Indian banks
-
బ్యాంకింగ్ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..!
న్యూఢిల్లీ: డిపాజిట్ వృద్ధి స్వల్పంగా ఉంటే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ బ్యాంకుల రుణ వృద్ధి 12–14 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘భారత్ బ్యాంకుల్లో కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులు– రుణ వృద్ధి’ అన్న శీర్షికతో ఈ మేరకు ఒక నివేదిక వెలువడింది. ‘‘మేము రేట్ చేసే భారతీయ బ్యాంకుల విషయంలో డిపాజిట్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. ఇది కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), రుణ పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ నికితా ఆనంద్ నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ నిధుల సమీకరణవైపు దృష్టి సారించవచ్చని ఆయన పేర్కొంటూ.. ఇదే జరిగితే బ్యాంకింగ్ రుణ వ్యయాలు పెరిగి మార్జిన్లు, లాభదాయకత దెబ్బతింటాయని విశ్లేసించారు. నిధుల సమీకరణ వ్యయాల పెరుగుదల, వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశాలు 2025లో బ్యాంకింగ్‌పై ప్రతికూలతలు చూపవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడానికి కారణంగా ఉండవచ్చని నికితా ఆనంద్ వివరించారు. వ్యక్తిగత రుణ విభాగం జూమ్.. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం, బ్యాంకుల మొత్తం లోన్ బుక్‌లో అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ల వాటా పెరుగుతూనే ఉంటుంది. కఠిన ద్రవ్య పరిస్థితుల్లో మార్జిన్లు భారీగా పడిపోకుండా బ్యాంకింగ్‌కు రక్షించే అంశాల్లో ఇది ఒకటి. క్రెడిట్ కార్డుల వంటి కొన్ని విభాగాలకు సంబంధించి వ్యక్తిగత రుణ మంజూరీలు ఇకపై మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ విభాగంలో పురోగతి ఆగలేదు. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ ఇటీవలి ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరిగింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించబోవని ఆర్బీఐ స్పష్టం చేయడం వ్యక్తిగత రుణ విభాగంలో కొనసాగుతున్న పురోగతికి కారణం. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ క్రెడిట్ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. కాగా, స్థిరమైన రుణ నాణ్యత, మూలధనం బ్యాంకుల క్రెడిట్ ప్రొఫైల్‌లకు మద్దతు ఇచ్చే అంశాలుగా ఆనంద్ తెలిపారు. అనుకూలమైన ఈక్విటీ మార్కెట్లు, ఆపరేటింగ్ పరిస్థితులు 2024లో బ్యాంకులకు రుణ సమీకరణ అవకాశాలను పెంచే అంశాలని ఆయన తెలిపారు. -
విదేశాల్లో పెరిగిన భారత బ్యాంకు శాఖలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్‌లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్‌లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టమవుతోంది: ఫిచ్
న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది. కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా ఫిచ్ పేర్కొంది. -
బ్యాంకుల్లోకి రూ.1.5 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్ల రూపంలో రూ.1–1.5 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అదనంగా వచ్చి చేరొచ్చని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య తెలిపారు. దీంతో 2023–24లో డిపాజిట్లలో వృద్ధి 11 శాతానికి పైగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నోట్లను వచ్చే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా ఖాతాలలో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. రుణాల్లో వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతానికి తగ్గొచ్చని భట్టాచార్య అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ వచ్చే వారం సమీక్షలో రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించొచ్చని, రేట్లను తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు అయితే లేదన్నారు. వృద్ధిపై ఒత్తిళ్లు ఉన్నందున 2023–24 నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చన్నారు. ఇది ఆర్బీఐ నిర్ధేశిత లక్ష్యంలోపు అనే విషయాన్ని గుర్తు చేశారు. -
పటిష్టంగా భారత బ్యాంకుల లాభదాయకత
న్యూఢిల్లీ: భారత బ్యాంకుల లాభదాయకత ఆరోగ్యకర స్థాయిలో స్థిరపడుతుందని, ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడడం కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. ‘‘భారత బ్యాంకుల లాభాలు ఇక మీదట ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల భారం గణనీయంగా పెరిగిన దగ్గర్నుంచి, గత ఏడేళ్లలో ఈ రంగం ఎంతో మెరుగుపడింది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలిసేత్ ఛాబ్రియా తెలిపారు. రుణ వసూళ్లు బలంగా ఉన్నాయని, భారత బ్యాంకులు దశాబ్ద కాలంలో మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయని ఎస్అండ్పీ రేటింగ్స్ పేర్కొంది. క్రెడిట్ వ్యయాలు తక్కువగా ఉండడం, అధిక నికర వడ్డీ మార్జిన్ల నుంచి ప్రయోజనం పొందడం వల్ల భారత బ్యాంకింగ్ రంగం ప్రయోజనం చూస్తున్నట్టు తెలిపింది. వ్యవస్థ అంతటా ఆస్తులపై సగటు రాబడులు (ఆర్వోఏఏ) 1.2 శాతంగా 2022–23లో ఉంటాయని, 2023–24లో 1.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా వచ్చే ఎన్పీఏలు తక్కువగానే ఉన్నట్టు తెలిపింది. మాఫీ చేసిన రుణాలు వసూలు అవుతుండడంతో వాటి లాభాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. భారత్ బలమైన ఆర్థిక పనితీరు బ్యాంకింగ్ రంగానికి సానుకూలమని ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. 2026 వరకు భారత్ ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధిని చూస్తుందని, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని తెలిపింది. -
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
విదేశీ బ్యాంక్ శాఖలకు కొంత స్వేచ్ఛ
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. -
చిప్ కార్డు సంస్థల కుమ్మక్కు.. విచారణకు ఐబీఏ డిమాండ్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. చిప్‌ల కొరత పేరుతో వివిధ వెండర్లు కార్డుల రేట్లను పెంచేస్తున్నట్లు, పెంపు పరిమాణం దాదాపు ఒకే రకంగా ఉంటున్నట్లు తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇదంతా చూస్తుంటే వెండర్లు కుమ్మక్కయ్యే ఇలా చేస్తుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సీసీఐకి లేఖ రాయడంతో పాటు అటు ఆర్థిక శాఖకు కూడా ఐబీఏ విషయాన్ని తెలియజేసింది. సీనియర్ బ్యాంకు అధికారి వివరణ ప్రకారం.. గతేడాది 4–5 కార్డు సంస్థలు చిప్‌ల కొరత వల్ల ధరలు పెంచాల్సి వస్తోందంటూ బ్యాంకులను సంప్రదించాయి. అప్పట్లో ఒక్కో కార్డు ధరను రూ. 35 నుంచి రూ. 42కి పెంచేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అయితే, అవే వెండర్ సంస్థలు మూడు నెలల క్రితం మళ్లీ రేట్లు పెరిగాయంటూ బ్యాంకులను సంప్రదించాయి. దీంతో కార్డులు లేకుంటే వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు రూ. 10 మేర పెంచేందుకు అంగీకరించిందని అధికారి తెలిపారు. గత కొద్ది నెలలుగా కార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో బ్యాంకులే పెరిగిన రేటు భారాన్ని మోస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఆఖరు నాటి 92.81 కోట్ల డెబిట్ కార్డులు, 8 కోట్ల పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏప్రిల్ మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 20 లక్షల పైచిలుకు కార్డులు జారీ అయ్యాయి. -
ప్చ్..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్ యాప్స్ సేవలు!
భారత్‌కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఫర్ రెస్టర్..మనీ మేనేజ్మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్‌ను ఇచ్చింది. తాజా క్యూ3లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్‌కు కూడా 60శాతం మించి స్కోర్ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. బ్యాంకుల్లో నావిగేషన్ బాగున్నప్పటికీ యాప్స్‌లో సెర్చ్ బార్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్లను గుర్తించేలా యాప్‌లో సులభమైన పద్దతులు లేవని ఫర్ రెస్టర్ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్‌ను బిల్డ్ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్ బ్యాకింగ్ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది. -
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే...
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే మాఫీ చేస్తారట మావా! -
కరోనా సెకండ్‌వేవ్: దేశీయ బ్యాంకుల కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్-సెప్టెంబర్) కోవిడ్ రెండో దశ ప్రభావంతో ఆర్థిక సంస్థల పనితీరు దెబ్బతిననుంది. దీంతో భారతీయ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కానున్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఈ విషయాలు వెల్లడించింది. ఆర్థిక రికవరీకి కోవిడ్‌పరమైన సమస్యల ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపింది. ఒకవేళ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి.. కొత్తగా లాక్డౌన్లు విధించాల్సి వస్తే మరింత ప్రతికూల పరిస్థితులు తప్పకపోవచ్చని పేర్కొంది. రాబోయే 12–18 నెలల్లో బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండిబాకీలు భారీగా 11–12 శాతం స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ఎస్అండ్పీ తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికపరమైన బలహీన పరిస్థితులు కాస్త ముందుకు జరిగాయని, ఆర్థిక సంస్థలకు సంబంధించి రుణ బాకీల వసూళ్లు.. లోన్ల మంజూరు తగ్గడం రూపంలో ప్రథమార్ధంలోనే ఇది ప్రతిఫలించవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ ఛాబ్రియా తెలిపారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి దేశం క్రమంగా కోలుకునే క్రమంలో దేశీ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కావచ్చని ఆమె పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు నుంచే బ్యాంకులు మొండి బాకీల సమస్యతో సతమతమవుతుండగా.. కోవిడ్ రాకతో పరిస్థితులు కచ్చితంగా మరింత దిగజారాయని తెలిపారు. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) టూరిజం, రియల్టీలో మొండిబాకీలు.. పర్యాటకం, తత్సంబంధ రంగాలు, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్, అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు మొదలైనవి మొండిబాకీల (ఎన్పీఎల్) పెరుగుదలకు కారణం కాగలవని ఎస్అండ్పీ తెలిపింది. అయితే, ఈ రంగాలకు బ్యాంకులు ఒక మోస్తరుగానే రుణాలిచ్చాయని.. కాబట్టి ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది. చిన్న సంస్థలకు లేదా వాణిజ్య వాహనాల కోసం రుణాలతో పోలిస్తే గృహ రుణాలు (ఎఫర్డబుల్ హౌసింగ్ మినహా), బంగారం రుణాలపైనా ప్రభావం తక్కువే ఉండవచ్చని ఎస్అండ్పీ వివరించింది. బ్యాంకుల కన్నా ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీలకే ఇవి ఆందోళనకరంగా ఉండవచ్చని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో నగదు సరఫరా కాస్త పెరగనున్నప్పటికీ.. కొందరు రుణగ్రహీతలు కొండలా పేరుకుపోతున్న అప్పును తీర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని వివరించింది. సెకండ్ వేవ్ వల్ల రెండో విడత రుణాల పునర్వ్యవస్థీకరణ అమలు చేయడం వల్ల మొండిబాకీలను గుర్తించే ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని ఎస్అండ్పీ తెలిపింది. పునర్ వ్యవస్థీకరించిన రుణాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. (Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!) ప్రభుత్వం పైనే భారం.. కోవిడ్ కారణంగా దేశీ ఆర్థిక సంస్థల పనితీరుపై పడే ప్రతికూల ప్రభావాలు తగ్గడమనేది.. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రకటించిన చర్యలు ఎంత సమర్ధమంతంగా అమలవుతాయన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని ఎస్అండ్పీ పేర్కొంది. మరిన్ని కొత్త వేరియంట్లు రావడం, అంచనాల కన్నా తక్కువ స్థాయిలో టీకాలు వేసే అవకాశాలు మొదలైన రిస్కులు కూడా ఉన్నాయని తెలిపింది. ‘పరిమిత స్థాయిలో టీకాల సరఫరా, ప్రజల్లో సందేహాలు మొదలైన అంశాలన్నీ టీకాల కార్యక్రమం చకచకా ముందుకు సాగడానికి ప్రతిబంధకాలుగా మారాయి. జనాభాలో దాదాపు 70శాతం మందికి టీకాలు వేయాలంటే ప్రథమార్ధం అంతా సరిపోవచ్చు. ఈలోగా కొత్త కేసులు పెరిగి లాక్డౌన్లు తిరిగి విధించాల్సి వస్తే.. ఆర్థిక రికవరీకి మళ్లీ తప్పకపోవచ్చు‘ అని వివరించింది. (Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు) -
జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు
ముంబై: బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5.56 శాతానికి 2020–21 సంవత్సరంలో పడిపోగా.. నాణేనికి మరోవైపు అన్నట్టు దేశ జీడీపీలో బ్యాంకుల రుణ నిష్పత్తి 56 శాతానికి చేరుకుంది. 2015లో నమోదైన 64.8 శాతం తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అయినప్పటికీ పోటీ దేశాల కంటే, జీ20 దేశాల సగటు కంటే తక్కువగానే ఉండడాన్ని గమనించాలి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ క్రెడిట్స్ (బీఐఎస్) గణాంకాలను పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంకుల రుణాలు 2020 నాటికి 1.52 లక్షల కోట్ల డాలర్లు (రూ.112 లక్షల కోట్లు) గా ఉన్నాయి. మన దేశ బ్యాంకుల రుణాలు–జీడీపీ నిష్పత్తి ఆసియా దేశాల్లో రెండో కనిష్ట స్థాయి కాగా.. వర్ధమాన దేశాలతో పోలిస్తే 135.5 శాతంగాను, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 88.7 శాతంగాను ఉన్నట్టు బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హామీలేని రుణ పథకాలు సైతం ఉన్నాయి. అయినాకానీ బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి అన్నది ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తుందని.. బ్యాంకుల రుణాలు జీడీపీలో 100 శాతంగా ఉండడం ఆదర్శనీయమైనదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రిక్స్ దేశాలను గమనిస్తే.. బ్యాంకుల రుణాలు–జీడీపీ రేషియో చైనాలో 161.75 శాతం, రష్యాలో 88.12 శాతం, బ్రెజిల్లో 50.8 శాతం, దక్షిణాఫ్రికాలో 40.1 శాతం చొప్పున ఉంది. -
‘మొండి’ భారం రెట్టింపు!
ముంబై: కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని సోమవారం నాడు వెలువడిన నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో 9.7– 16.2% శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6–7.9% శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5–5.4% శ్రేణిలో ఉండే వీలుంది. ► ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. మరింత స్పష్టత అవసరం! ఎన్పీఏల విషయలో నిజానికి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం వంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్ వ్యవస్థీకరణ, తాజా రుణాల పరిస్థితి, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ పరిస్థితి, రుణాలు ఎన్పీఏలుగా మారే అకాశాలు, లాభదాయకత, మూలధనం సహా బ్యాంకులు సమర్పించిన తత్సబంధ గణాంకాల ప్రాతిపదికన తాజా ‘స్ట్రెస్ టెస్ట్’ అంచనాలను వెలువరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1996–1997లో బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 15.7%. గడచిన ఏడాది జూలైలో ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ను ఆవిష్కరించింది. 2021 మార్చి నాటికి ఎన్పీఏలు 12.5 –14.7% శ్రేణిలో ఉంటాయని అప్పట్లో నివేదిక పేర్కొంది. వ్యవస్థలోకి రూ.2లక్షల కోట్లు... బ్యాంకింగ్‌లో మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. రానున్న పక్షం రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల రివర్స్ రెపో లావాదేవీల ద్వారా రూ.2 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యాపార నమూనా మారాలి... నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగిన లిక్విడిటీ, ఫైనాన్షియల్ పరిస్థితులు బ్యాంకుల ద్రవ్య ప్రమాణాలను ప్రస్తుతం నిలబెడుతున్నాయి. అయితే గణాంకాలనులోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రను గుర్తించవచ్చు. మూలధనాన్ని పెంచుకోడానికి ప్రస్తుత పరిస్థితులను బ్యాంకులు అనుకూలంగా మలచుకోవాలి. అలాగే తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాలి. ఈ చర్యలు భవిష్యత్ భద్రతకు భరోసాను అందిస్తాయి. కేంద్రం ఆదాయాలు తగ్గుతుండడం, మార్కెట్ నుంచి మరిన్ని రుణ సమీకరణకు (2020–21లో రూ.7 లక్షల కోట్ల రుణ సమీకరణ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా దానిని రూ.12 లక్షల కోట్లకు సవరించడం జరిగింది) ప్రభుత్వం ఇష్టపడకపోవడం వంటి అంశాలు బ్యాంకులపై భవిష్యత్తులో మూలధన సంబంధ ఒత్తిడులను పెంచే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్‌లో విలువల అసమతౌల్యతలు ఫైనాన్షియల్ స్థిరత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘నివేదికలో ముందుమాట’ -
మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!
లండన్: తమను కోట్లాది రూపాయలమేర మోసగించి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్‌మాల్యాను భారత్ బ్యాంకులు వదలడంలేదు. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని మరోసారి ఇంగ్లాండ్‌లోని హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వం లోని 13 బ్యాంకుల కన్సార్షియం పటిష్టమైన వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్ చేసుకున్నారు. మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తే... రుణాలు రాబట్టుకునే విషయంలో భారత్ బ్యాంకింగ్ తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది. కేసు వివరాలు క్లుప్తంగా... ► భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన మాల్యా నుంచి 114.5 కోట్ల పౌండ్ల (రూ.10 వేల కోట్లపైన) వసూలు చేసుకునే క్రమంలో బ్యాంకింగ్ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మాల్యా తన వాదనలు వినిపిస్తూ... భారత్‌లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయన్నారు. పైగా తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాం కులకు పూర్తి గ్యారంటీ (సెక్యూర్డ్ క్రెడిటార్స్) ఉందన్నారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడంలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న కొట్టివేశారు. ► అయితే ఈ తీర్పుపై భారత్ బ్యాంకింగ్ కన్సార్షియం ఇటీవలే తాజాగా అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్లో వివరించింది. మాల్యా ప్రతిపాదించిన సెటిల్మెంట్ ఆఫర్ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయి. మాల్యాకుగానీ లేదా ఒకప్పటి యూబీహెచ్ఎల్ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ ఆఫర్‌కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధారపడజాలరు. ఆయన సెటిల్మెంట్ ఆఫర్ అమలుకు సాధ్యం కాదు. మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదు’’ అని మంగళవారంనాటి తన వాదనల్లో బ్యాంకింగ్ కన్సార్షియం తరఫు బారిష్టర్ షేక్‌డీమియన్ పేర్కొన్నారు. భారత్‌కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ బ్రిటన్ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను బ్యాంకింగ్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ► బారిష్టర్ ఫిలిప్ మార్షల్ నేతృత్వంలోని మాల్యా తరఫు లీగల్ టీమ్ మాత్రం బ్యాంకులు ‘సెక్యూర్ట్ క్రెడిటార్స్’ అనీ, బ్యాంకింగ్ తాజా పిటిషన్‌నూ కొట్టేయాలని తన వాదనల్లో వినిపించింది. -
భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్... స్థిరం
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్‌ను మరో 12 నుంచి 18 నెలలు ‘స్థిరం’గా ఉంచుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. బ్యాంకింగ్ రుణ నాణ్యత బలహీనంగా ఉన్నా... స్థిరంగా ఉందని వివరించింది. ఇందుకు సంబంధించి మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని వివరించిన అంశాల్లో క్లుప్తంగా కొన్ని... ►బ్యాంకింగ్‌కు స్థిర అవుట్‌లుక్ ఇవ్వడంలో ఆరు ప్రమాణాలను అనుసరించడం జరిగింది. నిర్వహణా పరమైన వాతావరణం, రుణ నాణ్యత, మూలధనం, నిధుల సమీకరణ, రుణ లభ్యత, లాభదాయకత, సామర్థ్యం, ప్రభుత్వ మద్దతు. ఆ ఆరు ప్రమాణాల విషయంలో బ్యాంకుల పరిస్థితి ‘స్థిరం’గా ఉంది. ►ఇక పటిష్ట ఆర్థిక వృద్ధి పరిస్థితులూ బ్యాంకింగ్ రంగ స్థిరత్వానికి దోహదపడుతున్నాయి. ► 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2019–2020లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. పెట్టుబడులు పెరగడం, పటిష్ట వినియోగం దీనికి కారణం. ►కాగా, ఆర్థిక వ్యవస్థలో రుణాలకు సంబంధించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్(ఎన్బీఎఫ్సీ) చాలా కీలకమైనవి. ఎన్బీఎఫ్ఐలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన ఇబ్బందులు వృద్ధిని మందగింపజేస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదలా ఇక్కడ ప్రతికూలంగా మారుతోంది. ► ఇక ప్రత్యేకించి బ్యాంకింగ్ రుణ నాణ్యత విషయానికి వస్తే, బలహీనంగా ఉన్నా స్థిరంగా ఉంది. రుణ వృద్ధి తిరిగి పుంజుకుంటోంది. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతున్నాయి. మొండిబకాయిల సమస్యలూ క్రమంగా పరిష్కారమవుతున్నాయి. ఇవన్నీ రుణ లభ్యత మెరుగుకు దోహదపడే అంశాలే. అయితే బడా ఎన్పీఏల సమస్య పరిష్కారంపైనే రుణ నాణ్యత పూర్తి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ ఇటీవలే తెలిపారు. బ్యాంకింగ్ ఎన్పీఏలు రుణాల్లో దాదాపు 12 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ►బ్యాంకింగ్ మూలధనం విషయానికి వస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయంలో బలహీనంగానే ఉన్నాయి. కనీస మూలధన అవసరాలకు ప్రభుత్వ మూలధన మద్దతుపై ఆధారపడుతున్నాయి. అయితే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మూలధన అవసరాలను తట్టుకోగల పరిస్థితుల్లో బ్యాంకులు కొనసాగుతున్నాయి. ► బ్యాంకుల లాభదాయకత మెరుగుపడుతోంది. అయితే అధిక రుణ వ్యయాలు లాభదాయకతకు ప్రతికూలంగా తయారవుతున్నాయి. ►మూడీస్ దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు రేటింగ్ ఇస్తోంది. మొత్తం బ్యాంకింగ్ రుణాల్లో ఈ బ్యాంకుల వాటా 70 శాతం. ఈ 15 బ్యాంకుల్లో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే, బలహీనంగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో ఆ 11 బ్యాంకులు బాగున్నాయి: జఫ్రీన్ మొండిబకాయిల (ఎన్పీఏ) భారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల రిటైల్ రుణాలు బాగున్నాయని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– జఫ్రీస్ పేర్కొంది. 2015 మార్చిలో మొత్తం రిటై ల్ రుణాల్లో ఈ 11 బ్యాంకుల వాటా 15 శాతం అయితే, 2018 సెప్టెంబర్‌లో ఈ వాటా 4 శాతం పెరిగి 19 శాతానికి చేరిందని ఈ సంస్థ నివేదిక పేర్కొంది. పీసీఏ పరిధిలోకి వెళ్లిన బ్యాంకుల్లో అలహాబాద్ బ్యాంక్, యూబీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు ఉన్నాయి. -
పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం
వాషింగ్టన్: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్ హెల్త్‌కేర్, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి మోసం, అవినీతి చర్యలకు పాల్పడడంతో నిషేధం విధించినట్టు ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక తెలియజేసింది. ఓలివ్ హెల్త్‌కేర్‌పై పదేళ్లు, జైమోదిపై ఏడున్నరేళ్ల పాటు ఈ నిషేధం అమలుకానుంది. మొత్తం 78 కంపెనీలు, వ్యక్తులపై ప్రపంచ బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. భారత్‌కే చెందిన ఏంజెలిక్యూ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై నాలుగున్నరేళ్లు, ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఆర్కేడీ కన్‌స్ట్రక్షన్స్‌పై ఏడాదిన్నరపాటు వేటు వేసింది. తత్వ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఎంఈసీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్‌పై ఏడాదిలోపు నిషేధం విధించింది. -
రాజన్ సూచనలు శిరోధార్యం
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే అలవాటున్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరో సారి కుండబద్దలు కొట్టారు. బ్యాంకుల మొండి బకాయిలకు మూలాలు ప్రభుత్వ నిర్ణయాల్లో, తీరు తెన్నుల్లో ఉన్నాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక సహజంగానే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీకి రాజన్ ఇచ్చిన నోట్‌ను తమకనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. అత్యధిక శాతం మొండి బకాయిలకు 2006–08 మధ్యనే బీజం పడిందని నివేదికలో ఆయనన్న మాటలను ఆసరా చేసుకుని కాంగ్రెస్‌పై బీజేపీ దాడి ప్రారంభించగా... కొంపముంచే ఆస్కారమున్న ఎగవేతదార్ల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) పంపానని ఆయన చెప్పడాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపింది. ఆ జాబితాపై మోదీ సర్కారు దృష్టి పెట్టి ఉంటే ఎగవేతదార్లు దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆ పార్టీ అంటోంది. ఆ రెండు పార్టీలూ ఇలా పరస్పర విమర్శలకు దిగడంలో వింతేమీ లేదు. అయితే రఘురాం రాజన్ చెప్పిన అంశాలు అనేకం ఉన్నాయి. పాలనా వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ మంద గిస్తున్న వైనం అందులో ప్రధానమైనది. అలాగే వివిధ బ్యాంకుల చీఫ్‌లు రిటైరైన చాన్నాళ్లకుగానీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవటాన్ని, తిరిగొస్తాయో రావో తెలియకుండా రుణ మేళాలు నిర్వహిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇవి గత యూపీఏ ప్రభుత్వానికీ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికీ కూడా సమంగా వర్తిస్తాయి. బొగ్గు గనుల కేటాయింపులో లేదా మరే ఇతరచోట్లనో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోతోంది. ఆరోపణల అతీగతీ తేలడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంటే, కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వివిధ శాఖలు జంకుతున్నాయి. ఆ నిర్ణ యాలపై కూడా భవిష్యత్తులో ఆరోపణలు వెల్లువెత్తి దర్యాప్తు మొదలుపెడితే చిక్కుల్లో పడతామన్న భయాందో ళనలు నిర్ణయరాహిత్యానికి దారితీస్తున్నాయి. పర్యవసానంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడిక క్కడ ఆగిపోతు న్నాయి. ఉత్పాదన ప్రారంభం కాకపోవడంతో తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీలు కూడా చెల్లించ లేని స్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పులిచ్చిన బ్యాంకులు కుదేలవుతున్నాయి. ఇది ఒక పార్శ్వం కాగా, మరొకటి బ్యాంకుల సోమరితనం. తమను రుణం అడుగుతున్న సంస్థ పని తీరు, అది ప్రతిపా దిస్తున్న ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, మార్కెట్లో దానికుండే విజయావకాశాలు సొంతంగా మదింపు వేసుకోకుండా ఆ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరించే బ్యాంకు ఇస్తున్న నివేదికను విశ్వసించి రుణాలి వ్వడానికి ఉబలాటపడుతున్నాయి. ముందూ మునుపూ ఆ సంస్థ వైఫల్యం చెందితే రుణం వసూలు కాక లబోదిబో మంటున్నాయి. రఘురామ్ రాజన్ 2006–08 కాలాన్ని ప్రస్తావించి చెప్పారుగానీ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరుల ఉదంతాలు గమనిస్తే అవి అనంతరకాలం కూడా కొనసా గాయని అర్ధమవుతుంది. కేవలం బ్యాంకుల అసమర్ధతే ఇందుకు కారణమని చెప్పటం అర్ధసత్యమే అవుతుంది. బ్యాంకుల్లో కీలక స్థానాల్లో ఉన్నవారి అవినీతి కూడా ఇందుకు దోహదపడుతోంది. సాధా రణ పౌరులు రుణం కోసం వెళ్లినప్పుడు సవాలక్ష ప్రశ్నలు వేసి, ఇచ్చే రుణానికి రకరకాల హామీలు కోరే బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తల ముందు మాత్రం మోకరిల్లుతాయి. అప్పు తీసుకున్న సంస్థ తిరిగి చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో కనిపించటం కోసం వాటికి తిరిగి అప్పులిచ్చి జమ రాసుకుంటున్నారు. ఇదంతా ఎప్పటికో బద్దలయ్యాక అందరూ చేతులెత్తేస్తున్నారు. చివరకు పాలనాపరంగా తమ అస మర్ధత ఎక్కడ బయటపడుతుందో నన్న భయంతో ప్రభుత్వాలు బ్యాంకులకు వేలాది కోట్ల రూపా యలు తరలించి గండం నుంచి గట్టెక్కుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల్లో వృత్తిగత నిపుణులు లేకపోవడాన్ని, వాటి సారథులు రిటైరై నప్పుడు వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడాన్ని కూడా రాజన్ ప్రస్తావించారు. ఈ రెండు సమస్యలూ కూడా కీలకమైనవి. అధికారంలో ఉండేవారు తమకనుకూలమైనవారితో బోర్డుల్ని నింపేస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోంది. అసంబద్ధ నిర్ణ యాలు బ్యాంకుల్ని ముంచేస్తున్నాయి. ఎగవేతదార్లకు రాజకీయ నేతలతో ఉండే పరిచయాల వల్ల వారికి సులభంగా కొత్త రుణాలు వస్తున్నాయి. బోర్డులు పటిష్టంగా ఉంటే ఈ బాపతువారి ఆట కడుతుంది. 2014లో రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా బ్యాంకింగ్ రంగ నిపు ణుడు పీజే నాయక్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డుల గురించి అది విలువైన సూచ నలు చేసింది. షేర్ హోల్డర్లు ఎన్నుకునే ఇండిపెండెంట్ డైరెక్టర్లు బోర్డులో ఉండాలని సూచించింది. వారిని ప్రభుత్వమే నియమించే ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని కోరింది. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతానికి మించరాదన్న దాని సిఫార్సు జాతీయ బ్యాంకుల పరోక్ష ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్న విమర్శలొచ్చినా బోర్డుల్లో వృత్తిరంగ నిపుణులుండాలని, నిర్ణయాలకు వారిని బాధ్యుల్ని చేయాలని నాయక్ కమిటీ చేసిన సిఫార్సు విలువైనది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ కమిటీ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక బ్యాంకు సార థులుగా ఉండేవారి రిటైర్మెంట్ ఎప్పుడో ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది. కనుక చాలా ముందుగానే వారి వారసుల్ని నిర్ణయించవచ్చు. ఇందులో ఎంతో జాప్యం చోటుచేసుకుంటోంది. ఫలితంగా పాలన కుంటుపడుతోంది. కీలక నిర్ణయాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి మరెంతకాలమో కొనసాగరాదన్న రాజన్ సూచన గమనించదగ్గది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ నిక్కచ్చిగా మాట్లాడే రాజన్‌ను మొండి బకా యిలపై అభిప్రాయాలు కోరడం మంచిదైంది. ఆయన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసు కుంటే మన బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అంతేతప్ప రాజకీయ పక్షాల పరస్పర విమర్శల వల్ల దేశానికి ఒరిగేది శూన్యం. -
విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ
లండన్ : భారత్, యూకేలో పలు న్యాయ కేసులను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బ్యాంకుల కన్సోర్టియంకు లీగల్ ఫీజుల కింద రూ.1.5 కోట్లను చెల్లించాలని లండన్ హైకోర్టు విజయ్ మాల్యాను ఆదేశించింది. బ్యాంకులకు వ్యతిరేకంగా అతను నమోదు చేసిన కేసు కొట్టివేసిన అనంతరం వారి లీగల్ ఫీజులు వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యాను ప్రస్తుతం భారత్‌కు అప్పగించే ప్రక్రియపై లండన్ కోర్టులో విచారణ జరుగుతుంది. మాల్యా ఇప్పటికే లీగల్ ఫీజుల కింద రూ.1.8 కోట్లను చెల్లించారు. తాజాగా మరో రూ.1.5 కోట్లను చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా ఈ కేసులో బ్యాంకులకు రూ.3.3 కోట్లను మాల్యా చెల్లిస్తున్నారు. బ్యాంకుల న్యాయ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, మొదటి ప్రతివాది (మాల్యా) 2,00,000 పౌండ్లు(రూ.1.8కోట్లు) చెల్లింపులు చేశారు. 60 రోజుల లోపు మరో 1,75,000 పౌండ్లను చెల్లించి, తుది పరిష్కారం పొందుతారు అని జడ్జి వాక్స్‌మ్యాన్ క్యూసీ చెప్పారు. ప్రస్తుతం అతను బ్యాంక్‌లతో రాజీకి వస్తున్నారని తెలిసింది. కాగ గత నెల చివరిన మాల్యాను భారత్‌కు అప్పగింతపై తుది విచారణ జరిగింది. బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై వస్తున్న మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. -
ఎన్పీఏ సమస్య సత్వర పరిష్కారం కష్టమే!!
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియన్ బ్యాంకులు అతిపెద్ద మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని చూడలేవని బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు. దేశం పెట్టుబడుల కొరతను ఎదుర్కొంటోందని, జీడీపీలో ప్రస్తుత స్థూల పెట్టుబడుల వాటా 7.5–8 శాతం స్థిర వృద్ధికి సరిపోదని పేర్కొన్నారు. ఈయన 2017–18 వార్షిక నివేదికలో సంస్థ వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ల కొరత, బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి అనే రెండు ప్రధాన అంశాల కారణంగా దేశ జీడీపీ వృద్ధి నెమ్మదించిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక ప్రాతిపదికన 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో (6.7 శాతం) వృద్ధి చెందింది. 2016–17 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.1 శాతం. 2013–14లో వృద్ధి కనిష్టంగా 6.4 శాతంగా నమోదయ్యింది. కొండలా భారీగా పేరుకుపోయిన ఎన్పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను నాశనం చేశాయని, లాభాలను హరించేశాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త దివాలా చట్టం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనివల్ల ఎన్పీఏల సమస్య సత్వర పరిష్కారాన్ని చూడలేదని తెలిపారు. జీడీపీపై పెట్టుబడుల కొరత ప్రభావాన్ని వివరిస్తూ.. ‘జీడీపీలో స్థూల స్థిర పెట్టుబడుల వాటా గత ఆరేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 7.5–8 శాతం స్థిర వృద్ధికి ఇది సరిపోదు’ అని పేర్కొన్నారు. దేశీ మోటార్‌సైకిల్ విక్రయాల తగ్గుదల సంస్థపై ప్రభావం చూపదని, మరింత మంచి పనితీరును ప్రదర్శిస్తుందని రాహుల్ బజాజ్ తెలిపారు. -
మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్
లండన్: ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు భారీ షాకిచ్చింది. తమ రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాలకింద 13 భారతీయ బ్యాంకులకు కనీసం 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ఆదేశించారు. మరోవైపు మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన ఆర్డర్‌ను ఆయన తిరస్కరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాల్యాను పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. కాగా స్టేట్ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. -
ఇండియన్ బ్యాంక్ లాభం 59 శాతం డౌన్
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ 2017–18 నాలుగో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.132 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.320 కోట్లతో పోలిస్తే 59 శాతం క్షీణించిందని ఇండియన్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ కిశోర్ కారత్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.4,602 కోట్ల నుంచి రూ.4,954 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు రూ.2,988 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. రూ.2,000 కోట్ల ‘మొండి’ రికవరీలు..! స్థూల మొండి బకాయిలు 7.47 శాతం నుంచి 7.37 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ మొండి బకాయిలకు కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయని కారత్ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.608 కోట్ల నుంచి రూ.1,772 కోట్లకు ఎగిశాయని, నికర మొండి బకాయిలు 4.39 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గాయని తెలియజేశారు. నికర మొండి బకాయిలు 3 శాతంలోపు తగ్గించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,000 కోట్ల మొండి బకాయిలను రికవరీ చేయగలమని చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,406 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం క్షీణించి రూ.1,259 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ 8 శాతం నష్టంతో రూ. 314 వద్ద ముగిసింది. -
విద్యార్థులకు రుణాలివ్వాలంటే భయం
సాక్షి, న్యూఢిల్లీ : రుణాలు తీసుకున్న విద్యార్థులు తిరిగి వాటిని చెల్లించక పోవడంతో భారతీయ బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. దాంతో విద్యార్థులకు రుణాలిస్తున్న శాతం రోజు రోజుకు గణనీయంగా పడిపోతోంది. 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడం ఏకంగా 17 శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది. విద్యార్థులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించక పోవడమే కారణమని ‘ది రీసర్చ్ అండ్ రేటింగ్ ఏజెన్సీ–కేర్ రేటింగ్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. విద్యార్థులు తీసుకున్న రుణాల్లో 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య నిరర్థక ఆస్తులు 5.7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. అంటే, 2017, మార్చి నెల నాటికి నిరర్థక ఆస్తులు 5,192 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016, డిసెంబర్ నెల నాటికి దేశంలోని విద్యార్థులకు బ్యాంకులు మొత్తం 72,336 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. వాటిలో 95 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందజేశాయి. మొండి బకాయిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకుండా డిగ్రీ విద్యార్థులు తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాల్లో కూడా మూడవ పార్టీ, కొలాటరల్ గ్యారెంటీ అవసరం లేకుండా నాలుగు లక్షల రూపాయలలోపు తీసుకున్న రుణాలే ఎక్కువ. తల్లిదండ్రులు, విద్యార్థులు సంయుక్తంగా చెల్లించాల్సిన రుణాలకన్నా విద్యార్థులు చెల్లించాల్సిన రుణాల్లోనే ఎక్కువ మొండి బకాయిలు ఉన్నారు. ఇక ప్రాంతాల వారిగా ఈ మొండి బకాయిలను చెల్లించని వారు ఎంతంటే దక్షిణాదిలో 56 శాతం మంది విద్యార్థులుండగా, ఉత్తరాదిలో 44 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. దక్షిణాదిలోనూ కేరళ, తమిళనాడులోనే మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొండి బకాయిల శాతం పది శాతం ఉండగా, దేశవ్యాప్తంగా సగటున 7.67 శాతం ఉంది. బ్యాంకులు విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఆ సంస్థలు 2017, మార్చి నెల నాటికి 5000 కోట్ల రూపాయలను విద్యార్థులకు రుణంగా అందజేశాయి. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు చేసిన పొరపాట్లను ఈ సంస్థలు చేయడం లేదు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ సైస్స్ కోర్సులు చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొలాటరల్ లేదా మూడవ పార్టీ గ్యారెంటీ అవసరం లేని రుణాలను మంజూరు చేయడం లేదు. ఉద్యోగాలు లేక , రాక, వచ్చిన తక్కువ జీతాలను ఆఫర్ చేయడం వల్ల తాము రుణాలను చెల్లించలేక పోతున్నామని మొండి బకాయిల విద్యార్థులు వాపోతున్నారు. నీరవ్ మోదీ లాంటి వాళ్లు వేల, వేల కోట్ల రూపాయలను చెల్లించక పోయినా పట్టించుకోరుగానీ, తాము పది, పాతిక లక్షల రూపాయలను చెల్లించకపోతనే బ్యాంకులు లబోదిబోమంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా జాగ్రత్త!
బ్యాంకింగ్ యాప్స్ టార్గెట్‌గా మరో పెనుభూతం వచ్చింది. పలు భారతీయ బ్యాంకుల యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్ యాప్స్‌ను 'ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ9480' అనే ట్రోజన్ మాల్వేర్ టార్గెట్ చేసిందని హీల్ సెక్యురిటీ ల్యాబ్స్ రిపోర్టులు వెల్లడించాయి. యూజర్ల లాగిన్ డేటా, ఎస్ఎంఎస్, కాంటాక్ట్ లిస్టులను హానికర సర్వర్‌లో అప్లోడ్ చేసినట్టు పేర్కొన్నాయి. అదనంగా బ్యాంకింగ్ యాప్స్‌తో పాటు, యూజర్ల ఫోన్లలో వాడే క్రిప్టోకరెన్సీ యాప్స్‌ను కూడా ఈ ట్రోజన్ టార్గెట్ చేసిందని తెలిపింది. ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ టార్గెట్ చేసిన దేశీయ బ్యాంకింగ్ యాప్స్ జాబితాను కూడా క్విక్ హీల్ విడుదల చేసింది. వాటిలో యాక్సిస్ మొబైల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ ఎనీవేర్ పర్సనల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్, బరోడా ఎంపాస్‌బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. థర్డ్‌పార్టీ స్టోర్ల ఫేక్ ఫ్లాష్ ప్లేయర్ ద్వారా ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ9480 మాల్వేర్ విజృంభిస్తుందని క్విక్ హీల్ రిపోర్టు చేసింది. సైబర్‌క్రిమినల్స్‌కు ఫ్లాష్ ప్లేయర్ యాప్ చాలా పాపులర్ టార్గెట్. ఒక్కసారి యూజర్లు ఈ హానికర అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేస్తే, కనిపించని ఐకాన్ యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అది టార్గెట్ చేసిన 232 బ్యాంకింగ్ యాప్స్‌కు సంబంధించి ఏ ఒక్క యాప్‌ను యూజర్లు చెక్ చేసుకున్నా.. ఆ హానికర యాప్ బ్యాంక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యూజర్ల డేటాను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కీలక డేటాను దొంగలిస్తుందని క్విక్ హీల్ రిపోర్టు చేసింది. -
ఈ బ్యాంకుల్లో ఇంతే...
న్యూఢిల్లీః సగటు మదుపరిపై భారతీయ బ్యాంకులు పంజా విసురుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను కోత పెడుతున్నాయి. నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఉండటం, ద్రవ్యోల్బణం దిగి రావడంతో వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించేస్తున్నాయి. దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును నాలుగు శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించడంతో ఇతర బ్యాంకులూ అదే బాట పట్టాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ కలిగిన పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 4 నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో కోతలు విధించింది. ఇండియన్ బ్యాంక్, కర్నాటక బ్యాంక్‌లూ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. మరో వైపు పొదుపు ఖాతాలపై ఆరు శాతం వడ్డీ రేటుతో మదుపరులను ఆకర్షించే యస్ బ్యాంక్ సైతం వడ్డీ రేటును ఒక శాతం తగ్గించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
నగదు రహితానికి ముందుకు రావాలి
ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులను కోరిన కలెక్టర్ బాబు.ఎ విజయవాడ: జిల్లాలో ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ముందుకు రావాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులను కలెక్టర్ బాబు.ఎ కోరారు. మంగళవారం జిల్లాలో అమలు జరుగుతున్న ఆధార్ ఆధారిత లావాదేవీల పనితీరును పరిశీలించటానికి వచ్చిన ఐసీఐసీఐ బృందం కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఢిల్లీ బృందంలో ఐసీఐసీఐ జీఎం అనుభూతి సంఘ్వీ, జేజీఎం శ్రీధర్, డీజీఎం సైరా, ఏజీఎం హరీష్ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 120 టీములు 150 వాహనాల ద్వారా 6 లక్షల మంది వర్తకులను గుర్తించామన్నారు. వీరందరికీ ఆధార్ అనుసంధానం చేశామని చెప్పారు. గుర్తించిన వర్తకులకు పోస్, బయోమెట్రిక్ ఫింగర్ స్కానర్ పరికరాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంకు, హెడీఎఫ్సీ ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకులు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌకధరల దుకాణాలతోపాటు ఎరువులు, ఉపాధికూలీలకు నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని బృందానికి వివరించారు. నగదు రహిత లావాదేవీల కోసం ఐసీఐసీఐ బ్యాంకు తరఫున 50 మంది కరస్పాండెంట్లను కేటాయించాలని కోరారు. అనంతరం ఈ విధానం అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఐడీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధి సంగీత తదితరులు పాల్గొన్నారు.