర్క్స్‌లో తవ్విన మట్టిని, సమీపంలోని రహదారికి ఇరువైపులా సర్కార్‌ సేకరించిన భూమిలో నిల్వ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకూ హెడ్‌ వర్క్స్‌లో తవ్విన 8.93 కోట్ల టన్నుల మట్టిని ఇక్కడే నిల్వ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండల్లో నుంచి వర్షపు నీరు ఈ డంపింగ్‌ యార్డ్‌లోకే చేరింది. దీంతో డంపింగ్‌ యార్డ్‌లోని మట్టి రోజురోజుకు ఎగదన్నుతూ వచ్చింది. దీని ప్రభావం వల్లే నాసిరకంగా నిర్మించిన రహదారి నెర్రెలు బారి.. చీలిపోయి ధ్వంసమైంది. డంపింగ్‌ యార్డ్, రహదారి నిర్మాణంలో రాష్ట్ర సర్కార్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇదంతా జరిగేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నాసిరకం పనులతో భారీ మూల్యం తప్పదు..
రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు, డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యథాప్రకారం అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని,  వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం సహజమని, దీని వల్లే రహదారి నెర్రెలు బారిందని అటు సీఎం చంద్రబాబు, ఇటు పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. అయితే డంపింగ్‌ యార్డ్‌ కోసం చిన్న నీటి వనరులను ధ్వంసం చేయడం, పనులు నాసిరకంగా ఉండటం వల్లే రహదారి ముక్కముక్కలైందని ఎన్‌జీఆర్‌ఐ(నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్‌ ఫర్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో నీటిని నిల్వ చేసే ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులను నాసిరకంగా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పనులను సీఎస్‌ఎంఆర్‌ఎస్, థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం, ఎన్‌జీఆర్‌ఐ ద్వారా తనిఖీలు చేయించి నాణ్యతను నిర్దారించుకున్న తర్వాతే బిల్లులు చెల్లించాలని గట్టిగా సూచిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement