న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ‘ఈ విలీనంతో ఉద్యోగుల సర్వీస్ కండీషన్స్‌పై ప్రతికూల ప్రభావం ఉండదు. ]
అలాగే, ఉద్యోగుల తొలగింపు చర్యలూ ఉండవు. కస్టమర్ల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్, నిర్వహణ సామర్థ్యాలు, పథకాల విస్తృతి, కస్టమర్లకు సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. నెట్‌వర్క్, చౌక డిపాజిట్లు మొదలైనవి విలీన బ్యాంకుకు లాభిస్తాయి‘ అని ఆయన వివరించారు. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా బీవోబీని తీర్చిదిద్దే లక్ష్యంతో 3 బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మూడింటి విలీనం అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గుతుంది. విలీన స్కీమును ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ్యుల పరిశీలనకు పార్లమెంటు ముందు 30 రోజులు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపా యి. ఈ సమావేశాలు జనవరి 8తో ముగుస్తాయి.
ప్రభుత్వ రంగంలో రెండో పెద్ద బ్యాంక్..
విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా నిలుస్తుంది. విలీన బ్యాంక్ నికర మొండిబకాయిల నిష్పత్తి 5.71% స్థాయిలో ఉండనుంది. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు 12.13 శాతంగా ఉంది. ఇక క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్) కూడా నియంత్రణ సంస్థ నిర్దేశిత 10.87 శాతం కన్నా అధికంగా 12.25 శాతం స్థాయిలో ఉంటుంది.
అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనంతో ఎస్‌బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. అదే కోవలో బీవోబీని కూడా మెగా బ్యాంక్‌గా తీర్చిదిద్దే ఉద్దేశంతో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను అందులో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. మైనారిటీ షేర్‌హోల్డర్ల అభ్యంతరాలేమైనా ఉంటే పరిష్కరించేందుకు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కడే సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
షేర్ల స్వాప్ నిష్పత్తి ఖరారు..
విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తాజాగా షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. బీవోబీ, దేనా బ్యాంక్‌ల బోర్డులు షేర్ల స్వాప్ నిష్పత్తి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి. బుధవారం బీఎస్‌ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 3.16 శాతం క్షీణించి రూ. 119.40 వద్ద, దేనా బ్యాంక్ షేరు 0.28 శాతం క్షీణించి రూ.17.95 వద్ద ముగియగా.. విజయ బ్యాంక్ షేరు స్వల్పంగా 0.29 శాతం లాభపడి రూ. 51.05 వద్ద క్లోజయ్యింది. ఈ ధరల ప్రకారం చూస్తే.. దేనా బ్యాంక్ షేర్‌హోల్డర్లకు రూ.17,950 విలువ చేసే షేర్లకు బదులుగా రూ.13,134 విలువ చేసే బీవోబీ షేర్లు లభిస్తాయి. అలాగే విజయ బ్యాంక్ షేర్‌హోల్డర్లకు రూ.51,050 విలువ చేసే 1,000 షేర్లకు గాను రూ.47,998.80 విలువ చేసే బీవోబీ షేర్లు 402 లభిస్తాయి.
ఎగుమతి వర్తకులకు వడ్డీ రాయితీ..
ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఎగుమతి వర్తకులకు 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.600 కోట్ల మేర వ్యయం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థల ఉత్పత్తులు, వ్యవసాయ, హస్తకళలు, జౌళి, తోలు, యంత్రపరికరాల సంస్థలు తయారు చేసే సుమారు 416 ఉత్పత్తులు ఈ పరిధిలోకి వస్తాయి. వడ్డీ రాయితీ స్కీములో ఎగుమతి వర్తకుల్ని కూడా చేర్చడంతో వారు మరింతగా ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభించగలదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
తద్వారా ఎంఎస్‌ఎంఈల్లో ఉత్పత్తి పెరిగి, మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. తయారీ ఎగుమతిదారుల కోసం 2015 ఏప్రిల్‌లో వడ్డీ రాయితీ పథకాన్ని అయిదేళ్ల వ్యవధికి కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే, ఇందులో వర్తక ఎగుమతిదారులకు చోటు కల్పించలేదు. తాజాగా వీరిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చింది. రుణాలు తక్కువ వడ్డీకే లభించడం వల్ల ఎగుమతిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భారతీయ ఎగు మతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. మరోవైపు, తయారీ ఎగుమతిదారుల తరహాలోనే ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించే వర్తక ఎగుమతిదారులను కూడా ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment