సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో(జలాశయం) సబ్ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ప్రైవేట్ వ్యవహారమని ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్‌ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించడం ద్వారా తన పార్టీ నేత రాయపాటి సాంబశివరావును సంతృప్తి పరచాలన్న ఎత్తుగడను ఉన్నత స్థాయి కమిటీ చిత్తు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిందులు తొక్కుతున్నారు. ట్రాన్స్‌ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయడం ద్వారా అదనపు బిల్లులు చెల్లించి, వాటిని సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలకు సర్దుబాటు చేసేలా కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే మంగళవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ట్రాన్స్‌ట్రాయ్ వ్యవహారాన్ని టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేయాలన్నదే చంద్రబాబు ప్రణాళిక. అధికారాంతమున ఖజానాను దోచేసేందుకు సాగుతున్న ఈ యత్నాలను అధికార వర్గాలు తప్పు పడుతున్నాయి.
ట్రాన్స్‌ట్రాయ్ చెల్లించాల్సిన బకాయిలు రూ.418 కోట్లు
రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,385.91 కోట్లకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఒప్పందం అమల్లో ఉండగా అంచనా వ్యయాన్ని పెంచడం నిబంధనలకు విరుద్ధం. ఆ తర్వాత ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి మట్టి పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్), పునాది(డయాఫ్రమ్ వాల్) పనులను ఎల్‌అండ్‌టీ–బావర్.. కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌటింగ్) పనులను కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు.
2016 అక్టోబర్ 7 నుంచి 2018 జనవరి వరకూ చేసిన పనులకు గాను ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించి.. ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ, పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్‌ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. సబ్ కాంట్రాక్టర్లతోపాటు కిరాణా సరుకులు సరఫరా చేసిన వ్యాపారులకు కూడా ట్రాన్స్‌ట్రాయ్ భారీ ఎత్తున బకాయిపడింది. ఈ బకాయిలు రూ.418 కోట్లకుపైగా పేరుకుపోయినట్లు పోలవరం హెడ్ వర్క్స్‌ను పర్యవేక్షించే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో 2018 జనవరి నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్‌పై 60సీ నిబంధన కింద వేటు వేసి.. పనులన్నీ నవయుగ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారు. గేట్ల తయారీ పనులను బీకెమ్‌కు నామినేషన్ విధానంలో కట్టబెట్టారు.
డీఆర్‌ఐ దర్యాప్తు నుంచి బయటపడేందుకే..
పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనులకు గాను తమకు బిల్లులు చెల్లించడం లేదని విదేశీ సంస్థలు బావర్, కెల్లర్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని డీఆర్‌ఐకి జనవరిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలవరం ప్రాజెక్టు అధికారులను డీఆర్‌ఐ ఆరా తీసింది. డీఆర్‌ఐ నేరుగా రంగంలోకి దిగితే తాను వసూలు చేసుకున్న కమీషన్ల బాగోతం బయటపడుతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. డీఆర్‌ఐ విచారణ చేపట్టేలోగా బకాయిల పంచాయతీని తేల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న పోలవరం వర్చువల్ రివ్యూలో ట్రాన్స్‌ట్రాయ్.. సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను ఆదేశించారు. దాంతో ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా.. సీఈ శ్రీధర్ కన్వీనర్‌గా, రిటైర్డు సీఈ రోశయ్య, పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఫిబ్రవరి 18న ఏర్పాటు చేస్తూ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, అది ప్రైవేట్ పంచాయతీ అని ఉన్నతస్థాయి కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక నేపథ్యంలో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
రాయపాటిని సంతృప్తిపరచేందుకు..
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అనుమతి ఇస్తే మంగళవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్ చేసిన పనులకు తాజా ధరలను వర్తింపజేయాలని, జీవో 22, జీవో 63ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని గతంలో కేబినెట్‌లో తీర్మానం చేశామని.. ఆ తీర్మానం ఆధారంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సూచనలను ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు తోసిపుచ్చినట్లు సమాచారం. సీఈసీకి పంపిన కేబినెట్ ఏజెండాలో ఈ అంశం లేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. మంగళవారం నాటికి ఎలాగైనా ప్రతిపాదనలు తెప్పించుకుని.. దాన్ని కేబినెట్‌లో టేబుల్ ఐటెంగా చేపట్టి, ఆమోదముద్ర వేసి, ప్రభుత్వ ఖజానా నుంచే సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు మార్గం సుగమం చేయడం ద్వారా రాయపాటిని సంతృప్తి పర్చడానికి చంద్రబాబు చురుగ్గా పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment