బిజినెస్ డెస్క్: ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టిన ఓ స్టార్టప్.. ఆర్నెల్లు తిరగకుండానే మూతపడింది. బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ప్రొటన్.. భారత్‌లో బోణీ మొదలుపెట్టకముందే మూతపడినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు.
అనిల్ గోటేటి, మౌసమ్ భట్‌లు కిందటి ఏడాది ప్రొటన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 2021 జులైలో అమెరికాలో ఈ స్టార్టప్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. న్యాయవాదులు, గ్రాఫిక్ డిజైనర్లు, పోషకాహార నిపుణులు, ఇలా స్వతంత్ర నిపుణులకు.. తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌లో ప్రారంభించడానికి, వీడియోలను రూపొందించడానికి, ప్రత్యక్ష సెషన్‌లను నిర్వహించడానికి, చెల్లింపు లింక్‌లను రూపొందించడానికి, వాళ్ల వ్యాపారాన్ని ట్రాక్ చేయడానికి ఇది తన ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందని ఆరంభంలో ప్రకటించుకుంది పొటాన్. దీంతో 9 మిలియన్ డాలర్ల(సుమారు 66 కోట్ల రూపాయలపైనే) ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. అయితే..
కరోనా ఎఫెక్ట్‌తో ఈ స్టార్టప్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆదరణ దక్కకపోవడంతో భారత్‌లో ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టకముందే కార్యకలాపాలను మూసివేసింది. ఉద్యోగులందరినీ రీలీవ్ చేయడంతో పాటు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చినట్లు ప్రకటించుకుంది. ప్రొటన్‌లో మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్, 021 క్యాపిటల్, టాంగ్లిన్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి, ఉడాన్ కో-ఫౌండర్ సుజీత్ కుమార్, క్రెడ్ కునాల్ షా సైతం ప్రొటన్‌లో పెట్టుబడులు పెట్టారు.
గోటేటి గతంలో ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెడిసెంట్‌గా పని చేసి.. 2020 నవంబర్‌లో కంపెనీని వీడారు. అలాగే భట్ గతంలో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసి.. ఆపై గూగుల్‌లోనూ పని చేశారు. ఇదిలా ఉంటే ముంబైకి చెందిన ఇన్సూరెన్స్ స్టార్టప్ బీమాపే కూడా కార్యకలాపాల్ని ప్రారంభించిన ఏడాదిలోపే మూతపడడం విశేషం. ఇక భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా పప్రోద్భలంతో మొదలైన ఏఐ ఛాట్‌బోట్ డెవలపర్ నికీ కూడా కిందటి ఏడాది మూతపడింది.
Comments
Please login to add a commentAdd a comment