బొల్లినేని శ్రీనివాసగాంధీపై సస్పెన్షన్  వేటు | Bollineni Sreenivasa Gandhi Suspension | Sakshi
Sakshi News home page

బొల్లినేని శ్రీనివాసగాంధీపై సస్పెన్షన్  వేటు

Published Thu, Feb 25 2021 3:19 AM | Last Updated on Thu, Feb 25 2021 10:07 AM

Bollineni Sreenivasa Gandhi Suspension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ జీఎస్టీలో అసి స్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఎట్టకేలకు సస్పెన్షన్  వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసిన ఘటనల్లో సీబీఐ కేసులు నడుస్తున్న క్రమంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్ డైరెక్ట్‌ ట్యాక్సెస్, కస్టమ్స్‌ (సీబీఐసీ) శాఖ బొల్లినేనిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతనితోపాటు డిప్యూటీ కమిషనర్‌ చిలుకా సుధారాణిపైనా వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. అవినీతి, అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేనిపై ఏడాది వ్యవధిలో రెండు సార్లు సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఆయన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బొల్లినేని అక్రమాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి.

బొల్లినేని వేధింపులకు తాళలేక గతేడాది ఓ బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. 2019 జూలైలో బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. 2020 సెప్టెంబర్‌లో మరో కేసు నమోదు చేసింది. అయితే ఇన్ని ఆరోపణలున్నా.. బొల్లినేనికి ఉన్నతాధికారులు క్లీన్ చిట్‌ ఇవ్వడంతో గతేడాది అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందడం గమనార్హం. సాధారణంగా పదోన్నతుల సమయంలో వ్యక్తిగత ప్రవర్తనపై సీబీఐసీ ఢిల్లీ అధికారులు రిపోర్టు కోరినప్పుడు తనపై సీబీఐ కేసులున్న సంగతి పైకి వెళ్లకుండా బొల్లినేని జాగ్రత్తపడ్డాడని సమాచారం.

పకడ్బందీగా వేధింపులు.. రూ.కోట్లలో బేరాలు
దర్యాప్తులో బొల్లినేని అక్రమాలు తెలుసుకుని సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. బొల్లినేని తన వద్దకు వచ్చిన జీఎస్టీ రిటర్నులను బాగా అధ్యయనం చేస్తాడు. లోపాలుంటే వాటిని దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేయాలి. కానీ, బొల్లినేని ఇక్కడే తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడని తెలిసింది. ముందుగా తాను కేసు నమోదు చేయబోయే వ్యాపారి, ఉత్పత్తి దారులకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, వ్యాపార భాగస్వాములను విచారణ పేరుతో పిలిపించి, కేసులు పెడతామని బెదిరిస్తాడు. వారు దారికి రాగానే.. ముందుగా రాసిన స్టేట్‌మెంట్‌పై సంత కాలు తీసుకుంటాడు. తర్వాత అసలు వ్యాపారిని పిలిపిస్తాడు. ‘మీ సిబ్బంది అంతా అప్రూవర్‌గా మారారు. మీరే మిగిలారు.. మా ఉన్నతాధికారులు మీపై కోపంగా ఉన్నారు. మేం అడిగిన్ని రూ.కోట్లు ఇవ్వకపోతే మీపై కేసులు పెడతాం. మీ ఇంట్లో ఆడవారు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది’అని బెదిరింపులకు దిగుతాడు. అడిగినంత ఇస్తే కేసే లేదు.. కానీ, ఇవ్వకపోతే వారిపై కేసులు నమోదు చేసేస్తాడు. డిమాండ్‌ చేసిన లంచాన్ని నగదు రూపంలో కూడా పూర్తిగా తీసుకోడు. 10 శాతం నగదు, మిగిలిన 90 శాతం బాధితుల భూములు బినామీల పేరిట రాయించుకుంటాడని తెలిసింది.

బదిలీలు లేకుండా ఒకేచోట 13 ఏళ్లు..
1992లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంలో ఇన్ స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లోకి డిప్యుటేషన్ పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ పని చేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్ ) లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో ఎవరికైనా రెండేళ్లే అవకాశమిస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది అదనంగా డిప్యుటేషన్  కొనసాగనిస్తారు. అంతే తప్ప 13 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగించిన దాఖలాలు లేనే లేవని సొంతశాఖ అధికారులే విస్తుపోతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్‌ జీఎస్టీ, బేగంబజార్‌ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్‌ పీరియడ్‌’అంటారు. కానీ, తనకున్న పరిచయాలతో కూలింగ్‌ పీరియడ్‌ను తప్పించుకుని యాంటీ ట్యాక్స్‌ ఎవేషన్  డిపార్ట్‌మెంట్, బషీర్‌బాగ్‌లో పోస్టింగ్‌ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి.

రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు!
2010–2019 వరకు పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని.. కుమార్తె మెడికల్‌ సీటుకే రూ.70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.3.74 కోట్లు.. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు.

ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరు.. హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో బొల్లినేని భారీగానే స్థిరాస్తులు కూడగట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా అతనిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్  రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement