న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్‌లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం.
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్‌లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి.
దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్‌లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment