సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. కనికట్టు చేసి బ్యాంకులను దోచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరిలనే మించిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కెనరా బ్యాంకు నేతృత్వంలోని ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియంనే మోసం చేసి రూ.7,926.01 కోట్లను కొల్లగొట్టినట్లు సీబీఐ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. బ్యాంకుల అధికారుల సహకారం లేకుండా రాయపాటి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉండదనే నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది.
రూ.7,926.01 కోట్లు ఎగవేత
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, తిరుపతి–తిరుత్తణి–చెన్నై టోల్‌వేస్.. భోపాల్–బయోరా టోల్‌వేస్.. దిండిగల్–తెన్ని–కుమ్లి టోల్‌వేస్.. కృష్ణగిరి–దిండివనం హైవేస్, ఒబేదుల్లాగంజ్–బేతుల్, తిరుచ్చి–కలైకుడి టోల్‌వేస్ పనులు చేపట్టేందుకు రుణం ఇవ్వాలని కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియంను ట్రాన్స్‌ట్రాయ్ కోరింది. ఈ రుణానికి బోగస్ గ్యారంటీలను చూపింది. ఇవి నిజమైనవా కాదా అన్నది తేల్చుకోకుండా బ్యాంకుల కన్సార్షియం రూ.9,394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు 2013–2014లో అంగీకరించింది. ఈ రుణాన్ని నగదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ), గ్యారంటీ (బీజీ)ల రూపంలో ఇస్తామని పేర్కొంది. 2015–16 నాటికి రూ.7,926.01 కోట్ల రుణాన్ని నగదు, ఎల్వోసీ, బీజీల రూపంలో ఇచ్చింది. కానీ, తీసుకున్న రుణం చెల్లించకుండా ట్రాన్స్‌ట్రాయ్ మోసం చేయడంతో 2019 డిసెంబర్ 30న యూనియన్ బ్యాంక్, 2020 డిసెంబర్ 15న కెనరా బ్యాంక్ అధికారులు వేర్వేరుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన సీబీఐ.. ట్రాన్స్‌ట్రాయ్ అధినేత రాయపాటి, ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర బాబ్జీ, మరో డైరెక్టర్ ఎం.సాంబశివరావులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్యాప్తులో వెల్లడైన అంశాలివీ..
రూ.2,261.58 కోట్లు ఏ బాబు జేబులోకో..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు ఏ సంస్థ అయినా బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన లావాదేవీలను ఆ బ్యాంకుల పరిధిలోనే నిర్వహించాలి. దీనివల్ల ఇచ్చిన రుణం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కానీ, కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.7,926.01 కోట్లలో రూ.2,261.58 కోట్లను కన్సార్షియంలోని లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), ఆర్‌బీఎల్‌లకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఐదు బ్యాంకుల ద్వారా మళ్లించిన మొత్తానికి ట్రాన్స్‌ట్రాయ్ సరైన లెక్కలు చూపకపోవడంతో.. ఆ నిధులు ఏ బాబు జేబులోకి చేరాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఎం.సాంబశివరావు పేరుతో యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయించిన రాయపాటి, పోలవరం పనుల కోసం ఆ సంస్థ నుంచి కేవలం రూ.3 కోట్ల విలువ చేసే వాహనాలను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, కొన్న వాహనాలనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపి బ్యాంకులు మంజూరు చేసిన రుణంలో యూనిక్ ఇంజనీర్స్ ఖాతాలోకి రూ.313.85 కోట్లను మళ్లించి కాజేశారు.
సిమెంటు, స్టీలు వంటివి కొనకుండానే..
పోలవరం, ఇతర రహదారుల పనుల కోసం ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2017 వరకూ ట్రాన్స్‌ట్రాయ్ కేవలం రూ.274.36 కోట్ల విలువైన సామగ్రిని మాత్రమే ఐదు సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. అదే మెటీరియల్‌ను మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి రూ.2,568.77 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని కాజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సంస్థ నుంచి సిమెంటు కొనుగోలు చేసినట్లు బ్యాంక్ లెడ్జర్ బుక్‌లో చూపారు. కానీ, ఆ సంస్థకు కాకుండా మరో సంస్థకు చెల్లింపులు చేసినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో తేలింది. బ్యాంక్ లెడ్జర్ బుక్‌కూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌కూ పొంతన లేని లావాదేవీల ద్వారా రూ.1,624.35 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్ దోచేసింది.
సక్రమంగా చెల్లింపులూ చేయని ట్రాన్స్‌ట్రాయ్
ట్రాన్స్‌ట్రాయ్ ఎక్కడ పనిచేసినా సబ్ కాంట్రాక్టర్లకు సక్రమంగా చెల్లింపులు చేయదు. పోలవరంలో చేసిన పనులకు బిల్లులు ఎగ్గొట్టడంతో 2016 నుంచి 2019 వరకూ ట్రాన్స్‌ట్రాయ్‌కి వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్లు నెలల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.794.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా ఇచ్చామని.. వాటిని తిరిగి ఇవ్వలేని దుస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉండటంతో వాటిని మాఫీ చేశామని ట్రాన్స్‌ట్రాయ్ లెక్కలు చెప్పడంపై సీబీఐ అధికారులే నిర్ఘాంతపోయినట్లు సమాచారం.
కళ్లుగప్పి.. కొల్లగొట్టారు
Published Sun, Mar 14 2021 3:05 AM | Last Updated on Sun, Mar 14 2021 10:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment