నగదు రహితానికి ముందుకు రావాలి
ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులను కోరిన కలెక్టర్ బాబు.ఎ
విజయవాడ: జిల్లాలో ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ముందుకు రావాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులను కలెక్టర్ బాబు.ఎ కోరారు. మంగళవారం జిల్లాలో అమలు జరుగుతున్న ఆధార్ ఆధారిత లావాదేవీల పనితీరును పరిశీలించటానికి వచ్చిన ఐసీఐసీఐ బృందం కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఢిల్లీ బృందంలో ఐసీఐసీఐ జీఎం అనుభూతి సంఘ్వీ, జేజీఎం శ్రీధర్, డీజీఎం సైరా, ఏజీఎం హరీష్ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 120 టీములు 150 వాహనాల ద్వారా 6 లక్షల మంది వర్తకులను గుర్తించామన్నారు.
వీరందరికీ ఆధార్ అనుసంధానం చేశామని చెప్పారు. గుర్తించిన వర్తకులకు పోస్, బయోమెట్రిక్ ఫింగర్ స్కానర్ పరికరాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంకు, హెడీఎఫ్‌సీ ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంకులు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌకధరల దుకాణాలతోపాటు ఎరువులు, ఉపాధికూలీలకు నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని బృందానికి వివరించారు. నగదు రహిత లావాదేవీల కోసం ఐసీఐసీఐ బ్యాంకు తరఫున 50 మంది కరస్పాండెంట్లను కేటాయించాలని కోరారు. అనంతరం ఈ విధానం అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధి సంగీత తదితరులు పాల్గొన్నారు.