సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ కుటుంబంలో ఒక్కరికి సోకితే మిగతా సభ్యులందరికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్దల్లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తున్నప్పటికీ... 10 సంవత్సరాలలోపు మెజార్టీ పిల్లల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోవిడ్ బాధితుల్లో పదేళ్లలోపు చిన్నారులు 2.9 శాతం మంది ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో కూడా మెజార్టీ పిల్లలకు లక్షణాలుండడం లేదు. త్వరలో మూడోదశ కోవిడ్–19 వ్యాప్తిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించడం మరింత ఊరట కలిగించే అంశం. చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
పిల్లలతో పెద్దలకు వ్యాప్తి
వాస్తవానికి వారం క్రితం వరకు పదేళ్లలోపు కోవిడ్ బాధితులు 2.7 శాతం మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వ్యాప్తి రేటు 0.2 శాతం పెరిగినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతమున్న వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావం అధికంగా ఉండడంతో.. ఒకవేళ పిల్లలు వైరస్ బారిన పడితే.. లక్షణాల్లేక మామూలుగా తిరగడం వల్ల వారు వైరస్ వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
తగ్గిన పాజిటివిటీ
ఇక రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్ నేపథ్యంలో 50 సంవత్సరాలు పెబడిన వారి పాజిటివిటీ కాస్త తగ్గింది. వయసుల వారీగా పరిశీలిస్తే సగటున 0.15 శాతం పాజిటివిటీ తగ్గగా.. 10 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలలోపు వయసున్న వారిలో మాత్రం వ్యాప్తి పెరిగినట్లు వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
మార్గదర్శకాలు పాటించాల్సిందే..
దేశంలో ఈనెల 1నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. టీకా నిల్వలు లేకపోవడంతోనే చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశాయి. ఈ క్రమంలోనే 45 ఏండ్లు నిండిన వారికి సైతం టీకాలివ్వడం లేదు. రెండోడోసు వేసుకునే వారికి అనుమతివ్వాలని భావించినప్పటికీ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో పదిరోజుల నుంచి టీకాల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో రెండోడోసు తీసుకోవాల్సిన లబ్ధిదారులు ఇప్పటికే 5 లక్షల మంది వేచి చూస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడో దశ వైరస్ వ్యాప్తి ప్రచారం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలూ కోవిడ్–19 మార్గదర్శకాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లల విషయంలో ఆందోళన అవసరం లేదు
కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా.. ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన ప్రకటన ప్రకారం కూడా, పిల్లల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లలకు సంబంధించి ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో చాలావరకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి సోకుతున్నవేనని తెలుస్తోంది. మా ఆస్పత్రిలో కూడా పిల్లల అడ్మిషన్లు పెద్దగా లేవు. చేరినవారు కూడా తల్లిదండ్రుల్లో సివియర్ కావడంతో అడ్మిట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పది, పన్నెండేళ్లలోపు చిన్నారులు పెద్దగా చేరుతున్న ఉదంతాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉండడం వల్లే పెద్దగా దుష్ప్రభావాలు కనిపించడం లేదు. చాలామందిలో అసలు లక్షణాలే ఉండటం లేదు.
జ్వరమొచ్చినా పారాసిటమల్, జింకోవిట్, అజిత్రాసిల్ వేసుకుంటే తగ్గిపోతుంది. లక్షణాలున్న పిల్లల్లో కూడా శాచురేషన్ డౌన్ కాకపోవడం, సీటీ విలువల్లో పెద్దగా మార్పులు లేకపోవడం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. సీటీ స్కాన్‌లను పరిశీలించినప్పుడు కూడా ఎక్కడా దాని దాఖలాలు ఉండటం లేదు. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా చిన్నపిల్లల వ్యాధుల్లో ఇది ఆందోళన కలిగించేదిగా ఎంత మాత్రం లేదు. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా పిల్లల శ్వాసకోశాలపై ప్రభావం పడుతుందని అనుకోవడం లేదు.
– డాక్టర్ బి.నరహరి, ఆసోసియేట్ ప్రొఫెసర్, (పీడియాట్రిక్స్), నీలోఫర్ ఆస్పత్రి
రాష్ట్రంలో కోవిడ్–19 బాధితుల శాతం వయసు వారీగా
వయసు శాతం
10 లోపు 2.9
11–20 10.6
21–30 21.7
31–40 21.8
41–50 17.5
51–60 14.4
61–70 7.7
71–80 2.7
81 పైబడి 0.7
Coronavirus: చిన్నారీ.. నో వర్రీ!
Published Mon, May 24 2021 1:58 AM | Last Updated on Mon, May 24 2021 12:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment