మొండి బకాయిల సమస్య...బడా కార్పొరేట్లవల్లే!
ఎన్‌పీఏల పరిష్కారం అతిపెద్ద సవాలు
⇒ రంగాలవారీగా రికవరీకి చర్యలు
⇒ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని.. ‘బడా కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక శాఖలో భాగమైన సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. మొండిబకాయిలు(ఎన్‌పీఏ) ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఎన్‌పీఏల్లో ముఖ్యంగా ఉక్కు, విద్యుత్, ఇన్‌ఫ్రా, టెక్స్‌టైల్ రంగాల సంస్థలే ఉన్నట్లు వివరించారు.
ఉక్కు రంగం క్రమంగా రికవరీ బాట పట్టిందని.. ఇక ఇన్‌ఫ్రా, విద్యుత్, టెక్స్‌టైల్ రంగాల సమస్యల పరిష్కారానికి కూడా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. 2003–08 మధ్య బూమ్ నెలకొన్నప్పుడు కార్పొరేట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని విపరీతంగా పెంచేసుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మందగమనం ధాటికి ఎదురు నిలవలేకపోయాయని జైట్లీ చెప్పారు.
పరిష్కారానికి కమిటీలు..: భారీ రుణాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వివిధ రంగాలవారీగా తగు చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు. బ్యాంకులు తన వద్దకు పంపే కేసులను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఓవర్‌సైట్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని పనితీరు, వస్తున్న స్పందనను బట్టి ఇలాంటి కమిటీలు మరిన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇటువంటి ప్రత్యామ్నాయాలు అనేకం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు.
పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ (పారా) ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు సూచించారు. రంగాలవారీగా ప్రవేశపెట్టే సంస్కరణలు కూడా పనిచేయని ఎన్‌పీఏ కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే స్పెషల్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలన్నింటిని దానికి బదలాయించాలని సభ్యులు సూచించారు. పెరుగుతున్న ఎన్‌పీఏల ప్రతికూల ప్రభావాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకుల అధికారుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించే చర్యలు కూడా అవసరమని వివరించారు. తద్వారా వారు మళ్లీ సహేతుకమైన, వ్యాపారపరంగా ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగేలా తోడ్పాటు అందించాల్సి ఉందని సభ్యులు సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ వివరించారు. ఇప్పటికే దివాలా బోర్డును ఏర్పాటు చేసినట్లు, దేశీ ఉక్కు రంగాన్ని ఆదుకునేందుకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ని గతేడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.