న్యూఢిల్లీ: భారత బ్యాంకుల లాభదాయకత ఆరోగ్యకర స్థాయిలో స్థిరపడుతుందని, ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడడం కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ అంచనా వేసింది. ‘‘భారత బ్యాంకుల లాభాలు ఇక మీదట ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల భారం గణనీయంగా పెరిగిన దగ్గర్నుంచి, గత ఏడేళ్లలో ఈ రంగం ఎంతో మెరుగుపడింది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలిసేత్ ఛాబ్రియా తెలిపారు.
రుణ వసూళ్లు బలంగా ఉన్నాయని, భారత బ్యాంకులు దశాబ్ద కాలంలో మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయని ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ పేర్కొంది. క్రెడిట్ వ్యయాలు తక్కువగా ఉండడం, అధిక నికర వడ్డీ మార్జిన్ల నుంచి ప్రయోజనం పొందడం వల్ల భారత బ్యాంకింగ్ రంగం ప్రయోజనం చూస్తున్నట్టు తెలిపింది.
వ్యవస్థ అంతటా ఆస్తులపై సగటు రాబడులు (ఆర్‌వోఏఏ) 1.2 శాతంగా 2022–23లో ఉంటాయని, 2023–24లో 1.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా వచ్చే ఎన్‌పీఏలు తక్కువగానే ఉన్నట్టు తెలిపింది. మాఫీ చేసిన రుణాలు వసూలు అవుతుండడంతో వాటి లాభాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. భారత్ బలమైన ఆర్థిక పనితీరు బ్యాంకింగ్ రంగానికి సానుకూలమని ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ అంచనా వేసింది. 2026 వరకు భారత్ ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధిని చూస్తుందని, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment