
ఆర్థికవేత్తలతో చర్చల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చే దిశలో ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆర్థికవేత్తలతో సమావేశం అయ్యారు. 2025–26 బడ్జెట్, ఆర్థిక పురోగతిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2025–26 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో సమరి్పస్తుండడం ఈ సమావేశం నేపథ్యం.
కీలక అంశాలపై సూచనలు..
ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను సమీకరించడం వంటి కొన్ని అంశాలు ప్రధాని–ఆర్థికవేత్తల పరస్పర చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశి్చతులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, యువతలో ఉపాధిని పెంపొందించే వ్యూహాలు వంటి పలు అంశాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఆర్థికవేత్తలు సూచనలు, సలహాలు అందించారు. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఎగుమతుల పెంపు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై కూడా ఆర్థికవేత్తలు కీలక సూచనలు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థికమంత్రి సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌సహా సుర్జిత్ భల్లా, డీకే జోషివంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.