సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్-సెప్టెంబర్) కోవిడ్ రెండో దశ ప్రభావంతో ఆర్థిక సంస్థల పనితీరు దెబ్బతిననుంది. దీంతో భారతీయ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కానున్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఈ విషయాలు వెల్లడించింది. ఆర్థిక రికవరీకి కోవిడ్‌పరమైన సమస్యల ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపింది. ఒకవేళ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి.. కొత్తగా లాక్‌డౌన్‌లు విధించాల్సి వస్తే మరింత ప్రతికూల పరిస్థితులు తప్పకపోవచ్చని పేర్కొంది. రాబోయే 12–18 నెలల్లో బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండిబాకీలు భారీగా 11–12 శాతం స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ తెలిపింది.
సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికపరమైన బలహీన పరిస్థితులు కాస్త ముందుకు జరిగాయని, ఆర్థిక సంస్థలకు సంబంధించి రుణ బాకీల వసూళ్లు.. లోన్‌ల మంజూరు తగ్గడం రూపంలో ప్రథమార్ధంలోనే ఇది ప్రతిఫలించవచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ ఛాబ్రియా తెలిపారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి దేశం క్రమంగా కోలుకునే క్రమంలో దేశీ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కావచ్చని ఆమె పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు నుంచే బ్యాంకులు మొండి బాకీల సమస్యతో సతమతమవుతుండగా.. కోవిడ్ రాకతో పరిస్థితులు కచ్చితంగా మరింత దిగజారాయని తెలిపారు. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’)
టూరిజం, రియల్టీలో మొండిబాకీలు..
పర్యాటకం, తత్సంబంధ రంగాలు, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్, అన్‌సెక్యూర్డ్ రిటైల్ రుణాలు మొదలైనవి మొండిబాకీల (ఎన్‌పీఎల్) పెరుగుదలకు కారణం కాగలవని ఎస్‌అండ్‌పీ తెలిపింది. అయితే, ఈ రంగాలకు బ్యాంకులు ఒక మోస్తరుగానే రుణాలిచ్చాయని.. కాబట్టి ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది. చిన్న సంస్థలకు లేదా వాణిజ్య వాహనాల కోసం రుణాలతో పోలిస్తే గృహ రుణాలు (ఎఫర్డబుల్ హౌసింగ్ మినహా), బంగారం రుణాలపైనా ప్రభావం తక్కువే ఉండవచ్చని ఎస్‌అండ్‌పీ వివరించింది.
బ్యాంకుల కన్నా ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీలకే ఇవి ఆందోళనకరంగా ఉండవచ్చని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో నగదు సరఫరా కాస్త పెరగనున్నప్పటికీ.. కొందరు రుణగ్రహీతలు కొండలా పేరుకుపోతున్న అప్పును తీర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని వివరించింది. సెకండ్ వేవ్ వల్ల రెండో విడత రుణాల పునర్‌వ్యవస్థీకరణ అమలు చేయడం వల్ల మొండిబాకీలను గుర్తించే ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. పునర్ వ్యవస్థీకరించిన రుణాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. (Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!)
ప్రభుత్వం పైనే భారం..
కోవిడ్ కారణంగా దేశీ ఆర్థిక సంస్థల పనితీరుపై పడే ప్రతికూల ప్రభావాలు తగ్గడమనేది.. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రకటించిన చర్యలు ఎంత సమర్ధమంతంగా అమలవుతాయన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. మరిన్ని కొత్త వేరియంట్లు రావడం, అంచనాల కన్నా తక్కువ స్థాయిలో టీకాలు వేసే అవకాశాలు మొదలైన రిస్కులు కూడా ఉన్నాయని తెలిపింది. ‘పరిమిత స్థాయిలో టీకాల సరఫరా, ప్రజల్లో సందేహాలు మొదలైన అంశాలన్నీ టీకాల కార్యక్రమం చకచకా ముందుకు సాగడానికి ప్రతిబంధకాలుగా మారాయి. జనాభాలో దాదాపు 70శాతం మందికి టీకాలు వేయాలంటే ప్రథమార్ధం అంతా సరిపోవచ్చు. ఈలోగా కొత్త కేసులు పెరిగి లాక్‌డౌన్‌లు తిరిగి విధించాల్సి వస్తే.. ఆర్థిక రికవరీకి మళ్లీ తప్పకపోవచ్చు‘ అని వివరించింది. (Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు)
Comments
Please login to add a commentAdd a comment