
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన దేనా బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్‌ఆర్) 0.20 శాతం పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2017, అక్టోబర్ 1 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని కాల పరిమితులకు గాను, ఎంసీఎల్‌ఆర్ రేట్లను తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. ఓవర్‌నైట్, మూడు నెలల కాలానికి గాను ఎంసీఎల్‌ఆర్ రేటును 0.20 శాతం కోత పెట్టి 8 శాతం , 8.10 శాతంగా బ్యాంకు నిర్ణయించింది.
అదేవిధంగా మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర కాల రుణాలకు ఎంసీఎల్‌ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.05 శాతం, 8.20 శాతం, 8.25 శాతంగా ఉంచుతున్నట్టు బ్యాంకు చెప్పింది. బేస్ రేటును కూడా 9.70 శాతం నుంచి 9.60 శాతానికి తగ్గించింది. ఇది కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంకు చెప్పింది. 2016 ఏప్రిల్ నుంచి ఎంసీఎల్‌ఆర్ మెకానిజాన్ని బ్యాంకింగ్ సిస్టమ్‌లో ప్రవేశపెట్టారు. బేస్ రేటుకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారు.