సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్‌చిట్‌ | Clean chit for Kakani in CBI investigation | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్‌చిట్‌

Published Mon, Feb 5 2024 4:39 AM | Last Updated on Mon, Feb 5 2024 2:10 PM

Clean chit for Kakani in CBI investigation - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చిచెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్‌ హయత్, షేక్‌ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతోపాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది.

మంత్రి కాకాణి ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవా­స్తవమని స్పష్టం చేసింది. ఈమేరకు విజ­యవాడలోని ఐదో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌– మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయ­­స్థానంలో సీఐబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. 

అన్ని కోణాల్లో సమగ్ర విచారణ...
నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ న్యాయస్థానంలో 2022 ఏప్రిల్‌ 13వతేదీ రాత్రి కొందరు ఆగంతకులు దొంగతనానికి పాల్పడిఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతోపాటు పలు పత్రాలను అపహరించారు. దీనిపై మర్నాడు కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్‌ హయత్, షేక్‌ ఖాజాలను అరెస్ట్‌ చేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపారు.

ఈ ఉదంతంపై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఆధారాలను గల్లంతు చేసేందుకు చోరీకి పురిగొల్పారని అభాండాలు వేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కాకాణి దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐబీ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపింది.

రెండేళ్లపాటు దర్యాప్తు చేసి 88 మంది సాక్షులను విచారించి రూపొందించిన 403 పేజీల చార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంతో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ నిర్ధారించింది. ఏపీ పోలీసులు ఈ కేసును సక్రమంగానే విచారించారని స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రధానంగా పేర్కొన్న అంశాలివీ..

కాకాణికి సంబంధం లేదు...
నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి కాకాణి, ఆయన పీఏలు, సన్నిహితుల ఫోన్‌ కాల్స్‌ డేటాను సీబీఐ విశ్లేషించింది. న్యాయస్థానం సిబ్బందితోగానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వారితోగానీ, దర్యాప్తు అధికారులతోగానీ మంత్రి కాకాణి, ఆయన అనుచరులు ఫోన్‌లో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్ల గురించి అతి స్వల్ప వ్యవధి కాల్స్‌ మాత్రమే ఉన్నాయి. ఈ దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసిన నిందితులు సయ్యద్‌ హయత్, ఖాజా రసూల్‌తో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధాలు లేవన్నది నిర్ధారణ అయింది. నిందితుల నుంచి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను ఎవరూ ట్యాంపర్‌ చేయలేదని  తిరువనంతపురంలోని సీ–డాక్‌ పరీక్షల్లో నిర్ధారణ అయింది.

దొంగతనాలే ప్రవృత్తి..
ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితులు సయ్యద్‌ హయత్, ఖాజా రసూలే నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిద్దరిపై 15 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు కేసుల్లో శిక్ష పడగా మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన నిందితులిద్దరూ దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు. నిందితుల భార్యలు కూడా వారికి దూరంగా ఉంటున్నారు. నిందితులు తమ తల్లుల ఫోన్లను మాత్రమే వినియోగిస్తున్నారు.

వారిద్దరే నెల్లూరు న్యాయస్థానంలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్‌ ఫోన్లను తస్కరించి మిగిలిన పత్రాలను సమీపంలోని కాలువలో పారేశారు. తాము అపహరించిన వస్తువులు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కేసుకు సంబంధించినవి అనే విషయం నిందితులకు తెలియదు. పోలీసులు వారిద్దరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలువలో పారేసిన రబ్బరు స్టాంపులు, రౌండ్‌ సీళ్లు, స్టాంపు, స్టాంప్‌ ప్యాడ్‌లు మాత్రం లభ్యం కాలేదు.

సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం
మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఐబీ తేల్చి చెప్పింది. ఆయన చేసిన 14 ఆరోపణలను విడివిడిగా ప్రస్తావిస్తూ అవన్నీ నిరాధారణమని పేర్కొంది. నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్‌ హయత్, ఖాజా రసూలపై విచారణ కొనసాగించాలని సీఐబీ పేర్కొంది.

సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
పారదర్శకంగా నెల్లూరు పోలీసుల విచారణ: మంత్రి కాకాణి
నెల్లూరు(సెంట్రల్‌): కోర్టులో ఫైల్స్‌ మిస్సింగ్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే కోర్టులో ఫైల్స్‌ మిస్సింగ్‌ ఘటన చోటు చేసుకుందని, ఈ కేసును విచారించిన ఎస్పీ విజయారావు పూర్తి వివరాలను వెల్లడించారని గుర్తు చేశారు.

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనపై బురద చల్లేందుకు దీన్ని తనకు ఆపాదిస్తూ ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఏడాదిపాటు క్షుణ్నంగా విచారించిన సీబీఐ అధికారులు 88 మందిని విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారని చెప్పారు. 

ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలి
తనకు సంబంధం లేని ఫైల్స్‌ చోరీ కేసులో చంద్రబాబు తనపై నిందలు వేశారని, లోకేశ్‌ కూడా కోర్టు దొంగ అంటూ తనపై నిందలు మోపారని, ప్రజలు నాలుగుసార్లు తిరస్కరించిన సోమిరెడ్డి తనపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాకాణి పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో ఆ ముగ్గురు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీపీఐ రామకృష్ణ కూడా విమర్శలు చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ లోకేశ్‌ పలు దఫాలు విమర్శలు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించారనేందుకు ఈ కేసే ఉదాహరణ అని తెలిపారు.

బాబు కుమ్మక్కు రాజకీయాలు
నిజం గెలవాలంటూ పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నిజంగానే అలా కోరుకుంటుంటే చంద్రబాబుపై ఉన్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే నిజం గెలుస్తుందని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని మంత్రి సవాల్‌ విసిరారు. తనకు అనుభవం ఉందంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయంగా తలపడలేక కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement