ముంబై: కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) పేర్కొంది. ఎన్‌పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని సోమవారం నాడు వెలువడిన నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్‌పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం...
► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మొండిబకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో 9.7– 16.2% శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6–7.9% శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5–5.4% శ్రేణిలో ఉండే వీలుంది.
► ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్‌బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్‌పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.
మరింత స్పష్టత అవసరం!
ఎన్‌పీఏల విషయలో నిజానికి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం వంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్ వ్యవస్థీకరణ, తాజా రుణాల పరిస్థితి, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ పరిస్థితి, రుణాలు ఎన్‌పీఏలుగా మారే అకాశాలు, లాభదాయకత, మూలధనం సహా బ్యాంకులు సమర్పించిన తత్సబంధ గణాంకాల ప్రాతిపదికన తాజా ‘స్ట్రెస్ టెస్ట్’ అంచనాలను వెలువరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1996–1997లో బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం 15.7%. గడచిన ఏడాది జూలైలో ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్‌ను ఆవిష్కరించింది. 2021 మార్చి నాటికి ఎన్‌పీఏలు 12.5 –14.7% శ్రేణిలో ఉంటాయని అప్పట్లో నివేదిక పేర్కొంది.
వ్యవస్థలోకి రూ.2లక్షల కోట్లు...
బ్యాంకింగ్‌లో మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్‌బీఐ శ్రీకారం చుడుతోంది. రానున్న పక్షం రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల రివర్స్ రెపో లావాదేవీల ద్వారా రూ.2 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
బ్యాంకింగ్ వ్యాపార నమూనా మారాలి...
నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగిన లిక్విడిటీ, ఫైనాన్షియల్ పరిస్థితులు బ్యాంకుల ద్రవ్య ప్రమాణాలను ప్రస్తుతం నిలబెడుతున్నాయి. అయితే గణాంకాలనులోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రను గుర్తించవచ్చు. మూలధనాన్ని పెంచుకోడానికి ప్రస్తుత పరిస్థితులను బ్యాంకులు అనుకూలంగా మలచుకోవాలి. అలాగే తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాలి. ఈ చర్యలు భవిష్యత్ భద్రతకు భరోసాను అందిస్తాయి. కేంద్రం ఆదాయాలు తగ్గుతుండడం, మార్కెట్ నుంచి మరిన్ని రుణ సమీకరణకు (2020–21లో రూ.7 లక్షల కోట్ల రుణ సమీకరణ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా దానిని రూ.12 లక్షల కోట్లకు సవరించడం జరిగింది) ప్రభుత్వం ఇష్టపడకపోవడం వంటి అంశాలు బ్యాంకులపై భవిష్యత్తులో మూలధన సంబంధ ఒత్తిడులను పెంచే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్‌లో విలువల అసమతౌల్యతలు ఫైనాన్షియల్ స్థిరత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.
– ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
‘నివేదికలో ముందుమాట’
‘మొండి’ భారం రెట్టింపు!
Published Tue, Jan 12 2021 5:40 AM | Last Updated on Tue, Jan 12 2021 5:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment