2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌! | S&P Global Says India To Become Third Largest Economy In The World By 2030, See Details Inside - Sakshi
Sakshi News home page

2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌!

Published Wed, Dec 6 2023 1:26 AM | Last Updated on Wed, Dec 6 2023 9:16 AM

India to become third largest economy in the world by 2030 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ విశ్లేషించింది. అయితే ‘అపారమైన అవకాశాన్ని’ అన్‌లాక్‌ చేసి తదుపరి అతిపెద్ద ప్రపంచ తయారీ కేంద్రంగా మారడం దేశానికి ప్రధాన పరీక్ష అని పేర్కొంది. ఏప్రిల్‌తో  ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అంచనా వేసిన 6.4 శాతం వృద్ధి వేగం 2026 నాటికి 7 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది.

రాబోయే మూడేళ్లలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రేటింగ్‌ ఏజెన్సీ అంచనా వేస్తోంది. సేవల–ఆధిపత్య ఆర్థిక వ్యవస్థ నుండి భారత్‌ తయారీ–ఆధిపత్యంగా మార్చడానికి బలమైన లాజిస్టిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం కీలకమని ‘గ్లోబల్‌ క్రెడిట్‌ ఔట్‌లుక్‌ 2024: కొత్త ఇబ్బందులు, మార్గాలు’ అన్న అంశంపై విడుదల చేసిన నివేదికలో రేటింగ్‌ సంస్థ పేర్కొంది.

 2022–23లో భారత్‌ ఎకానమీగా వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. 3.75 ట్రిలియన్‌ డాలర్లతో భారత్‌ ఐదవ స్థానంలో నిలుస్తోంది.  కాగా, 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు  ఉన్నాయి. తాజా నివేదికలో ఎస్‌అండ్‌పీ పేర్కొన్న ముఖ్యాంశాలు..

► శ్రామిక మార్కెట్‌ సామర్థ్యాన్ని అన్‌లాక్‌ చేయడం అనేది కార్మి కుల నైపుణ్యం పెంపొందించడం, శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాల్లో విజయం ద్వారా భారత్‌ తన అధిక శాతం యువత నుంచి ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతుంది. 

► వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ వచ్చే దశాబ్దంలో భారత్‌లో అధికంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌ రంగానికి ప్రయోజనం చేకూర్చుతుంది.   

► 2024లో 50 కంటే ఎక్కువ దేశాల్లో ఎన్నికలు (అధ్యక్ష/లేదా శాసన సభలు) ఉన్నాయి. వీటి ఫలితాలపై ఆధారపడి చాలా వరకు ప్రపంచ పరిణామాలు ఉండవచ్చు. 

► త్వరలో మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న యుద్ధంలో చిక్కుకున్న రష్యా– ఉక్రెయిన్‌ రెండు దేశాల్లో మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడం గమనార్హం. భారత్‌సహా ఇండోనేíÙయా, దక్షిణాఫ్రికా, మెక్సికో వంటి వర్థమాన దేశాలు కూడా ఎన్నికలకు వెళ్లనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement