సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలగనుంది. జనవరి 3వ తేదీ నుంచి 15– 18 ఏళ్లలోపువారికి టీకాలు వేయనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏ జిల్లాలో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారు? వంటి అంశాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడమే ఆలస్యం. జిల్లాల వారీగా గుర్తించిన 15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. హెల్త్‌కేర్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు దాటిన వారికి సైతం జనవరి 10 నుంచి బూస్టర్ డోసు టీకాలు వేయనున్నారు.
అంచనా ఇలా..
►గ్రేటర్ పరిధిలోని కోటి జనాభాలో 18 ఏళ్లలోపు వారు సుమారు 35 లక్షల మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరిలో 15 నుంచి 18 ఏళ్ల లోపు సుమారు 7 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా నిర్వహించే జాతీయ పల్స్‌పోలియో లెక్కల ప్రకారం నగరంలో 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 9.5 లక్షల వరకు ఉన్నట్లు అంచనా.
►విద్యాశాఖ లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1 నుంచి పదో తరగతి వరకు 21 లక్షల మంది చదువుతుండగా, ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సులు చదువుతున్న వారు మూడు లక్షలకుపైగా ఉన్నారు. 18 ఏళ్లలోపు వయసు ఉండి ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, డిగ్రీ, ఇతర కోర్సులు చదువుతున్న మరో మూడు లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరితో పాటు మధ్యలో చదువు మానేసిన వారు, అసలు బడి ముఖం కూడా చూడని వారు మరో లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా.
►వీరిలో కేవలం గ్రేటర్ వాసులే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా ఉన్నారు. తొలి దశలో 15– 18 ఏళ్ల టీనేజర్లకు టీకాలు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశల వారిగా మిగిలిన చిన్న పిల్లలకు కూడా టీకాలు వేయనున్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా ఎక్కడిక్కడ విద్యాసంస్థల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి టీకా లు వేయడం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్‌లో మేడ్చల్ వెనకబాటు..
►పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి ఇప్పటి వరకు నిర్వహించిన వ్యాక్సినేషన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ చాలా వరకు వెనకబాటులో ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యానికి తోడు.. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి టీకాలు తెప్పించి, వ్యాక్సినేషన్ కేంద్రాలకు సకాలంలో చేర్చకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది.
►ఇక హైదరాబాద్, రంగారెడ్డిలో టార్గెట్ పాపులేషన్‌కు మించి టీకాల సంఖ్య నమోదు కావడం విశేషం. జిల్లాలో ఇప్పటికీ మరో 15 శాతం మంది కనీసం ఫస్ట్ డోసు టీకా కూడా వేసుకోకపోవడాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ టీకాల కార్యక్రమం ఎంత అధ్వానంగా జరుగుతోందో అర్థమవుతోంది. పెద్దలకు టీకాలు వేసే విషయంలోనే ఇంత వెనకబడిపోతే.. జనవరి నుంచి ప్రారంభం కానున్న పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.
ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానం..
ఒమిక్రాన్ కేసుల నమోదులో జీహెచ్‌ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అత్యధికంగా మహారాష్ట్రలోని ముంబైలో పాజిటివ్ కేసులు నమోదై మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి వరుస స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ మహానగరం ఉండటం గమనార్హం. ఈ వైరస్ తీవ్రత అంతగా లేకున్నా.. డెల్టాతో పోలిస్తే వేగంగా విస్తరించే లక్షణం ఉండటం ఆందోళన కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment