
సాక్షి, బిజినెస్ విభాగం : లిక్విడిటీ సమస్య కారణంగా భారీగా నష్టపోతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) మరో పిడుగు పడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా బ్యాంకులను వణికించిన మొండి బకాయిల సమస్య ఇప్పుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలపై (ఎన్‌బీఎఫ్‌సీ– నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) కూడా గట్టిగానే ప్రభావం చూపించనున్నదనేది నిపుణుల మాట. దీనికి ప్రధాన కారణం... కొత్త అకౌంటింగ్ నిబంధనలు.
పాత అకౌంటింగ్ పద్ధతిలో బకాయిలు మొండి బకాయిలుగా మారేంత వరకూ వేచి చూసి అప్పుడు కేటాయింపులు జరిపాల్సి ఉండేది. కానీ కొత్తగా అమల్లోకి రానున్న ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలుగా మారనున్న బకాయిలను ఇప్పుడే గుర్తించి... రాబోయే నష్టాలకు ముందుగానే కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. బ్యాంకులకైతే ఈ ఇండ్ యాజ్ నిబంధనలను పాటించడానికి ఆర్‌బీఐ మరో ఏడాది దాకా వెసులుబాటునిచ్చింది.
ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం ఈ జూన్ క్వార్టర్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ జూన్ క్వార్టర్ నుంచి ఇండి యాజ్ అమల్లోకి రానుండటంతో, ఈ ఏడాది జూన్– సెప్టెంబర్ క్వార్టర్, గత ఏడాది ఇదే క్వార్టర్‌ల మధ్య వచ్చే అసెస్‌మెంట్ తేడాలను కూడా ఎన్‌బీఎఫ్‌సీలు వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం మీద కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలయ్యే వాటికి ఎన్‌బీఎఫ్‌సీలు చేయాల్సిన కేటాయింపులు కనీసం రూ.3,400 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత అదనపు భారం కానుంది.
ఇండ్ యాజ్ ఎందుకు ?
ఇప్పటివరకూ కంపెనీలన్నీ గ్యాప్ (జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్) ప్రమాణాలను పాటిస్తున్నాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కంపెనీలన్నీ, ముఖ్యంగా ఆర్థిక రంగానికి చెందిన కంపెనీలన్నీ తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.
భవిష్యత్తులో అలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి గాను ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్డాండర్డ్స్‌కు అనుగుణంగా ఇండ్ యాజ్ నిబంధనలను రూపొందించారు. ఈ నిబంధనల కారణంగా మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా జరపాల్సి ఉంటుంది. దీంతో ఆయా కంపెనీల లాభదాయకత దెబ్బతింటుంది. ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) విధానంలో రుణ నష్ట కేటాయింపులు జరపాల్సి ఉంది.
10 శాతం నెట్‌వర్త్ ఆవిరి....
ఈ కొత్త నిబంధనల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల నెట్‌వర్త్ కనీసం 10 శాతం హరించుకుపోతుందని నిపుణులంటున్నారు. అయితే విభిన్న రకాల రుణాలిచ్చే కంపెనీలకు మాత్రం ఒకింత ఊరట లభిస్తుందని వారి అంచనా. పాత అకౌంటింగ్ నిబంధన ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కంపెనీ కేటాయింపులు రూ.1,200 కోట్లుగా ఉన్నాయి. కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం ఈ కేటాయింపులు రూ.1,800 కోట్లకు పెరగనున్నాయి.
ఈ భారం మహీంద్రా అండ్ మహీంద్రాపై రూ.1,357 కోట్లు, బజాజ్ ఫైనాన్స్‌పై రూ.270 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. టాప్ టెన్ ఎన్‌బీఎఫ్‌సీల్లో ఆరింటిపై ఈ కొత్త అకౌంటింగ్ నిబంధనల భారం ఉండనున్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే రిజర్వ్ నిధులకు సంబంధించి కొత్త అకౌంటింగ్ విధానాలు ఎన్‌బీఎఫ్‌సీలపై సానుకూల ప్రభావం చూపించనుండటం ఒకింత ఊరటనిచ్చే విషయమనేది వారి మాట. అయితే అంచనా రుణనష్టాలు ఎంతనేది ఇప్పటికైతే స్పష్టత లేదు.
ఏం మార్పులు వస్తాయంటే...
♦ పాత ఖాతా నిబంధనల నుంచి కొత్త ఖాతా నిబంధనలకు మారే దశలో నిర్వహణ లాభం తక్కువగా ఉంటుంది.
♦ మొండి బకాయిలకు కేటాయింపులు ముందే జరపాల్సి ఉంటుంది
♦ ఎసాప్స్ జారీ కారణంగా సిబ్బంది వ్యయాలు పెరుగుతాయ్
♦ పన్ను వ్యయాలూ పెరుగుతాయ్
ఎన్‌బీఎఫ్‌సీల జోరుకు కళ్లెం...?
నెలవారీ క్రమబద్ధంగా వేతనం రాని వ్యక్తులు, అల్పాదాయ వర్గాల వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులకు బ్యాంక్‌లు రుణాలివ్వవు. ఇలాంటి వారికి రుణాలివ్వడం ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించాయి.
మరోవైపు మొండి బకాయిల సమస్యతో బ్యాంక్ షేర్లు కుదేలవడంతో పలువురు ఇన్వెస్టర్లు ఈ ఎన్‌బీఎఫ్‌సీ షేర్లవైపే మొగ్గు చూపారు. బజాజ్ ఫైనాన్స్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీలు మంచి లాభాలు సాధించాయి. తాజాగా లిక్విడిటీ ఆందోళనలు వ్యక్తం కావడంతో ఈ షేర్లు ఇటీవల బాగా నష్టపోయాయి. తాజాగా ఇండ్ యాజ్ నిబంధనల కారణంగా చాలా ఎన్‌బీఎఫ్‌సీల ప్రభ మసకబారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment